Shorts: భారతీయులు ఆ వీడియోలను తెగ చూస్తున్నారు! రోజుకు సగటున..
ABN , First Publish Date - 2022-10-29T20:48:25+05:30 IST
సగటు భారతీయుడు రోజుకు కనీసం 38 నిమిషాల పాటు షార్ట్స్‌ను చూస్తున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: టిక్‌టాక్ రాకతో అందరూ షార్ట్ వీడియోలకు(Short form Video) అలవాటు పడిపోయారు. గంటలకొద్దీ ఈ వీడియోలను చూడటంలో గడిపేస్తున్నారు. అధిక నిడివి గల వీడియోల పట్ల చాలా మందిలో కొంతమేర ఆసక్తి తగ్గింది. అందుకే.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కూడా షార్ట్స్(Shorts), రీల్స్(Reels) పేరిట షార్ట్ వీడియోలను అందుబాటులోకి తెచ్చారు. షార్ట్స్‌తో మంచి ఆదాయం వస్తుండటంతో ఈ వీడియోల చుట్టూ ఓ కొత్త ఆర్థిక వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంది. దీన్నే క్రియేటర్ ఎకానమీ(Creator Economy) అని పిలుస్తున్నారు. షార్ట్స్‌ను నమ్ముకుని అనేక మంది ఉపాధి పొందుతున్నారు. కొందరు లక్షలు ఆర్జిస్తున్నారు. భారతీయులు ఈ వీడియోలకు ఎంతగా అలవాటుపడిపోయారంటే.. సగటు భారతీయుడు రోజుకు కనీసం 38 నిమిషాల పాటు షార్ట్స్‌ను చూస్తున్నారట. తాజాగా జరిగిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది.
బెంగళూరుకు చెందిన రెడ్‌షీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ప్రకారం.. 2025 కల్లా భారత్‌లో షార్ట్ వీడియోలు చూసేవారి సంఖ్య 600 మిలియన్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా.. 2030 నాటికి షార్ట్స్‌తో క్రియేటర్లకు సుమారు 19 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతం మార్కెట్లో.. Moj, Josh, Roposo, MX TakaTak and Chingari తదితర యాప్‌లు మంచి పాపులారిటీతో దూసుకుపోతున్నాయి. ఇక దేశంలో షార్ట్స్ క్రియేట్ చేసేవారి సంఖ్య సుమారు 8 కోట్లు. అయితే.. ఆదాయం సమకూరేలా ప్రొఫెషనల్ స్థాయిలో వీడియోలు చేస్తున్న వారు కేవలం 1.5 లక్షల మందే ఉన్నారట. వీళ్లు సగటున నెలకు రూ.16 వేల నుంచి రూ.2లక్షల వరకూ ఆదాయం పొందుతున్నారట. ఒక శాతం కంటే తక్కువ మందికి మాత్రమే నెలకు రూ.53 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వేలో బయటపడింది.