USA: మహిళ జీవితంలో ఊహించని మలుపు.. ఆడపిల్లను కన్న కొద్ది గంటలకే..

ABN , First Publish Date - 2022-12-03T20:18:03+05:30 IST

అమెరికాలోని ఓ మహిళను ఇటీవల అదృష్టం ఊహించని విధంగా వరించింది. ఆమె ఆడబిడ్డను ప్రసవించిన కొద్ది గంటలకే లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయింది.

USA: మహిళ జీవితంలో ఊహించని మలుపు..  ఆడపిల్లను కన్న కొద్ది గంటలకే..

ఎన్నారై డెస్క్: ఇటీవల అమెరికాలోని ఓ మహిళను అదృష్టం ఊహించని విధంగా వరించింది. ఆమె ఆడబిడ్డను ప్రసవించిన కొద్ది గంటలకే లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయింది(Winning lotter after delivery). ఆ లాటరీలో ఆమెకు ఏకంగా లక్ష డాలర్లు ఆమె సొంతమయ్యాయి. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ.81 లక్షలకు సమానం.

నార్త్ కెరోలీనాకు(North Carolina) చెందిన బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ ఇటీవల ఓ లాటరీ టిక్కెట్ కొన్నారు. కాంకార్డ్(Concord) నగరంలోగల ఓ క్విక్‌ట్రిప్(Quicktrip Store) స్టోర్‌లో ఆమె టిక్కెట్ కొనుగోలు చేశారు. తన ఇద్దరు కొడుకుల పుట్టిన రోజు తారీఖు నెంబర్లతో ఉన్న టిక్కెట్‌ను ఆమె ఎంచుకున్నారు. ఆ తరువాత నవంబర్ 9న పురిటినొప్పులు మొదలవడంతో బ్రెండా ఆస్పత్రిలో చేరారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన లాటరీ టిక్కెట్ విషయాన్నే మర్చిపోయారు. అయితే.. బిడ్డను కన్న కొద్ది గంటలకు తాను లాటరీ గెలుచుకున్నట్టు బ్రెండా తెలుసుకుని తెగ సంబరపడిపోయారు. ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.

‘‘నా బిడ్డే నాకు ఈ అదృష్టాన్ని తెచ్చి పెట్టింది’’ అంటూ బ్రెండా ఉబ్బితబ్బిబ్బైపోయారు. అయితే.. తన పెద్ద పిల్లలిద్దరూ కూడా తన అదృష్టానికి కారకులని చెప్పుకొచ్చారు. వారి పుట్టిన రోజుల సంఖ్యలతోనే లాటరీ టిక్కెట్ కొన్నానని పేర్కొన్నారు. ఈ డబ్బుతో ఇంటిలోన్ తీరుస్తానని చెప్పారు. ఈ డబ్బుతో తన భర్తపై ఆర్థిక భారం తగ్గుతుందంటూ హర్షం వ్యక్తం చేశారు. లాటరీ గెలుచుకోవడం సాధారణమై అయినా.. బిడ్డను కన్న రోజే లాటరీ కూడా గెలిచినట్టు తెలవడంతో బ్రెండా కుటుంబంలో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి.

Updated Date - 2022-12-03T20:18:04+05:30 IST