Belgium : బెల్జియం అవుట్
ABN , First Publish Date - 2022-12-02T03:46:36+05:30 IST
ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియానికి దారుణ పరాభవం. గత వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్ అయి న ఆ జట్టు ఈ సారి గ్రూప్ దశనుంచే అవుటైంది. గ్రూప్ ‘ఎఫ్’లో క్రొయేషియాతో ..
క్రొయేషియాతో మ్యాచ్ డ్రా
కెనడాపై మొరాకో గెలుపు
నాకౌట్‌కు క్రొయేషియా, మొరాకో
అల్ రయాన్ (ఖతార్) : ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియానికి దారుణ పరాభవం. గత వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్ అయి న ఆ జట్టు ఈ సారి గ్రూప్ దశనుంచే అవుటైంది. గ్రూప్ ‘ఎఫ్’లో క్రొయేషియాతో గురువారంనాటి చావోరేవో మ్యాచ్‌లో గెలవాల్సిన బెల్జియం కేవలం గోల్స్‌లేని డ్రాతో సరిపెట్టింది. ఫలితంగా ఆ జట్టు 4 పాయింట్లతో గ్రూపులో మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. మరోవైపు ఐదు పాయింట్లతో గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన క్రొయేషియా రౌండ్-16కు చేరుకుంది. ఇక ఇదే గ్రూపులో దోహాలో గురువారం జరిగిన మరో పోరులో 2-1తో కెనడాను చిత్తు చేసిన మొరాకో (7) అగ్ర స్థానంతో నాకౌట్‌లో అడుగుపెట్టింది. జియేచ్ (4), నెసీరి (23) మొరాకో తరపున గోల్స్ చేశారు. క్రొయేషియా డిఫెండర్ నయేఫ్ సెల్ఫ్ గోల్ చేయడంతో కెనడాకు అప్పనంగా గోల్ లభించింది. కాగా కెనడా టోర్నీనుంచి ఇంతకుముందే నిష్క్రమించింది.
ఏదీ తెగువ..: టోర్నీలో ముందడుగు వేయాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఎంతో దూకుడు ప్రదర్శించాలి. కానీ డిబ్రూయిన్, లుకాకు వంటి స్టార్లతో కూడిన బెల్జియంలో ఆ తెగువే కనిపించలేదు. మ్యాచ్ ఆసాంతం ఆ జట్టు రక్షణాత్మక ధోరణినే అనుసరించింది. అయితే ద్వితీయార్థంలో లభించిన కొన్ని అవకాశాలను లుకాకు సద్వినియోగం చేసుకోవలేకపోవడంతో బెల్జియానికి ఓటమి తప్పలేదు. ప్రథమార్థం అదనపు సమయంలో వెర్టాంగన్ హెడర్ గోల్‌పో్‌స్టకు పక్కనుంచి వెళ్లిపోవడంతో బెల్జియానికి చాన్స్ మిస్సయింది. ఇక ద్వితీయార్థంలో క్రొయేషియా దూకుడు పెంచింది. మరోవైపు లుకాకు బరిలోకి దిగడంతో బెల్జియం దాడుల్లోనూ పదును పెరిగింది. ఈక్రమంలో రెండు జట్లకు గోల్స్ కొట్టే అవకాశాలు లభించినా వృథా అయ్యాయి.