FIFA worldcup: ఖతార్‌లోని ఫిఫా ఫ్యాన్స్‌కు ‘కేమిల్ ఫ్లూ’ గండం.. ఈ ఫ్లూ సోకిందంటే..
ABN , First Publish Date - 2022-11-29T17:15:45+05:30 IST
ఫిఫా వరల్డ్ కప్ 2022 (fifa world cup2022) మ్యాచ్‌లు వీక్షించేందుకు ఖతార్ (Qatar) వెళ్లిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు (Football fans) కొత్త వ్యాధులు సోకే ప్రమాదం పొంచివుందా ? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది.
దోహా: ఫిఫా వరల్డ్ కప్ 2022 (fifa world cup2022) మ్యాచ్‌లు వీక్షించేందుకు ఖతార్ (Qatar) వెళ్లిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు (Football fans) కొత్త వ్యాధులు సోకే ప్రమాదం పొంచివుందా ? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఖతర్‌లో ఫిఫా ఫ్యాన్స్‌కు కేమిల్ ఫ్లూ (Camel Flu) లేదా మెర్స్ (MERS) (Middle East Respiratory Sydrome) సోకే ముప్పు పెరుగుతోందని హెచ్చరిస్తూ ‘న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్ జర్నల్’లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. ‘ఇన్ఫెక్షన్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ది 2022 ఫిఫా వరల్డ్ కప్ ఇన్ ఖతార్’ పేరిట ఇటివలే ఈ అధ్యయనాన్ని ప్రచురితమైంది. ఈ రిపోర్ట్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా గుర్తించింది. కొవిడ్-19, మంకీపాక్స్, కేమిల్ ఫ్లూ (Camel flu) లేదా మెర్స్ (MERS) వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఫిఫా ఫ్యాన్స్‌ను అప్రమత్తం చేసింది.
వేలాదిమంది ఫిఫా ఫ్యాన్స్ గుమిగూడడం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాధులు ఆటగాళ్లు, జట్లు, ఫ్యాన్స్, స్థానికులకు కూడా సోకే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దోమలు, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులైన మలేరియా, ర్యాబిస్, తట్టు, హెపటైటిస్ ఏ, బీ, ట్రావెలర్స్ డయేరియాతోపాటు కొన్ని వ్యాధులకు గురయ్యే అవకాశముందని తెలిపింది. ఖతార్ వైద్య రంగాన్ని సంసిద్ధంగా ఉంచినప్పటికీ.. ఇన్ఫెక్షన్ వ్యాధుల సంక్రమణపై పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమని అప్రమత్తం చేసింది.
కేమిల్ ఫ్లూను మెర్స్ (Middle East Respiratory Sydrome) అని కూడా వ్యవహరిస్తారు. ఇదొక వ్యాప్తిచెందగల శ్వాసకోశ వ్యాధి. 2012లో తొలిసారి సౌదీఅరేబియాలో గుర్తించారు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరి సిండ్రోమ్ కరోనావైరస్ (MERs-Cov) కారణంగా మెర్స్ వస్తుందని ప్రపంచఆరోగ్య సంస్థ పేర్కొంది. దగ్గు, శ్వాసలో ఇబ్బందులు, జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. కాగా మెర్స్ కేసుల్లో 35 శాతం మరణాలు నమోదయ్యాయి. ఇదొక జూనోటిక్ వైరస్.. అంటే జంతువులు- మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుంది. 28 మెర్స్ కేసులను గుర్తించినట్టు ఖతార్ ఎపిడెమిలాజిక్ డేటా పేర్కొంది. అత్యధిక కేసులు ఒంటెలతో కాంటాక్ట్ ఉన్నవారికే నిర్ధారణ అయ్యాయని వెల్లడించింది. కాబట్టి ఒంటె ముడి పాలు, ఒంటె మూత్రం, సరిగా వండని ఒంటె మాంసానికి దూరంగా ఉండడం మంచింది. కాగా కొవిడ్-19 సంక్షోభం తర్వాత జరుగుతున్న తొలి ఫిఫా వరల్డ్ కప్ కావడంతో మ్యాచ్‌లు వీక్షించేందుకు ఫ్యాన్స్ ఖతార్‌కు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకు 1.2 మిలియన్ల మంది అభిమానులు సందర్శించి ఉంటారని ఒక అంచనాగా ఉంది.