ఓటర్ల తొలగింపు అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2023-06-26T03:52:37+05:30 IST
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకమని, అర్హులైన ఓటర్లను తొలగించడం అప్రజాస్వామికమని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: లోక్‌సత్తా నేత జేపీ
విజయనగరం, జూన్ 25: ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకమని, అర్హులైన ఓటర్లను తొలగించడం అప్రజాస్వామికమని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ పరిస్థితిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరంలో ఆదివారం జరిగిన ‘ఓట్ ఇండియా.. సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ తాము రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి అర్హులైన ఓటర్లందరినీ జాబితాల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని చెప్పారు. భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించడం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని వాపోయారు. దేశంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తప్ప.. మిగతా ఎవరూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో నడిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు.