Rishi Sunak: రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి నెలరోజులు పూర్తి.. ప్రస్తుతం అక్కడి సీన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-25T22:17:07+05:30 IST

బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్ అక్కడి ప్రజల మనసులను గెలుచుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన నెలరోజుల తరువాత..ఆయన పాపులారిటీ మరింత పెరిగింది.

Rishi Sunak: రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి నెలరోజులు పూర్తి.. ప్రస్తుతం అక్కడి సీన్ ఏంటంటే..

లండన్: బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్(Rishi Sunak) అక్కడి ప్రజల మనసులను గెలుచుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన నెలరోజుల తరువాత..ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. అధికార కన్సర్వేటివ్ పార్టీ(Conservative Party) కంటే రిషికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తాజాగా జరిగిన సర్వేలో తేలింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, జీవన వ్యయాల పెరుగుదల వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బ్రిటన్‌ను గట్టెక్కించగలిగే సమర్థుడినని రిషి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఇక.. గత ప్రధాని లిజ్ ట్రస్(Lizz Truss) వైఫల్యం తరువాత.. రిషి సునాక్ నాయకత్వంపై బ్రిటన్ ప్రజల్లో మరింతగా నమ్మకం పెరిగింది.

ఇప్సోస్ పొలిటికల్ మానిటర్(Ipsos Political Monitor) నవంబర్‌లో జరిపిన సర్వే ప్రకారం.. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రిషికి మద్దతు పలకగా మరో 41 శాతం మంది ఆయనను వ్యతిరేకించారు. అయితే.. కేవలం 26 శాతం మంది మాత్రమే కన్సర్వేటివ్ పార్టీకి మద్దతుగా నిలిచారు. జూన్ 2007తో పోలిస్తే.. కన్సర్వేటివ్ పార్టీకి ఇంత తక్కువ రేటింగ్ రావడం ఇదే ప్రథమం. అప్పట్లో డేవిడ్ కెమరూన్(David Cameroon) నాయకత్వంలో పార్టీకి ప్రజామోదం కేవలం 29 శాతమే. తాజా సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఇద్దరు(42 శాతం).. రిషి సునాక్‌కు ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు తగిన అర్హతలు ఉన్నాయని భావిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో వచ్చిన రేటింగ్ కంటే ఇది ఏకంగా ఏడు పాయింట్లు అధికం. అయితే.. రిషి వ్యక్తిగత పాపులారిటీ పెరగడం సంతోషకరమైనదే అయినప్పటికీ.. కన్సర్వేటివ్ పార్టీకి ప్రజామోదం తగ్గడం ఆందోళన కలిగించే అంశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక..ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రస్తుతం సతమతమవుతున్న కన్సర్వేటివ్ పార్టీ 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు.. బ్రిటన్ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం రిషి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-11-25T23:49:04+05:30 IST