FIFA World Cup : బ్రె‘జిల్‌.. జిల్‌’

ABN , First Publish Date - 2022-11-29T01:18:29+05:30 IST

ఓవైపు స్విట్జర్లాండ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మరోవైపు తమ సూపర్‌స్టార్‌ నెమార్‌ బరిలేకపోయినా.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బ్రెజిల్‌ ఒత్తిడిని అధిగమిస్తూ వహ్వా.. అనిపించింది.

 FIFA World Cup : బ్రె‘జిల్‌.. జిల్‌’

నాకౌట్‌లో ప్రవేశం జూ స్విట్జర్లాండ్‌పై 1-0తో విజయం

దోహా: ఓవైపు స్విట్జర్లాండ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మరోవైపు తమ సూపర్‌స్టార్‌ నెమార్‌ బరిలేకపోయినా.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బ్రెజిల్‌ ఒత్తిడిని అధిగమిస్తూ వహ్వా.. అనిపించింది. మ్యాచ్‌ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా.. 83వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్‌ కాసెమిరో చేసిన గోల్‌తో బ్రెజిల్‌ వరుసగా రెండో విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ ఉండగానే ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఈ గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌లో 1-0 తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. కెప్టెన్‌ నెమార్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లోనూ ఆడలేదు.

ప్రథమార్ధం గోల్‌ లేకుండానే..

ఇరు జట్ల నుంచి ఎదురైన హోరాహోరీ పోరు గమనిస్తే మ్యాచ్‌ కచ్చితంగా డ్రాగానే ముగుస్తుందనిపించింది. ఇక మ్యాచ్‌ ఆరంభమైన తొలి పది నిమిషాలపాటు రెండు జట్టు రక్షణాత్మక ఆటతీరుకే పరిమితమయ్యాయి. 14వ నిమిషంలో స్విస్‌కు లభించిన ఫ్రీకిక్‌ వృథా అయ్యింది. 20వ నిమిషం నుంచి క్రమేపీ బ్రెజిల్‌ ఎదురుదాడికి దిగి బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 27వ నిమిషంలో రాఫిన్హా సూపర్‌ క్రాస్‌ను అందుకున్న వినిసియస్‌ జూనియర్‌ అతి సమీపం నుంచి గోల్‌ కోసం ప్రయత్నించినా స్విస్‌ కీపర్‌ సోమర్‌ సమర్థంగా అడ్డుకోగలిగాడు. ఇక 43వ నిమిషంలో స్విస్‌ తొలిసారి బ్రెజిల్‌ గోల్‌ పోస్టుపైకి దాడికి దిగినా ఫలితం కనిపించలేదు. 45వ నిమిషంలోనూ రాఫిన్హా కార్నర్‌ కిక్‌ను స్విస్‌ కీపర్‌ ఒడిసిపట్టుకున్నాడు. ప్రథమార్ధంలో బ్రెజిల్‌కు పలు అవకాశాలు వచ్చినా స్విస్‌ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.

చివర్లో గోల్‌తో..

ద్వితీయార్ధం 65వ నిమిషంలో వినిసియస్‌ జూనియర్‌ చేసిన గోల్‌ను రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో బ్రెజిల్‌కు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత లభించిన ఫ్రీకిక్‌లు కూడా బ్రెజిల్‌కు ఉపయోగపడలేదు. 73వ నిమిషంలో రాఫిన్హా, రిచర్లిసన్‌ స్థానాల్లో సబ్‌స్టిట్యూట్స్‌ను ఆడించారు. అయితే బ్రెజిల్‌ పట్టు వీడని ప్రయత్నాలకు 83వ నిమిషంలో ఊరట లభించింది. వినిసియస్‌ అందించిన పాస్‌ను టాప్‌ కార్నర్‌ నుంచి కాసెమిరో చక్కటి వాలీతో బంతిని నెట్‌లోకి పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. ఆతర్వాత కూడా బ్రెజిల్‌ నుంచి స్విస్‌కు తీవ్ర పోటీయే ఎదురైంది. ఓవైపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.

Updated Date - 2022-11-29T01:18:30+05:30 IST