అమరావతిలో పేదలకు హక్కు కల్పించిందే టీడీపీ
ABN , First Publish Date - 2023-05-19T03:53:29+05:30 IST
దేశంలో ఏ రాజధానిలో లేని విధంగా అమరావతిలో పేదలకు 5 శాతం భూమిని రిజర్వు చేసి,...
వైసీపీకి ప్రచారం ముఖ్యమా... ఇళ్ల స్థలాల పంపిణీనా..!
ప్రభుత్వం చేస్తున్న పచ్చి మోసాన్ని వాళ్లు నిలదీయాలి: పట్టాభి
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో ఏ రాజధానిలో లేని విధంగా అమరావతిలో పేదలకు 5 శాతం భూమిని రిజర్వు చేసి, వారికి హక్కు కల్పించిందే తెలుగుదేశం పార్టీ. దేశంలో మరే రాజధానిలో పేదలకు ఇటువంటి హక్కు రాలేదు. దానిని కప్పిపుచ్చి పేదలకు తామే పట్టాలు ఇస్తున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ఫోజులు కొడుతోంది’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అమరావతి రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సీఆర్‌డీఏ చట్టం తెచ్చింది. ఆ చట్టంలో రాజధానిలో 5 శాతం భూమిని పేదల గృహ వసతికి కేటాయించింది. ఈ చట్టం 2014లో తెచ్చింది. దేశంలో ఏ నగరంలో కూడా ఇలా ప్రత్యేకంగా పేదలకు ఇంత శాతం భూమిని రిజర్వు చేస్తూ కేటాయింపులు లేవు. ఆ ఘనత అమరావతికి దక్కింది. జగన్ ప్రభుత్వం ఆ చట్టం గురించి మాట్లాడటం లేదు. తామే అక్కడ పేదలకు పట్టాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకొంటోంది. కేవలం భూమిని రిజర్వు చేయడంతో సరిపుచ్చకుండా టీడీపీ ప్రభుత్వం అమరావతిలో పేదల కోసం ఐదు వేల అపార్ట్‌మెంట్లు నిర్మించింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అందులో కేవలం 5 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఆ ఐదు శాతం పనులనూ పూర్తి చేయలేదు. కట్టిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయకుండా వాటిని అలా వదిలేసి పాడుబెట్టింది. ఇంత దుర్మార్గం దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. పేదల గృహ వసతికి ప్రత్యేకించిన చోట భూమిని వదిలిపెట్టి ఇప్పుడు ఎలకా్ట్రనిక్ సిటీ పెట్టాలనుకొన్నచోట పట్టాలు ఇస్తున్నారు. తమ తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే పట్టాలు రద్దయిపోతాయని చెప్పిన సుప్రీం కోర్టు ఈ విషయం కూడా పట్టాలపై ముద్రించమని చెప్పింది. ఇంత వివాదం ఉన్న చోట పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎందుకు? మీకు ప్రచారం ముఖ్యమా లేక పేదలకు ఇంటి వసతి ముఖ్యమా? వివాదం లేని చోట వారికి పట్టాలు ఇవ్వవచ్చు కదా? అవసరమైతే వివాదం లేని చోట భూములు కొని ఇవ్వండి. ఇచ్చినట్లే ఇచ్చి లిటిగేషన్‌లో పేదలను పడవేస్తున్నారు. ఇది పచ్చి మోసం. దీనిపై పేదలు ప్రభుత్వాన్ని నిలదీయాలి’’ అని సూచించారు. . పట్టాలు ఇచ్చేటప్పుడు పేదలకు రాజధానిలో ఇస్తున్నామని చెబుతూ... బయట మాత్రం విశాఖ రాజధాని అని చెప్పటాన్ని ఎత్తిచూపించారు. రాజధాని ఏదో వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటించాలని పట్టాభి డిమాండ్ చేశారు.