Indian Racing League 2022: చీకటిపడడంతో నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్

ABN , First Publish Date - 2022-11-20T17:23:08+05:30 IST

శనివారం అట్టహాసంగా ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League 2022) అట్టర్‌ఫ్లాపయ్యింది. చీకటి పడటంతో ఆదివారం జరగాల్సిన కార్ల రేసింగ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు.

Indian Racing League 2022: చీకటిపడడంతో నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్

హైదరాబాద్: శనివారం అట్టహాసంగా ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League 2022) అట్టర్‌ఫ్లాపయ్యింది. చీకటి పడటంతో ఆదివారం కార్ల రేసింగ్‌ను నిర్వాహకులు ముందుగానే నిలిపివేశారు. క్వాలిఫైయింగ్ రేసులో వరుస ప్రమాదాల కారణంగా ఆదివారం రేస్ ఆలస్యంగా మొదలైంది. ఐమాక్స్ మలుపు వద్ద జరిగిన మరో ప్రమాదం ఆలస్యానికి కారణమైంది. 4 ఫార్ములా కార్లు బారికేడ్‌ను ఢీకొట్టిన ఈ ఘటనలో ఇద్దరు రేజర్లకు గాయాలయ్యాయి. కాగా ట్రాక్‌కు రెండు రోజులు మాత్రమే అనుమతి ఉండడంతో రేపు (సోమవారం) నిర్వహణకు అవకాశంలేదనే చెప్పాలి. దీంతో జూనియర్ ఛాంపియన్‌షిప్‌తోనే సరిపెట్టినట్టయ్యింది.

ఇదెక్కడి తీరు.. వీఐపీ టికెట్ తీసుకున్నా అనుమతించరా?..

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఎప్పుఎప్పుడు ప్రారంభమవుతుందా అంటూ ఎదురుచూసిన కొందరు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదుదైంది. వీఐపీ టికెట్ తీసుకున్నా పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పెట్టి టికెట్లు కొంటే లోపలికి పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ గ్యాలరీలో టికెట్ తీసుకున్న వారు కాకుండా.. ఇతర వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులతో గ్యాలరీ నిండిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా లోపలికి అనుమతించడంలేదని పోలీసులు చెప్పారు. దీంతో పలువురు అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

కాగా ఈ పోటీలను రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)ను నిర్వహిస్తోంది. ఐఆర్‌ఎల్‌ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్‌-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. హైదరాబాద్‌ టీమ్‌ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా డ్రైవర్‌ కొండా అనిందిత్‌ రెడ్డి బరిలో ఉన్నాడు.

Updated Date - 2022-11-20T17:33:21+05:30 IST