Pawan Kalyan: నన్ను తిట్టండి: పవన్
ABN , First Publish Date - 2023-03-12T17:24:32+05:30 IST
నన్ను తిట్టండి.. కానీ కులాన్ని తక్కువ చేయవద్దు. ఇతర కులాలవారితో కొంచం ప్రేమగా మాట్లాడండి.
మంగళగిరి: ‘‘నన్ను తిట్టండి.. కానీ కులాన్ని తక్కువ చేయవద్దు. ఇతర కులాలవారితో కొంచెం ప్రేమగా మాట్లాడండి. చనిపోయాక విగ్రహాలు పెట్టడం కాదు. బతికున్నప్పుడు తోడు నడవాలి’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. కాపుల దగ్గర ఆర్థిక బలం తక్కువని, సంఖ్యాబలం ఉన్నా ఐక్యత లేదని అన్నారు. సమాజంలో కులాలను విడదీసేవారు ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు. అట్టడుగు వర్గాలను ఎవరైతే భూజాలపై పెట్టుకుంటారో.. అప్పుడే నాగరికత వెల్లివిరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాపులు పార్టీలను నడపలేరని ఎవరైనా అంటే.. చెప్పు తెగేలా సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయం లేదని, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. తాను మెత్తటి మనిషిని కాదని హెచ్చరించారు. సంఖ్యాబలం ఉన్నా ఇంకా రిజర్వేషన్ల (Reservations) కోసం అడుక్కునే పరిస్థితి ఉందని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో భేటీలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు
నేను భయపడే వ్యక్తిని కాదు
‘‘రాయలసీమ (Rayalaseema)లోని మైన్స్ అన్నీ సీఎం కుటుంబం చేతిలోనే ఉన్నాయి. రాయలసీమలో బలిజలు గొంతు ఎత్తలేరు. దానికి కారణం భయం కాదు.. ఐక్యత లేకపోవడం. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం. నన్ను నా సామాజికవర్గం వాళ్లతోనే తిట్టిస్తున్నారు. నేను ఓడిపోతే కాపులు తొడగొట్టారు. మీరుమీరు కొట్టుకు చావండి అన్నట్లుగా అధికార పార్టీ వైఖరి ఉంది. దీనిని గుర్తించనంత వరకు రాజ్యాధికారం అనే విషయం మర్చిపోండి. అన్ని కులాలను సమానంగా చూస్తేనే నాయకత్వం వహించగలం. ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని జనసేన తగ్గించదు. డబ్బులతో రాజకీయ పార్టీలను నడపలేరు. బీఎస్పీ నేత కాన్షీరామ్ (Kanshi Ram) మాకు ఆదర్శం. నేను భయపడే వ్యక్తిని కాదు. కిందటి ఎన్నికల్లో ఓడిపోయినా మనస్ఫూర్తిగా స్వాగతించాను. సమాజంలో చిన్నపాటి మార్పు కోసం పదేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. రెడ్డి సహా అన్ని వర్గాల్లో నాకు అభిమానులు ఉన్నారు. సినిమా పరంగా నేనంటే ఇష్టమున్నా.. ఓటు మాత్రం కులాలు చూసే వేస్తున్నారు. ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించా.. అందుకే ఇంకా నిలబడ్డా’’ అని పవన్ వ్యాఖ్యానించారు.