BRS: టీఆర్ఎస్ పేరును..భారత్ రాష్ట్ర సమితిగా ఈసీ ఆమోదం

ABN , First Publish Date - 2022-12-08T18:15:21+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది.

BRS: టీఆర్ఎస్ పేరును..భారత్ రాష్ట్ర సమితిగా ఈసీ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ (KCR) ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారింది. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. టీఆర్ఎస్ (TRS)ను బీఆర్ఎస్గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిసింది. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌ (BRS)గా మార్చుతూ అధ్యక్షుడు కేసీఆర్కు సీఈసీ సమాచారం ఇచ్చింది. సీఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న (శుక్రవారం) మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు "భారత రాష్ట్ర సమితి" ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. రేపు తెలంగాణ భవన్‌లో తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపుతారు. అనంతరం కేసిఆర్ బీఆర్‌ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గసభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని కేసిఆర్ తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలు అందించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి అందించారు.

సర్దాల్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ ఆఫీసు

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సీఎం కేసీఆర్‌ దేశ రాజధానిలోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటుకు సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని 5వ నెంబరు బంగళాను అద్దెకు తీసుకున్నారు. రాజస్థాన్‌ రాజవంశానికి సంబంధించిన ఖైతడి ట్రస్టుకు చెందిన ఈ భవనం, ప్రాంగణం సువిశాలంగా ఉంది. భవనాన్ని ఏడాదికి గాను లీజుకు తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో నిర్మాణం పూర్తవుతుందని, ఆ తర్వాత అద్దె భవనం నుంచి నూతన భవనానికి కార్యాలయాన్ని మారుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-12-08T18:43:13+05:30 IST