ఓటమి భయంతో గాల్లోంచి పుట్టించిన కేసు!

ABN , First Publish Date - 2023-09-12T02:40:26+05:30 IST

నిత్యంప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటూ, వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్న చంద్రబాబుపై ఏదో రకంగా అవినీతి బురద వేసి...

ఓటమి భయంతో గాల్లోంచి పుట్టించిన కేసు!

నిత్యంప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటూ, వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్న చంద్రబాబుపై ఏదో రకంగా అవినీతి బురద వేసి, ఎన్నికల్లో గెలవాలన్నదే వైసీపీ కుట్ర. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న అబద్ధ ప్రచారాన్ని మొదలుపెట్టింది. టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ అమలు కోసం చెల్లించిన రూ.371కోట్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.

ఏపీతో పాటు తెలంగాణ, గుజరాత్ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలతో సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ మారుతున్నప్పుడు నైపుణ్యాభివృద్ధి అవసరం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇప్పించాలన్న సదుద్దేశంతో, గొప్ప లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేశాక, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐ.వై.ఆర్. కృష్ణారావు కొందరు ఐపీఎస్ అధికారులతో సదరు కార్పొరేషన్ పనితీరు, నిర్వహణ నిమిత్తం రెండు కమిటీలు వేశారు. ఐపీఎస్ అధికారి ఎల్. ప్రేమచంద్రారెడ్డి, గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జవహర్ నాలెడ్జ్ కేంద్రాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసిన గంటా సుబ్బారావుల్ని కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. నైపుణ్యాభివృద్ధి శిక్షణకోసం సీమెన్స్ సంస్థ రాష్ట్రంలో 40 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. శిక్షణా కేంద్రాల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, విశాఖ ఇంజనీరింగ్ కళాశాల, జీఎంఆర్, కాకినాడ జేఎన్టీయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. శిక్షణ కోసం అయ్యే వ్యయంలో రాష్ట్రప్రభుత్వ వాటా కేవలం 10శాతమైతే, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల వాటా 90శాతంగా నిర్ణయించి జీవోల ద్వారా నిధులు విడుదల చేశారు.


స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి జరిగింది అంటున్న జగన్ ప్రభుత్వం శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి విచారణలను జరిపి, ఏ వాస్తవాలను సేకరించారో చేప్పలేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగితే, ఇదే జగన్ ప్రభుత్వం 2020లో సదరు ప్రాజెక్టులో భాగస్వామి అయిన డిజైన్ టెక్‌ను ఎలా ప్రశంసించింది? స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారించినప్పుడు ఎక్కడా చంద్రబాబు పేరు రాలేదు. శరత్ చంద్రా ఆడిట్స్ సంస్థ కేంద్రాల్లో భౌతిక విచారణ జరపకుండా జగన్ ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్పింది? స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై 22 నెలలుగా విచారిస్తున్న ఏపీ ప్రభుత్వం ఏనాడూ చంద్రబాబు పేరు చెప్పకుండా, ఈడీ విచారణలో కూడా ఆయన లేకుండా, ఇప్పుడు ఆయన్ని ఎలా అరెస్ట్ చేసింది? అలానే సెంట్రల్ టూల్ డిజైనింగ్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) శిక్షణా కేంద్రాల్లో ఆడిట్ నిర్వహించి, యువత శిక్షణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతరత్రా పరికరాలు అన్నీ ఉన్నాయని నిర్ధారించి ఇచ్చిన నివేదికను జగన్ ప్రభుత్వం గానీ, ఏపీ సీఐడీ గానీ పరిగణనలోకి తీసుకోలేదు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని, ఎక్కడా ఏ తప్పు జరగలేదని, విచారణ సంస్థలు, అధికారులు కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నీ కల్పితాలేనని గతంలోనే సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా చెప్పింది. విచారణ పేరుతో అక్రమ కేసులతో అదుపులోకి తీసుకోబడినవారందరికీ బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి పనిగట్టుకొని మరీ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడే స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కేసు విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో స్పష్టమైంది. శనివారం, ఆదివారం కోర్టులు పనిచేయవని తెలిసే, రిమాండ్‌లోకి తీసుకుని దుశ్చర్యకు ఒడిగట్టారు.


రిమాండ్ రిపోర్ట్‌లోని పేజీ నెం–21, పేరాగ్రాఫ్–10లో చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టులో జరిగిందంటున్న అవినీతికి సంబంధించి చంద్రబాబుకి డబ్బు అందినట్టు ఇంకా తాము నిర్ధారణకు రాలేదని, ఆ డబ్బు ఎవరికి చేరిందో కూడా తమకు తెలియదని సీఐడీ స్పష్టంగా పేర్కొంది. అలానే అవినీతి సొమ్ము ఇంతని కూడా చెప్పలేదు. పేజీ నెం– 16లో ఒక పేరాలో రూ.145.37కోట్లని, మరో పేరాలో రూ.279కోట్లు అని, పేజీ నెం–21లో అసలు ఈ సొమ్మంతా ఎటుపోయిందో, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తెలియదని సీఐడీ చెప్పింది. డబ్బు ఎంతో తెలియకుండా, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేలకుండా, చంద్రబాబు తప్పు చేశారని ఎలా అంటారు? రిమాండ్ రిపోర్టులోని పేజీ నెం–20, పేరాగ్రాఫ్–8, పాయింట్ నెం–2లో ఇన్‌కం టాక్స్ విభాగం చంద్రబాబుకి ఇచ్చింది అంటున్న నోటీసు కాపీ తమవద్ద లేదని, డిపార్టుమెంట్ వారు తమకు పొందుపరచలేదని సీఐడీ పేర్కొంది. ఐటీ నోటీసు కాపీ లేనప్పుడు, దానిలోని సమాచారంపై అవగాహన లేనప్పుడు అటువంటి నోటీసు ఆధారంగా కేసు ఎలా పెడతారో సీఐడీ అధికారులు సమాధానం చెప్పాలి.

స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన శిక్షణా కేంద్రాల్లో అన్ని పరికరాలూ ఉన్నాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం యువతకు అందుబాటులో ఉందని, శిక్షణా కేంద్రాలు బాగానే పనిచేస్తున్నాయని గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ టూల్ డిజైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిరుద్యోగ యువత శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, హార్డ్‌వేర్ పరికరాలు, ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన ఖర్చులో 90శాతం సీమెన్స్ సంస్థ పెడితే, 10శాతం ఆయా ప్రభుత్వాలు భరించాయి. గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, తెలంగాణ సహా అన్ని ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరించాయి. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ద్వారా 2లక్షల యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందారని, రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలు ఉత్తమ శిక్షణతోపాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించాయని జగన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో ప్రశంసలతో కూడిన నివేదిక ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.370కోట్లు ఎటుపోయాయో సదరు ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే వారే సమాధానం చెబుతారు. శిక్షణార్థుల వద్దకువెళ్ళి చంద్రబాబు తప్పుచేశాడు, మీరూ ఆ తప్పులో భాగస్వాములని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? 42 సెంటర్లు పెట్టిన మాట వాస్తవం, 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చిన మాట వాస్తవం, 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం. ఇన్ని జరిగాక నిధుల దుర్వినియోగం అన్నది అబద్ధం! 2.13 లక్షల మందికి రూ.260 కోట్లు ఖర్చుపెట్టడం అంటే (జీఎస్టీ + సాఫ్ట్‌వేర్ కొనుగోలు) ఒక విద్యార్థిపై రూ.12,250లు ఖర్చు పెట్టినట్లు. మార్కెట్లో రూ.25 వేలకు తక్కువ లేకుండా శిక్షణా సంస్థలు వసూలు చేస్తాయి రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారు. నిర్దోషిని పట్టుకుని దోషిగా చిత్రీకరిస్తున్నారు. పద్నాలుగు సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నలభై సంవత్సరాల పాటు రాజకీయ యవనిక మీద ఏ మచ్చా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, చంద్రబాబు తప్పుచేయడు అనేది అంతే నిజం.

కె.ఎస్‌. జవహర్‌

మాజీ మంత్రి

Updated Date - 2023-09-12T02:40:26+05:30 IST