Youtube: యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్న యూట్యూబ్
ABN , First Publish Date - 2023-05-11T21:25:26+05:30 IST
నాన్ ప్రీమియం యూజర్ల (Non-Premium Users)కు షాకిచ్చేందుకు యూట్యూబ్ (Youtube) రెడీ
న్యూఢిల్లీ: నాన్ ప్రీమియం యూజర్ల (Non-Premium Users)కు షాకిచ్చేందుకు యూట్యూబ్ (Youtube) రెడీ అవుతోంది. ప్రకటనలు బ్లాక్ చేయకుండా ఉండేలా ఓ ఫీచర్‌ను రెడీ చేస్తోంది. యాడ్ బ్లాకర్ల (Ad Blockers)ను ఉపయోగించకుండా నిరోధించేలా ఓ సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే, ఇప్పటికే యాడ్ బ్లాకర్లను ఉపయోగిస్తున్న వారు ఇకపై వాటిని డిసేబుల్ చేయకుంటే వీడియో ప్లే కాదన్నమాట. దీనర్థం ఇకపై ప్రకటనలు పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఈ యాడ్స్ గోల అక్కర్లేదనుకుంటే మాత్రం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో ఇప్పుడీ సబ్‌స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ. 1,290గా ఉంది.
యాడ్ బ్లాకర్లను ఇన్‌స్టాల్ చేసుకున్న వారు ఇకపై యూట్యూబ్ వీడియోలను వీక్షించడం కుదరదంటూ ఓ పాపప్ మెసేజ్ కూడా వస్తున్నట్టు ఓ రెడిట్ యూజర్ స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. ప్రకటనలు చూసే ఓపిక లేకుంటే మాత్రం ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు యాడ్ ఫ్రీతో పాటు గత నెలలో తీసుకొచ్చిన ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్లే లిస్ట్ క్యూలో వీడియోలను యాడ్ చేసుకోవడం, గూగుల్ మీట్ ద్వారా స్నేహితులతో కలిసి కంటెంట్‌ను కలిసి చూడడం, లైవ్ షేరింగ్/షేర్ ప్లే, 1080P HD వీడియో సపోర్ట్, స్మార్ట్ డౌన్‌లోడ్స్ వంటివి ఉంటాయి. స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫీచర్‌లో గతంలో వీడియోను చూడడం ఎక్కడి నుంచి ముగించామో తిరిగి అక్కడి నుంచి కొనసాగించే వీలు ఉంటుంది.