Tarakaratna: మెలేనా వ్యాధితో బాధపడుతున్న తారకరత్న.. ఇంతకీ ఏంటీ వ్యాధి?
ABN , First Publish Date - 2023-01-28T21:49:58+05:30 IST
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లి గుండెపోటుకు
హైదరాబాద్: టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లి గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరో విస్తుపోయే విషయం తెలిసింది. తారకరత్న అత్యంత అరుదైన మెలేనా వ్యాధితో బాధపడుతున్నట్టు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.
ఇంతకీ ఏంటీ మెలేనా?
మెలేనా(Melena) అనేది జీర్ణాశయాంతర రక్తస్రావానికి సంబంధించినది. ఈ వ్యాధి బారినపడిన వారి మలం నల్లగా, జిగురుగా వస్తుంది. మెలేనా వల్ల జీర్ణాంతర(GI) ట్రాక్ట్తోపాటు నోరు, అన్నవాహిక, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావం అవుతుంది. కొన్ని కేసుల్లో ఎగువ జీర్ణాశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు ఆరోహణ భాగంలోనూ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ‘హెమటోచెజియా’(Hematochezia) లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. అయితే అందులో మలం ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పొరపాటు పడకూడదు. అంతేకాదు, మలంలో కనిపించే ఈ రక్తం తాజాగా ఉంటుంది.
మెలేనాకు దారితీసే పరిస్థితులు
ఎగవ జీర్ణాశయాంతర మార్గం దెబ్బతినడం, కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండ్లు, రక్తనాళాల వాపు, రక్తస్రావం తదితర రక్త సంబంధిత వ్యాధులు మెలేనాకు దారితీస్తాయి. మెలేనా వల్ల శరీరంలో రక్తం స్థాయులు క్రమంగా పడిపోతాయి. రక్తస్రావం అనీమియాకు దారితీస్తుంది. ఫలితంగా బలహీనంగా మారిపోవడమే కాక, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శరీర రంగు మారడం, అలసట, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స ఏమిటి?
మెలేనా వ్యాధి బారినపడిన వారికి పెప్టిక్ అల్సర్స్(Peptic Ulcers) ట్రీట్మెంట్, ఎండోస్కోపీ థెరపీ(Endoscopic Therapies) చేస్తారు. అలాగే, యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్తాన్ని మార్చడం వంటి చికిత్సలు అందిస్తారు. అయితే, గుండెపోటు తర్వాత రక్త నాళాలలో జరిగే రక్తస్రావం కారణంగా గుండెకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ చికిత్సలో గుండెను కృత్రిమంగా కదిలించేందుకు ఎక్మో మెషీన్ను ఇంప్లాట్ చేస్తారు.