దురాక్రమణల దృశ్యం
ABN , First Publish Date - 2023-01-31T00:51:21+05:30 IST
లద్దాఖ్‌లో పరిస్థితి ఊహించినదానికంటే తీవ్రంగా ఉందని తేలిపోయింది. చైనాతో పంచుకుంటున్న వాస్తవాధీనరేఖ వద్ద 65 పెట్రోలింగ్...
లద్దాఖ్‌లో పరిస్థితి ఊహించినదానికంటే తీవ్రంగా ఉందని తేలిపోయింది. చైనాతో పంచుకుంటున్న వాస్తవాధీనరేఖ వద్ద 65 పెట్రోలింగ్ పాయింట్లలో కనీసం 26 పాయింట్లను భారతదేశం కోల్పోయిందంటూ ఇటీవలి నివేదిక ఒకటి స్పష్టంచేసింది. ఇంటలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన పోలీసు డైరక్టర్ జనరల్స్, ఇనస్పెక్టర్ జనరల్స్ వార్షిక సదస్సులో సమర్పించిన ఈ పత్రంమీద, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతాసలహాదారు అజిత్ డోభాల్ వంటి కీలకమైనవారంతా ఉన్న ఈ సదస్సు చర్చించనేలేదంటూ వార్తలు వచ్చాయి. భారత భూభాగాన్ని చైనా కొద్దికొద్దిగా నంచుకుతింటున్న విషయం మరోమారు స్పష్టమైందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన విమర్శకు ప్రతిగా విదేశాంగమంత్రి జయశంకర్– ఇది 1962లోనే, అంటే నెహ్రూ ఏలుబడిలోనే జరిగిపోయిదంటూ వ్యాఖ్యానించారు. 2017లో రాహుల్‌గాంధీ చైనా రాయబారిని కలవడాన్ని కూడా పనిలోపనిగా గుర్తుచేశారు. దీనికి జవాబుగా, కాంగ్రెస్ గతంలో విడుదలైన ఒక హిందీ సినిమా టైటిల్ వాడుకుంటూ, చైనా విషయంలో మోదీ ప్రభుత్వ ధోరణిని ‘డిడిఎల్‌జె’ (డినై–డిస్ట్రాక్ట్–లై–జస్టిఫై)గా అభివర్ణించింది.
దేశ అంతర్గత భద్రతకు సంబంధించి డీజీపీల కాన్ఫరెన్స్ ఎంతో ముఖ్యమైనది. లద్దాఖ్‌లో సైనిక పహారాలేని ప్రాంతాలు తగ్గిపోవడంపై లెహ్ సీనియర్ ఎస్‌పి సమర్పించిన పత్రం క్షేత్రస్థాయి వాస్తవాన్ని తెలియచెబుతున్నది. ఘర్‌వాపసీ, బీఫ్ నిషేధం ఇత్యాది అంశాలద్వారా సంఘ్‌పరివార్ సంస్థలు యువతను రెచ్చగొడుతున్నాయని, ఇందుకు ప్రతిగా ముస్లిం యువతలోనూ మార్పువస్తున్నదని కొందరు సీనియర్ పోలీసు అధికారుల పత్రాలు వివరించాయట. సమావేశానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ముందుగా అన్ని పత్రాలను ఉంచినా, ఆ తరువాత వాటిలో చాలా తొలగించారు. లద్దాఖ్‌లో గస్తీలేని పాయింట్లు పెరిగిపోతుండటంతో చైనా చొరబాట్లకు మరింత అవకాశం ఏర్పడిందని హెచ్చరిస్తున్న ఈ పత్రం వాటిలో ఒకటి. కానీ, బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో మాదిరిగానే ఒకసారి పాలకులు సెన్సార్ అస్త్రం ప్రయోగిస్తే, ఎక్కడలేని ప్రాధాన్యం వస్తుంది. మీడియా ఈ పత్రాన్ని సంపాదించింది.
తూర్పు లద్దాఖ్‌లో కారకోరం పాస్‌నుంచి చుమూర్ వరకూ ఉన్న మొత్తం 65 పాయింట్లలో భారత భద్రతాబలగాలు 26చోట్లలో గస్తీ వదులుకున్నందున ఆ స్థితిని ఆధారంగా చేసుకొని చైనా బఫర్ జోన్లను సృష్టిస్తూ, సరిహద్దును భారత్ వైపునకు నెడుతున్నదని పత్రం వివరిస్తున్నది. ముందుగా కాస్తంత చొరబడటం, అనంతరం ఉద్రిక్తతలను నివారించే పేరిట వాటిని బఫర్ జోన్లుగా మార్చి మన సైనికుల గస్తీకి వీల్లేకుండా చేయడం, తాను అక్కడి శిఖరాలమీద కెమెరాలు అమర్చుకొని మన సాయుధ బలగాల కదలికలను గమనిస్తూ మన సైనికులు ప్రవేశిస్తే తమ భూభాగంగా రాద్ధాంతం చేయడం, ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పడేట్టు చేయడం జరుగుతున్నదని నివేదిక సారాంశం. క్రమంగా ఒక్కో అంగుళం ఆక్రమించుకొనే ‘సలామీ స్లైసింగ్’ విధానానికి చైనా పాల్పడుతున్నదన్న హెచ్చరిక ఇది.
రెండేళ్ళుగా, అంటే 2020 ఏప్రిల్ మొదలు చైనా చొరబాట్లు హెచ్చినమాట నిజం. తన భూభాగమనో, వివాదాస్పద ప్రాంతాలనో వాదిస్తూ గతంలో భారతదేశం గస్తీలో ఉన్న ప్రాంతాలు ఒక్కొటొక్కటీ బఫర్‌జోన్లుగా మార్చివేయడంలో చైనా విజయవంతమైందని అర్థం. చైనా అభ్యంతరాలవల్లనో, దానిని రెచ్చగొట్టవద్దనో భారతసైన్యం చాలా పాయింట్లలో గస్తీ వదులుకుంది. సైనికులు లేకపోవడంతో పాటు, పౌరులను, పశువుల కాపరులను కూడా మన అధికారులు అటుగా పోనివ్వడం లేదట. గతంలో కారకోరం పాస్ వరకూ మనం స్వేచ్ఛగా గస్తీ నిర్వహించుకుంటే, 2021 డిసెంబరు నుంచి కొత్త నియంత్రణల వల్ల పరిస్థితి మారిపోయి, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అనధికారిక ‘బఫర్‌జోన్లు’ ఏర్పడ్డాయని నివేదిక హెచ్చరిస్తున్నది. భారతదేశం తన భూభాగాన్ని చైనాకు చేజేతులా అప్పగిస్తున్నదంటూ మాజీ సైనికాధికారులు, రక్షణరంగ నిపుణులు, మీడియా సంస్థలు చేస్తున్న వాదనలో నిజం ఉన్నదని ఈ నివేదిక తెలియచెబుతోంది. చైనాకు ‘దీటైన జవాబు ఇవ్వగలిగే’ తమ ప్రభుత్వం హయాంలో భారతదేశం ‘ఒక్క అంగుళం కూడా’ వదులుకోదని చెబుతున్నవారు ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తే దేశానికి మంచిది.