Kishan Reddy: వరదాచార్యులు పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2022-11-03T20:13:12+05:30 IST
ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచార్యులు (Varada Charyulu) మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో రాణించే యువతకు దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి వరదాచార్యులు అని కొనియాడారు.
ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచార్యులు (Varada Charyulu) మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో రాణించే యువతకు దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి వరదాచార్యులు అని కొనియాడారు.
‘సీనియర్ జర్నలిస్టు, పాత్రికేయ శిఖరం జీఎస్ వరదాచార్యులు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు ఆయన తీసుకున్న చొరవ యావత్ పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులకు ఆయన జర్నలిజంలో మెలకువలు నేర్పడంతోపాటు భాషపై పట్టు తదితర అంశాలపై లెక్కలేనన్ని శిక్షణ కార్యక్రమాలను పట్టుదలతో, ఓపికగా నిర్వహించారు. పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో సేవలందిస్తూనే.. భవిష్యత్ జర్నలిజం అంతే ఉన్నతంగా ఉండాలన్న ఆకాంక్షతో యువ పాత్రికేయులకు ఉత్సాహంగా జర్నలిజం పాఠాలు బోధించారు. వరదాచార్యులు రాసిన ‘ఇలాగేనా రాయడం’, ‘దిద్దుబాటు’, ‘మన పాత్రికేయ వెలుగులు’, ‘జ్ఞాపకాల వరద’, వరద స్వర్ణాక్షరి మొదలైన పుస్తకాలు జర్నలిస్టులకు మార్గదర్శనం. జర్నలిజం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పలు సంస్థలకు ‘అంబుడ్స్ మన్’గా ఆయన చేసిన సేవలు యావత్ పాత్రికేయ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. తెలుగు జర్నలిజానికి ఒక దిక్సూచిగా నిలిచిన వరదాచారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని కిషన్ రెడ్డి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.