Layoffs 2022: గగ్గోలు పెడుతున్న హెచ్-1బీ వీసాదారులు, లైఫ్ తలకిందులు!
ABN , First Publish Date - 2022-11-11T20:15:09+05:30 IST
ఫేస్‌బుక్‌లో జాబ్స్ పోగొట్టుకున్న భారతీయులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్‌లో(Facebook) జాబ్స్ పోగొట్టుకున్న( Mass layoffs 2022) భారతీయులు(Indians) తమ ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మంచి ఉద్యోగ భద్రత ఉన్న జాబ్స్ వదులుకుని మరీ ఫేస్‌బుక్‌లో చేరిన రెండు మూడు రోజులకే కొందరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా(Meta) కేవలం రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందిని తొలగించింది. ‘‘చాలా కష్టపడి వీసా సంపాదించాను. జస్ట్ గత వారమే కెనడాకు వెళ్లా. మెటాలో చేరిన రెండు రోజులకే నా జాబ్ పోయింది అంటూ నీలిమా అగర్వాల్ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన ఆమె ఆ ఉద్యోగాన్ని వదులుకుని మెటాలో చేరేందుకు కెనడాకు వెళ్లారు.
బెంగళూరుకు చెందిన విశ్వజీత్ ఝాది కూడా ఇదే పరిస్థితి. మెటాలో చేరకమునుపు..ఆయన మూడేళ్ల పాటు అమెజాన్‌లో పనిచేశారు. ‘‘సుదీర్ఘ వీసా ప్రక్రియ ముగించుకుని మూడు రోజుల క్రితమే మెటాలో చేరా. కానీ..ఇలా అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో పడ్డ వారిని చూస్తుంటే నా గుండె ద్రవిస్తోంది’’ అని ఝా తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. మెటా తొలగింపులతో అనేక మంది భారతీయులు తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయారు.
దాదాపు 16 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న రాజు కదమ్ పరిస్థితి కూడా ఫేస్‌బుక్ తొలగింపులతో తలకిందులైంది. అమెరికా వెళ్లాక ఎప్పుడూ ఆయన జాబ్ లేకుండా ఖాళీగా ఉండలేదు. ఆయన ఫేస్‌బుక్ టెక్నికల్ టీంలో పనిచేసేవారు. ‘‘నాకు హెచ్-1బీ వీసా ఉంది. ఇప్పుడు అమెరికాను వీడే సమయం ఆసన్నమైంది. అమెరికాలో నేను 16 ఏళ్లుగా ఉంటున్నా. 2008, 2015, 2020 నాటి గ్లోబల్ ఆర్థిక ఒడిదుడుకుల్లోనూ నేను జాబ్ కోల్పోలేదు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు అమెరికాలోనే పెరిగి పెద్దవాళ్లయ్యారని, వారిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే.. ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోల్పోయిన వారికి మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ పరిహారం ప్రకటించారు. జాబ్ నుంచి తొలగించాక 16 వారాల పాటు మూల వేతనం చెల్లించడంతో పాటూ.. ఉద్యోగుల అనుభవాన్ని బట్టి సంవత్సరానికి రెండు వారాల చొప్పున మూల వేతనం ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. వీసాపై మెటాలో పనిచేస్తున్న విదేశీయుల కోసం కూడా పలు చర్యలు తీసుకున్నారు.