NRI: ఐర్లాండ్‌కి రెండోసారి ప్రధాని కానున్న భారత సంతతి నేత

ABN , First Publish Date - 2022-12-16T21:39:45+05:30 IST

ఐర్లాండ్‌లోని ప్రముఖ భారత సంతతి నేత లియో ఎరిక్ వరాడ్కార్ మరోసారి ఆ దేశ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు.

NRI: ఐర్లాండ్‌కి  రెండోసారి ప్రధాని కానున్న భారత సంతతి నేత

ఎన్నారై డెస్క్: ఐర్లాండ్‌లో ప్రముఖ భారత సంతతి నేత లియో ఎరిక్ వరద్కార్‌ (Leo Eric Varadkar) మరోసారి ఆ దేశ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐర్లాండ్‌లో(Ireland) మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం (Coalition Government) అధికారంలో ఉంది. 2020లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రభుత్వాధినేత పదవిని విడతల వారీగా చేపట్టాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఫైన్ గేల్ పార్టీకి చెందిన లియో మరోసారి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత నేత మైఖేల్ మార్టిన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. లియో ప్రస్తుతం డిప్యూటీ ప్రధానిగా ఉన్నారు.

విభిన్న వారసత్వాలు కలిగిన లియో 2017లో తొలిసారిగా ఐర్లాండ్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. తదనంతర పరిణామాల్లో ఆయన ప్రాభవం కోల్పోయారు. 2020లో జరిగిన ఎన్నికల్లో మరో రెండు పార్టీలతో కలిసి ఫైన్ గేల్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక.. లియో తాను గే అని గతంలోనే బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు.. లియో ప్రధాని పగ్గాలు చేపట్టడం మినహా ఐర్లాండ్ మంత్రివర్గం కూర్పులో చెప్పుకోదగ్గ మార్పులేవీ ఉండవని అక్కడి రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - 2022-12-16T21:53:50+05:30 IST