Share News

Magunta Sreenivasulu Reddy: మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్ షాక్.. ఈసారి ‘నో టికెట్’

ABN , Publish Date - Dec 28 , 2023 | 10:16 PM

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. గురువారం సాయంత్రం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసినప్పుడు..

Magunta Sreenivasulu Reddy: మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్ షాక్.. ఈసారి ‘నో టికెట్’

YS Jagan Gives Shock To Magunta Srinivasa Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. గురువారం సాయంత్రం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసినప్పుడు.. ఈ విషయం ఆయనకు సీఎం జగన్ చెప్పారని తెలిసింది. తాను చెప్పిన షరతులకు ఎంపీ మాగుంట అంగీకరించకపోవడంతోనే.. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తొలుత మాగుంటకు రీజినల్ కో ఆర్డినేటర్ ద్వారా సీఎం జగన్ షరతులు పంపారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ప్రెస్‌మీట్‌లు నిర్వహించి.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ని తిట్టాలని షరతులు పెట్టారట. వీటిని అమలు చేస్తేనే టికెట్ ఇస్తామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు.


అయితే.. ఈ షరతుల్ని మాగుంట శ్రీనివాసరెడ్డి ఒప్పుకోలేదు. బుధవారం విజయసాయిరెడ్డిని కలిసి.. ఆ షరతుల్ని తాను అమలు చేయనని మాగుంట స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో బాలినేని సీన్‌లోకి రావడం.. ఆయన్ను సీఎం జగన్ కలిసి ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. మాగుంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారని.. బాలినేనికే పోటీ చేయాలని ఆదేశాలిచ్చారని వార్తలొస్తున్నాయి. మరి.. తనకు టికెట్ దొరకని పక్షంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. జగన్‌తో భేటీ అనంతరం తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్ని పరిశీలించమని తనని సూచించారని, అభ్యర్థుల ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది సీఎం శుక్రవారం ఫైనల్ చేస్తారని చెప్పారు.

Updated Date - Dec 28 , 2023 | 10:19 PM