న్యాయవ్యవస్థపై ప్రత్యక్షదాడి
ABN , First Publish Date - 2023-01-13T00:49:30+05:30 IST
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ న్యాయవ్యవస్థమీద నిప్పులుకక్కడం కొత్తేమీకాదు. నెలక్రితమే ఆయన న్యాయనియామకాలకు సంబంధించిన కొలీజియం...
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ న్యాయవ్యవస్థమీద నిప్పులుకక్కడం కొత్తేమీకాదు. నెలక్రితమే ఆయన న్యాయనియామకాలకు సంబంధించిన కొలీజియం విధానాన్ని తప్పుబడుతూ, మోదీ ప్రభుత్వం ఏడేళ్ళక్రితం తెచ్చిన నేషనల్ జుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ (ఎన్జేఏసీ)ని కొట్టివేసినందుకు సుప్రీంకోర్టును విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన తొలిప్రసంగమే సుప్రీంకోర్టుమీద దాడితో మొదలైంది. బుధవారం రాజస్థాన్ విధానసభలో జరిగిన ఓ సమావేశాన్ని ఆయన ఈ దాడిని తీవ్రతరం చేయడానికి ఉపయోగించుకున్నారు. న్యాయనియా మకాల చట్టాన్ని కొట్టివేయడంమీద మరింత ఘాటైనవ్యాఖ్యలు చేస్తూ, ఈ మారు 1973నాటి కేశవానందభారతి తీర్పునే తప్పుబట్టారు. ప్రజల సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తున్న చట్టసభలమీద న్యాయవ్యవస్థ పెత్తనాన్ని ఎంతమాత్రం సహించబోమని కూడా ప్రకటించారు.
ఉండాల్సినవాడు అంటూ ధన్‌కర్‌ను మెచ్చుకుంటూ ఉపరాష్ట్రపతిగా నరేంద్రమోదీ ఎందుకు ప్రతిష్టించారో ప్రజలకు క్రమంగా అర్థమవుతోంది. పాలకుల మనసెరిగి వ్యవహరించడం రాజ్యసభాధిపతులకు తెలియని విద్యేమీ కాదుకానీ, వారి ఆశయాలకు వకాల్తాపుచ్చుకొని ఇంతదూకుడుగా పోవడం విశేషమే. ఎన్జేఏసీని సుప్రీంకోర్టు కొట్టివేయడం ప్రపంచ ప్రజాస్వామ్యచరిత్రలోనే ఎక్కడా చూడని వింతగా ఆయన అభివర్ణిస్తున్నారు. పార్లమెంటు ప్రజల సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తుంటే, న్యాయవ్యవస్థ దానిపై పెత్తనం చెలాయించేందుకు, పైచేయి సాధించేందుకు తెగతాపత్రయపడిపోతోందనీ, పైగా ప్రచారార్భాటానికి దిగుతోందని ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థ తనను తాను సరిదిద్దుకోవాలని హితవుచెబుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ దానితో రాజీపడేది లేదని కూడా హెచ్చరికలు చేశారు. ఎన్జేఏసీని సుప్రీంకోర్టు కొట్టేస్తే మీరంతా కిక్కురుమనలేదనీ, తమహక్కులను పరిరక్షించుకోవడం పార్లమెంటు సభ్యుల విధి అని గతంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆమోదముద్రవేస్తేకానీ పార్లమెంటు చేసేవి చట్టాలు కావా? అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
న్యాయకోవిదులనుంచి సామాన్యులవరకూ మన్ననలు పొందిన కేశవానందభారతి కేసును ఒక ఉపరాష్ట్రపతి ఆడిపోసుకోవడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. న్యాయకోవిదుడు కూడా అయిన ధన్‌కర్ సుప్రీంకోర్టుమీద ఆగ్రహంతో చరిత్రను విస్మరించి చిత్తంవచ్చినట్టు మాట్లాడుతున్నట్టు ఉంది. ఆ కేసుతో పార్లమెంటు పరిధిలోకి సుప్రీంకోర్టు తొలిగా చొరబడి, ఆ తరువాత చట్టసభలు చేసే చట్టాలను కొట్టివేయడం ఒక సంప్రదాయంగా మార్చివేసిందని, పార్లమెంటు తన సార్వభౌమాధికారం విషయంలో రాజీపడవలసి వస్తున్నదని ఆయన అభియోగం. రాజ్యాంగంలో మార్పుచేర్పులు చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ఉన్నదనీ, సమీక్షించే అధికారం వేరెవ్వరికీ లేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. ఏతావాతా, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా మందబలంతో ప్రభుత్వం ఎటువంటి చట్టాలు తెచ్చినా, వాటి జోలికి మీరు రానప్పుడు మాత్రమే మీ జోలికి మేము రామని ఆయన సుప్రీంకోర్టును హెచ్చరిస్తున్నట్టుంది. అన్ని వ్యవస్థలూ తమతమ పరిధుల్లో పనిచేయాలని అంటూనే, పార్లమెంటు అన్నింటికన్నా అత్యున్నతమైనదనీ, దానిని నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదనీ, అది ఎవరితోనూ రాజీపడదనీ ధన్‌కర్ తేల్చేశారు. కానీ, ఈ వ్యవస్థలన్నింటికీ పునాది రాజ్యాంగమే అనీ, పార్లమెంటు కానీ, సుప్రీంకోర్టు కానీ దానికంటే ఉన్నతమైనవి కావని ఆయన మరిచిపోతున్నారు. పార్లమెంటుకంటే రాజ్యాంగమే సుప్రీం అని ఆ కేసులో తీర్పుచెప్పినందుకు ఆ కేసునూ, సుప్రీంకోర్టునూ ఆయన తప్పుబడుతున్నారు. కేశవానందభారతి కేసులో రాజ్యాంగమౌలిక స్వరూపాన్ని, అది ప్రజలకు దఖలుపరిచిన ప్రాథమికహక్కులను ఎవరూ మార్చలేరనీ, తాను వాటి రక్షణకు కట్టుబడి ఉన్నానని సుప్రీంకోర్టు ప్రకటించినందువల్లనే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికిబట్టకడుతోంది. దశాబ్దాలుగా అనేక ప్రజానుకూల తీర్పులకు పునాదిగా, అనేకదేశాల్లో కొత్త చట్టాలకు తీర్పులకు స్ఫూర్తిగా నిలిచినకేసు ఇది. ప్రజలు ఎన్నుకున్నంతమాత్రాన పార్లమెంటు చేసే చట్టాలన్నీ ప్రజాశ్రేయస్సుకే ఉపకరిస్తాయని అనుకోలేం. అవి సమీక్షకూ, విమర్శకూ అతీతంగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి వాదన ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదం.