సయోధ్య సందేశం!

ABN , First Publish Date - 2023-01-20T00:22:29+05:30 IST

భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామనీ, ఇరుదేశాల మధ్య చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పాకిస్థాన్‌ ప్రధాని...

సయోధ్య సందేశం!

భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటున్నామనీ, ఇరుదేశాల మధ్య చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించినదుకు సంతోషించాల్సిందే. ఆయన ఈ మాటలు అన్నది తన దుబాయ్‌ పర్యటన సందర్భంలో ఒక టెలివిజన్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో కనుక పాక్‌ సన్నిహితదేశాలకు ఆ సందేశం చేరుతుంది. ఉభయదేశాలకు మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని ఆయన అంటున్నారు కానీ, సైనికనియంతలే స్వయంగా వచ్చి చర్చలు జరిపిన సందర్భాలు గతంలో ఉన్నందున, పాకిస్థాన్‌కు చిత్తశుద్ధివుంటే మధ్యలో ఎవరూ లేకుండానే ఆ పని సుసాధ్యం చేయవచ్చు. భారతదేశంతో మూడు యుద్ధాల తరువాత పాకిస్థాన్‌ గుణపాఠాలు నేర్చుకుందనీ, దేశప్రజలకోసం, దేశ ఆర్థికాభివృద్ధికోసం పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నదని ఆయన ఈ అరబ్‌చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కశ్మీర్‌ సహా అన్ని అంశాలూ అంటున్నందున ఆయనవాదన కొత్తదేమీ కాదు. కానీ, గత ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశానికి సంబంధించి చేసిన తొలివ్యాఖ్యలో కనిపించిన దూకుడు, కాఠిన్యం, ఆత్మస్థైర్యం ఈ మారు లేకపోవడం నిజం.

ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం దానికి ఓ సవరణ చేర్చింది. మూడేళ్ళక్రితం కశ్మీర్‌ ప్రజలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, అంటే 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే తప్ప చర్చలు సాధ్యం కాదన్నది నియమం. షరీఫ్‌ ఆవేశంగానో, వ్యూహాత్మకంగానో చర్చల గురించి మాట్లాడినప్పటికీ, తరువాత సైన్యం నుంచి ఒత్తిడిరావడంతో ఈ మెలికవచ్చిచేరిందని తెలుస్తూనే ఉంది. యుద్ధాలు, ప్రజల కష్టాలు, శాంతి గురించి మాట్లాడటం బాగుంది కానీ, కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించడం, కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు పరిష్కారం కావాలని అనడం భారతదేశ పాలకులను మెప్పించదని షరీఫ్‌కు తెలియకపోదు. షరీఫ్‌ వ్యాఖ్యలకు భారతదేశం పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించలేదు. భారతదేశం కూడా పొరుగుదేశంతో సత్సంబంధాలే కోరుకుంటున్నదనీ, కానీ ఉగ్రవాదానికీ, హింసకూ చోటులేనప్పుడే అటువంటి వాతావరణం ఏర్పడుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి ఓ మాట అని ఊరుకున్నారు. చర్చలకు సానుకూలవాతావరణం కల్పించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌ మీదే ఉందన్న పాతవాదనే ఇది.

నరేంద్రమోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు సార్క్‌ దేశాధినేతలతో పాటు నవాజ్‌ షరీఫ్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయన శాంతిసందేశంతో వెడుతున్నానంటూ భారత్‌ రావడం, మరుసటి ఏడాది మోదీ హఠాత్తుగా లాహోర్‌లో దిగి షరీఫ్‌ను కలవడం, ఆయన తల్లికి చీర బహూకరించడం వంటివి తెలిసినవే. రాజకీయంగా ఇటువంటి చొరవ కనిపించినప్పుడల్లా పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ రంగంలోకి దిగుతాయి. 2016లో యురి దాడితో చిత్రం మారిపోయింది. 2019పుల్వామా దాడితో, ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన బాలాకోట్‌ దాడులతో వాతావరణం మరింత వేడెక్కింది. అదే ఏడాది చివర్లో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడంతో దౌత్యసంబంధాలు నామమాత్రమైపోయాయి.

ఇప్పుడు పరిస్థితులను మార్చే లక్ష్యంతో కాక, మిగతా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది. పాక్‌ పాలకులు ఇలా హితవులు చెప్పడం, తిరిగి ఎప్పటిలాగానే వ్యవహరించడం కొత్తేమీ కాదు. వారి వ్యాఖ్యలకు గతంలో ఉన్నంత ప్రాధాన్యం ఇప్పుడు భారతదేశంలో లేదు. భారతదేశం తన పొరుగుదేశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆర్థిక కష్టాల్లో లోతుగా మునిగి, అప్పులకోసం ఆసియా అంతటా కలయదిరుగుతున్న షరీఫ్‌, పాకిస్థాన్‌ శాంతిని కోరుకుంటున్న దేశంగా చెప్పుకోవడం సహజం. శ్రీలంక తరహా ఆర్థికకష్టాల్లోకి జారిపోయి, రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటూ, అప్పులు పుట్టక, ఆర్థిక సంస్థలు ఆదుకోని స్థితిలోకి జారిపోయిన సందర్భంలో భారతదేశంతో తనకు తీవ్రమైన వైరమేమీ లేదని చెప్పుకోవడం అవసరం. తాను పాలుపోసిపెంచిన తాలిబాన్‌ తనపైనే బుసలుకొడుతున్నప్పుడు భారతదేశంతో కాస్తంత సయోధ్య మరింత ముఖ్యం.

Updated Date - 2023-01-20T00:22:31+05:30 IST