USA: అమెరికా వీసా నిబంధనలను పాటించాల్సిందే: భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్
ABN , First Publish Date - 2022-11-25T16:51:17+05:30 IST
అమెరికా వీసాల విషయంలో నియమనిబంధనలు అందరూ పాటించాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
అమెరికా వీసాల విషయంలో ఇతర దేశాల వలెనే భారత పౌరులకు కూడా నియమనిబంధనలు ఉన్నాయని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్(Consul General) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతీయ పౌరుడైనా లేదా విదేశీ పౌరుడైనా వాటిని అనుసరించాలని సూచించారు. కాలిఫోర్నియాలోని(California) లాస్ ఆల్టోస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలపై చర్చించారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు, అగ్రరాజ్యానికి రావాలని భావించే వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆయన స్పందించారు. వివిధ కమ్యూనిటీ సంస్థలు, సీఈవోలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, స్టార్టప్ కమ్యూనిటీ, సాంస్కృతిక సంస్థలకు సంబంధించిన పలు సమస్యలపై ఆయన అనేక విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశానికి పలు మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అమృత్ మహోత్సవాల కాలంలో మీడియాపాత్ర అనే అంశంపైనా ఆయన ప్రసంగించారు.
మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఎదుర్కోవడంపైనా డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్(TV Nagendra Prasad) చర్చించారు. భారతదేశానికి అమెరికా నుంచి అందుతున్న సహకారం, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులు వంటి అంశాలపైనా ఆయన వివరించారు. ఇటీవల కాలంలో భారత రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మంత్రులు అమెరికాలో నిర్వహించిన పర్యటనలను కూడా ఆయన ప్రస్తావించారు. కమ్యూనిటీ యోగా, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, హోలీ, సంక్రాంతి, పొంగల్, దుర్గాపూజ, బైశాఖి మొదలైన పండుగలను జరుపుకొన్న విషయాలను కూడా ఆయన వివరించారు.
వీసా విషయంపై డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇతర దేశాల మాదిరిగానే భారత పౌరులకు కూడా నియమాలు, నిబంధనలు ఉన్నాయని తెలిపారు. భారతీయ పౌరుడైనా లేదా విదేశీ పౌరుడైనా వాటిని అనుసరించాలని సూచించారు. అర్హత ఉన్న వారు OCI తీసుకోవాలని సూచించారు. ఇతర సేవల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు తీసుకోవాలని కోరారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో PCR పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి కాన్సుల్ డాక్టర్ అకున్ సభర్వాల్ మరియు కాన్సులేట్ సిబ్బంది హాజరయ్యారు.