NRI: అమెరికాలో భారతీయ మహిళా ప్రొఫెసర్‌పై లింగ వివక్ష ఆరోపణలు

ABN , First Publish Date - 2022-11-29T17:55:50+05:30 IST

భారతీయ ప్రొఫెసర్‌ షీనా అయ్యంగార్ తనపై లింగ వివక్ష ప్రదర్శించారంటూ ఓ అమెరికా మహిళ తాజాగా కోర్టుకెక్కారు.

NRI: అమెరికాలో భారతీయ మహిళా ప్రొఫెసర్‌పై లింగ వివక్ష ఆరోపణలు

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఓ భారతీయ ప్రొఫెసర్‌పై ఓ యువతి కోర్టుకెక్కారు. ప్రొఫెసర్ షీనా అయ్యంగార్ తనపై లింగ వివక్ష(Gender Discrimination) ప్రదర్శించారంటూ కొలంబియా బిజినెస్ స్కూల్‌లో(Columbia Business School) రీసెర్చ్ అసోసియేట్‌గా చేసిన ఎలిజబెత్ బ్లాక్‌వెల్ అనే మహిళ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

2017లో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందిన ఎలిజబెత్ బ్లాక్‌వెల్(Elizabeth Blackwell) ఆ తరువాత.. షీనా అయ్యంగార్(Sheena Iyengar) వద్ద రీసెర్చ్ అసోసియేట్‌గా(Research Associate) చేరారు. ఆ సమయంలో షీనా తనతో వ్యక్తిగత పనులతో పాటూ కాలేజీకి సంబంధించిన పనులు చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. తనతో షీనా మెకప్ వేయించుకున్నారని చెప్పారు. రోమాంటిక్ డేట్లకు వెళ్లాల్సి వస్తే తనతో రెస్టారెంట్లలో టేబుల్స్ బుక్ చేయించారని ఆరోపించారు. పురుష రీసెర్చ్ అసోసియేట్లతో మాత్రం షీనా భిన్నంగా వ్యవహరించే వారని చెప్పుకొచ్చారు. తన పురుష సహోద్యోగికి అతడి విధులకు సంబంధంలేని రీసెర్చ్ బాధ్యతలను అప్పగించేవారని అన్నారు. తనకు మాత్రం మహిళలు మాత్రమే చేసే పనులను అప్పజెబుతూ లింగ వివక్ష ప్రదర్శించారని తాజాగా కేసు దాఖలు చేశారు.

2019లో యూనివర్సిటీతో తన కాంట్రాక్ట్ ముగిశాక ఈ విషయమై ఫిర్యాదు చేశానని ఎలిజబెత్ చెప్పుకొచ్చారు. కానీ.. యూనివర్సిటీ అధికారులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా.. బ్లాక్‌వెల్ ఫిర్యాదుపై అప్పట్లోనే షీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేతిలో వివక్షకు గురైంది తానేనని, తాను అంధురాలైన కారణంగా వేధింపులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలు అస్సలు కలవలేదని చెప్పారు. అయితే.. ఎలిజబెత్ ఫిర్యాదు కారణంగానే ఆమె కాంట్రాక్ట్‌ను రద్దు చేశారని ఆమె తరపు లాయర్ ఆరోపించారు. కాంట్రాక్ట్ ముగిశాక తనకు మరో చోట ఉపాధి దొరకలేదని, తాను తీవ్ర కుంగుబాటుకు లోనయ్యానని పేర్కొన్నారు. కాగా.. షీనా అయ్యంగార్‌కు అమెరికాలో మంచి పేరుంది. ఛాయిస్ అనే సబ్జెట్‌లో ఆమె నిపుణురాలని ఆమెరికా మీడియా పలుమార్లు ప్రశంసించింది. ఆమె రచించిన ‘ఆర్ట్ ఆఫ్ ఛూసింగ్’(Art of Choosing) అనే పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా.. టెడ్ టాక్స్ వేదికల్లో షీనా పలుమార్లు స్ఫూర్తివంతమైన ప్రసంగాలు కూడా చేశారు.

Updated Date - 2022-11-29T17:59:51+05:30 IST