రైతు బాంధవుడు

ABN , First Publish Date - 2023-10-03T03:00:28+05:30 IST

‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఎంఎస్‌ స్వామినాథన్‌ కృషి వెలగట్టలేనిది. జాతీయ రైతు కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా– భారత వ్యవసాయ రంగం...

రైతు బాంధవుడు

‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఎంఎస్‌ స్వామినాథన్‌ కృషి వెలగట్టలేనిది. జాతీయ రైతు కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా– భారత వ్యవసాయ రంగం అభివృద్ధిని ఎంత దిగుబడులు పెంచామని కాకుండా, రైతుల ఆదాయం ఎంత పెంచామో ఆలోచించాలి అనీ, రైతులకు ఉత్పత్తి ఖర్చులపై కనీసం యాభై శాతం అదనపు ధర ఉండాలనీ ఆయన నిర్దేశించారు. వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగంపై ఎలా ఉంటుంది, వాటిని ఎదుర్కోవడానికి రైతులు ఏం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఎలా మారాలి అనే అంశాలపై పరిశోధన చేసి, ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేగలిగారు. భారతదేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాల మేరకు మేధా సంపత్తి హక్కుల గురించి చర్చలు జరిగి చట్టం చేసినప్పుడు, అందులో రైతులకు హక్కులు ఉండాలని పోరాడి, వాటిని కూడా చట్టంలోకి చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు కాపాడుతూ వస్తున్న జీవవైవిధ్యాన్ని డాక్యుమెంట్‌ చేసి, దానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా స్వామినాథన్‌ కృషి చేశారు. వ్యవసాయ సమస్యలపై, పరిష్కారాలపై ఆయన మాట్లాడినంత, రాసినంత ఏ ఇతర వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఈ రోజు వరకు చేయలేదు. ప్రభుత్వాలు చెప్పిందే చేయటం కాకుండా, ప్రభుత్వాలు ఏమి చేయాలో చెప్పి, ఒప్పించి ఆయన దేశ వ్యవసాయ రంగాన్ని మార్చగలిగారు. రైతుల తరఫున ఆయనకు ఘన నివాళి.

పులి రాజు

Updated Date - 2023-10-03T03:00:28+05:30 IST