YS Sunita Reddy: అవినాశ్ రెడ్డివి కట్టుకథలు!
ABN , First Publish Date - 2023-04-28T02:42:15+05:30 IST
‘‘వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిలుకు అర్హుడు కాదు.
జమ్మలమడుగు వెళ్తుండటం నిజం కాదు
వివేకా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే వెయిటింగ్
‘దర్యాప్తు’ను తొలి నుంచీ కంట్రోల్ చేశారు
మూడు సిట్‌లు మారాయి.. సీబీఐకీ వేధింపులు
దస్తగిరి వాంగ్మూలం మాత్రమే కాదు..
అవినాశ్‌రెడ్డి పాత్రపై శాస్త్రీయ ఆధారాలూ!
సచ్ఛీలుడేం కాదు.. నాలుగు క్రిమినల్ కేసులు
నేరం చేసేముందే హోదాపై ఆలోచించాల్సింది
అరెస్టు చేసి ప్రశ్నించాల్సిన అవసరముంది
అవినాశ్ కేసులో సునీతా రెడ్డి వాదనలు
అరెస్టు వద్దు... ‘కస్టోడియల్’కు సహకరిస్తాం
అందరూ అంటేనే ఆయనా గుండెపోటు అన్నారు
70 ఏళ్ల వివేకాతో ఆయనకు పోటీ ఏముంది?
అవినాశ్ తరఫు న్యాయవాది ప్రశ్న
టీ-హైకోర్టులో విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిలుకు అర్హుడు కాదు. ముందస్తు బెయిలు ఇచ్చేందుకు ఆయన హోదా అర్హత కాదు. అవినాశ్ రెడ్డిపై హత్యాయత్నం సహా నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. ఆయన సచ్ఛీలుడేం కాదు’’ అని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ కె.సురేందర్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. సునీతా రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ‘‘అరెస్టు చేస్తే ఎంపీగా ఉన్న పిటిషనర్ హోదా దెబ్బతింటుందని ఆయన తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేర్కొంటున్నారు. ముందస్తు
బెయిల్ అడగడానికి ఎంపీ అనే హోదా అర్హత కానేకాదు. హోదా గురించి నేరం చేసేముందు ఆలోచించాల్సింది. ఈ కేసులో కుట్రదారులు సీబీఐ కంటే ముందు దర్యాప్తుచేసిన సిట్‌ను సైతం నియంత్రించారు. అందుకే మూడుసార్లు సిట్‌ను మార్చాల్సి వచ్చింది’’ అని సిద్ధార్థ లూత్రా తెలిపారు. సీబీఐ అధికారులను వేధించారని పేర్కొన్నారు. వివేకా మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండగా.. గుండెపోటు అని అనుమానం రావడానికి ఆస్కారమే లేదని... అయినప్పటికీ గుండెపోటు అని ప్రచారం చేశారన్నారు. ‘‘అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఆదేశాల మేరకే రక్తాన్ని శుభ్రం చేసినట్లు అక్కడ పనిచేసే లక్ష్మీ, ఇనాయితుల్లా, డ్రైవర్ ప్రసాద్ తదితరులు వాంగ్మూలం ఇచ్చారు. రక్తాన్ని కడిగేటప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడే ఉన్నారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాశ్ రెడ్డిని ఇరికిస్తున్నామన్న వాదనలో పస లేదు. ఆయన ప్రచారానికి జమ్మలమడుగు వెళ్తుండగా వివేకా చనిపోయారని ఫోన్ రాగానే తిరిగి వచ్చారనేది కట్టుకథ. వివేకా ఇంటికి 500 మీటర్ల పరిధిలోనే అవినాశ్‌రెడ్డి తన ఇంట్లో ఉన్నారు. ఫోన్ కోసం వేచిచూస్తున్నారు. అవినాశ్ రెడ్డి అదే లొకేషన్‌లో ఉన్నట్లు నిరూపించే శాస్త్రీయ ఆధారాలున్నాయి’’ అని సిద్ధార్థ లూత్రా తెలిపారు. పిటిషనర్ సరైన మెటీరియల్ ఽహైకోర్టు ముందు ఉంచకుండా ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించారని.. అందుకే అరెస్ట్ చేయరాదని, లఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘‘పిటిషనర్ విచారణకు అసలు సహకరించడం లేదని సీబీఐ చెప్పింది. కచ్చితమైన సమాధానాలు ఇచ్చేందుకే లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశాం’’ అని తెలిపింది.
ప్రభుత్వం మీదేగా...
అవినాశ్ రెడ్డిపై 2023నాటికి ఏ కేసులూ పెండింగ్‌లో లేవని సమాచార హక్కు చట్టం కింద పెట్టిన దరఖాస్తుకు ఎస్పీ సమాధానమిచ్చారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆర్టీఐ కింద ఇచ్చిన డిక్లరేషన్‌ను కూడా తప్పుబడతారా అని ప్రశ్నించారు. ఇందుకు లూత్రా స్పందిస్తూ... ‘‘ప్రభుత్వం మీది. ఏమైనా ఇస్తారు. అసలు ఆర్టీఐకి ఎందుకు దరఖాస్తు చేయాల్సి వచ్చింది? ఆయా కేసుల్లో పిటిషనర్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన అక్విటల్ ఆర్డర్‌లు సమర్పించవచ్చు కదా? అలాంటి ఆదేశాలు మీవద్ద ఏమైనా ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ దశలోనే పిటిషనర్ సాక్షులను, బాధితులను (సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి) బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని, ఆయన ప్రవర్తనను పరిశీలించాలని కోరారు. అవినాశ్ కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకు అవసరమో సీబీఐ స్పష్టమైన కారణాలు వివరిస్తున్నదన్నారు. వివేకా హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని.. అందులో అవినాశ్ భాగస్వామని పేర్కొన్నారు. పిటిషనర్ ముంద స్తు బెయిల్‌కు అర్హుడా అని పరిశీలించాలని కోరారు.
అరెస్టు వద్దు.. ‘కస్టోడియల్’కు సహకరిస్తాం: అవినాశ్‌రెడ్డి
అవినాశ్ హోదా ప్రకారం ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదని నిరంజన్ రెడ్డి తెలిపారు. అరెస్టు చేయవద్దని.. కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు సహకరిస్తామని తెలిపారు. అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ సాధ్యం కాదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ సాధ్యమే అని.. సీబీఐ కస్టడీలోకి తీసుకుని ఎంత సమయం విచారిస్తుందో అంత సమయం సహకరిస్తామని.. అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని నిరంజన్ రెడ్డి కోరారు. అవినాశ్ నిందితుడని సీబీఐ చూపుతున్న ఏ సాక్ష్యానికి చట్టబద్ధత లేదన్నారు. ‘‘గూగుల్ టేకౌట్ కచ్చితమైనదని గూగుల్ సైతం ధ్రువీకరించలేదు. గూగుల్ టేకౌట్ ప్రత్యేక యాప్ కూడా కాదు. లొకేషన్ మాత్రమే చూపిస్తుంది. దానిని సాక్ష్యంగా ఇప్పటివరకు ఏ కోర్టూ అంగీకరించలేదు. అది మనిషి ఎక్కడున్నాడో చెప్పలేదన్నారు. లొకేషన్‌లో 20 మీటర్ల తేడా ఉంటుందని గూగుల్ డాక్యుమెంట్‌లోనే ఉంది. అందువల్ల ఈ సాక్ష్యంచెల్లదు’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. దీని వెనుక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నట్లు తనతో గంగిరెడ్డి చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని... అంతేతప్ప వాళ్లతో స్వయంగా మాట్లాడినట్లు చెప్పలేదని గుర్తుచేశారు. ఎవరో చెప్పారంటూ ఇచ్చే సాక్ష్యం చెల్లదన్నారు. ‘‘జమ్మలమడుగుకు ప్రచారానికి వెళ్తుండగా వివేకా చనిపోయారని ఫోన్ రావడంతో పిటిషనర్ అక్కడికి వచ్చారు. అందరూ గుండెపోటు అంటుంటే తాను కూడా గుండెపోటు అని చెప్పారు. అంతకుమించి ఇందులో ఏ కుట్రా లేదు. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేకా భావించినట్లు సునీత కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆయనను చంపాల్సిన అవసరం ఏముంది? 70 ఏళ్ల వృద్ధుడితో యువకుడికి ఏం పోటీ ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్‌మెంట్ మినహా సీబీఐ వద్ద మరో సాక్ష్యం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సీబీఐ వాదనల కోసం విచారణను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది.