‘భౌగోళిక తెలంగాణ’ చాలదన్న దార్శనికుడు

ABN , First Publish Date - 2023-10-10T01:24:15+05:30 IST

‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో’ అని ప్రజా కళాకారులు పాడుకున్నట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర సాధన ఉద్యమం వరకు తెలంగాణ పల్లెలు నెత్తురోడాయి...

‘భౌగోళిక తెలంగాణ’ చాలదన్న దార్శనికుడు

‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో’ అని ప్రజా కళాకారులు పాడుకున్నట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర సాధన ఉద్యమం వరకు తెలంగాణ పల్లెలు నెత్తురోడాయి. ఆ నెత్తురులో నుంచి పుట్టిన ధిక్కార స్వరమే సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ. చుట్టూ అణచివేతలు, ప్రతిఘటన పోరాటాల మధ్య పెరిగిన సత్యనారాయణకు తిరుగుబాటు సహజ స్వభావంగా ఏర్పడింది. ‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు/ మోస పోతివా నీవు గోస పడుతావు,’ అంటూ 1952 నుంచి ఊరూరును మేల్కొలిపిన సంగం రెడ్డి సత్యనారాయణ సరిగ్గా ఏడేళ్లనాడు సద్దుల బతుకమ్మ సాక్షిగా బతుకు చాలించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నా, కేసీఆర్ పార్టీలో కీలక పదవిలో ఉన్నా, నియంతృత్వ ధోరణి రేఖామాత్రంగా పొడసూపినా పూచికపుల్లవలె పదవులను పరిత్యజించి పోరాట దారిలో పల్లేరుగాయలను, ముళ్లకంపలను మల్లెపూల వలె భావించి, పరుగులు తీసిన పోరాట యోధుడు మన సత్తెన్న.

హనుమకొండను ఆనుకుని మూడు చెరువుల మధ్య ఉన్న గ్రామమే ముచ్చర్ల. మూడు చెరువులు, ముప్పయి కుంటలు, మూడు వందల బావులు ఆ ఊరి ప్రత్యేకత. ముచ్చెర్లలో సంగంరెడ్డి నర్సయ్య, నర్సమ్మ దంపతులకు 1933 జనవరి 1న ఇద్దరు అక్కలు, నలుగురు అన్నల తర్వాత చివరి సంతానంగా జన్మించారు సత్యనారాయణ. బాల్యం నుంచే పాటలు పద్యాలు అల్లుతూ పాడుతూ నాటకాలు వేయడం ఆయనకు మక్కువ.

చిన్నతనంలోనే సమాజంలో అంటరానితనం, నిర్బంధాలు, రజాకార్ల అరాచకాలు, మానభంగాలు, హత్యలు, నిజాం నియంతృత్వ పోకడలు సత్తెన్నలో ధిక్కారానికి బీజం వేశాయి. కడవెండి, దేవరుప్పుల, పరకాల, పాలకుర్తి, వీరబైరాన్‌పల్లి, కూటిగల్లు వంటి పోరాటాలు ఆయనలో కోపం రగిల్చాయి. చిన్నప్పుడే ఖిల్లా వరంగల్‌లో ఆర్యసమాజ్ యోధుడు బత్తిని అయిలయ్యగౌడ్ మడమతిప్పని పౌరుషాన్ని, ఒంటరిగా వందలాది మంది రజాకార్లను ఎదిరించి అమరుడైన తీరును తిలకించి లాఠీతోనే హార్మోనియం మోగించడం నేర్చుకున్నాడు సంగంరెడ్డి. ‘నాన్ముల్కీ గో బ్యాక్’ అంటూ 1952లోనే తలకు పాగా బిగించి, చేతిలో లాఠీ ధరించిన సంగంరెడ్డి ఎన్నో ప్రజా ఉద్యమాలు రాజీ లేకుండా నడిపారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలకు పురుడు పోశారు. తొలుత పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా, తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా, టీఆర్ఎస్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినా నాయకుల వ్యష్టిస్వామ్యాన్ని, నియంతృత్వాన్ని సహించలేకపోయారు.

తెలంగాణ గ్రామీణ జీవనంలో పాట విడదీయరాని అనుబంధం. వర్షాలు పడాలన్నా, పంటలు పండాలన్నా, వరినాటుకో పాట, కలుపు తీయడానికో పాట ఇట్లా ఒక్కోదానికి ఒక్కోపాట పాడుతుంటారు. ‘మా పల్లె పాలించు వానదేవుడా – మమ్మెల్ల రక్షించు వానదేవుడా/ ఏ దిక్కునున్నావో వానదేవుడా – మాదిక్కు రావయ్య వానదేవుడా,’ అంటూ సంగంరెడ్డి రాగం అందుకోగానే జోరున వర్షం కురిసేదని ఇప్పటికీ ముచ్చెర్ల వాసులు కథలు కథలుగా చెప్పుకుంటారు.

‘పంచాయతొచ్చిందిరా పల్లోడా!/ పల్లెకే విలువొచ్చెరా పల్లోడా!’ అంటూ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నవోదయం ఏర్పడుతుందని చాటే గేయం పంచాయతీ వ్యవస్థ ప్రజాస్వామికతత్వాన్ని చాటింది. పంచాయతీ వ్యవస్థ ద్వారా ప్రజల చేతిలోకి అధికారం వస్తుందని, తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అంతా భావించారు. అయితే కాలక్రమేణా ఆ ఆశలు అడియాసలైనాయని సంగంరెడ్డి ఎంతగానో కలత చెందారు. పంచాయతీరాజ్ వ్యవస్థ మౌలిక లక్ష్యాలను గ్రామీణ వ్యవస్థలో పాతుకుపోయిన పెత్తందారీతనం, దొరల పాలన, అగ్రకుల ఆధిపత్యం దెబ్బతీశాయని ఆవేదన చెందారు.

తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, హామీల ఉల్లంఘనలను చూసి రగిలిపోయారు సంగంరెడ్డి. ఆ క్రమంలోనే: ‘సంజీవరెడ్డి మామా– సంజీవరెడ్డి మామా/ అయ్యయ్యో రామ రామ – సంజీవరెడ్డి మామా/ సునోజీ మేరా గానా – కహతాహే తెలంగాణ/ ఇన్సాన్ తుమ్కో మానా, ఐసా కభీనా జానా/ బందర్ కె కార్నామా, బాతేతో లాక్ బోలా/ బహుత్ జల్ద్ మగర్ బూలా, హేగయే తేరా హవాలా/ నికల్ గయా దివాలా/ చోడోజీ తెలంగాణ, ఛలే జావో రాయలసీమా,’ అంటూ తీవ్రంగా దుయ్యబట్టాడు. ఉర్దూ, తెలుగు మేళవించి చక్కటి సాహిత్యాన్ని పండించేవాడు సంగంరెడ్డి: ‘సంజీవరెడ్డి మామా, కైసాహై యే జమానా/ రూపయ్ కు బిఖ్తా బియ్యం, దిన్ మే హీ దిఖ్తా దెయ్యం,’ అంటూ అన్ని భాషల వారికి అర్థం అయ్యే విధంగా పాటలు పాడేవారు సంగంరెడ్డి.

ఆరు సూత్రాల పథకం, ఎనిమిది సూత్రాల పథకం, పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణకు ఇచ్చిన రక్షణలు, హామీలు అన్నింటినీ పాలకులు తుంగలో తొక్కి, గంగలో కలుపుతుంటే హనుమకొండ సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న సంగంరెడ్డి సత్యనారాయణ నాటి వర్ధన్నపేట ఎమ్మెల్యే తక్కెల్లపల్లి పురుషోత్తమరావుతో కలిసి ‘తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి’ని స్థాపించారు. కె.ఆర్ ఆమోస్ నాయకత్వంలో సాగుతున్న టీఎన్జీవో పోరాటానికి సంఘీభావంగా సభలు సమావేశాలు నిర్వహించారు.


‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు/ మోసపోతివా నీవు గోసపడుతావు/ చావుబతుకుల మధ్య సాగుతున్నది నావ/ దరి చేర్చే బాధ్యత నీదేరా సోదరా,’ అంటూ తెలంగాణ ఉద్యమానికి పాదులు తీశారు సంగంరెడ్డి. ప్రొ.జయశంకర్, మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్, సంగంరెడ్డి సత్యనారాయణ చిన్ననాటి నుంచి సహాధ్యాయులు. ముగ్గురు కలిసి నాటకాలు వేసేవారు. జయశంకర్ స్త్రీ పాత్ర ధరిస్తే, సంగంరెడ్డి పాటలు పాడేవారు. నేపథ్యగానం నేరెళ్ల వేణుమాధవ్ చేసేవారు.

తెలంగాణ తొలిదశ ఉద్యమం వైఫల్యాల నుంచి గుణపాఠాలే సోపానంగా మలిదశ ఉద్యమానికి పునాదులు వేయడానికి గౌలిగూడ వెంకటేశ్ ప్రెస్‌లో 1994–95లోనే మేధోమథనం సమావేశాలు నిర్వహించారు. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో జర్నలిస్టులు 1995–96లో పెట్టిన సదస్సుకు నాతో సహా జర్నలిస్టులమంతా హాజరయ్యాం. భువనగిరి సభలో కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, ప్రొ. కేశవరావు జాదవ్, జైని మల్లయ్య గుప్త, భూపతి కృష్ణమూర్తి, ప్రొఫెసర్ జయశంకర్, ఆకుల భూమయ్య, తోట హనుమాండ్లు, స్వామినాథన్ వంటి వారితో కలిసి సంగంరెడ్డి సత్యనారాయణ క్రియాశీల పాత్ర నిర్వహించారు. 1969 ఉద్యమం విఫలమైన తర్వాత నిస్పృహను, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వివిధ సంస్థలు, మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి రగిలించారు. 1996 ఫిబ్రవరిలో పుత్లీబౌలిలోని అశోక్ టాకీస్‌లో ఒక రోజంతా ప్రొ. కేశవరావు జాదవ్, ప్రొ. జయశంకర్, గద్దర్, నాతో పాటు, గాదె ఇన్నారెడ్డి, మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ప్రభాకర్, ప్రొ. సింహాద్రి, ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, మాజీమంత్రి గడ్డం రామస్వామి, వి.కిషన్ యాదవ్, కొరిడె ఉమాకాంత్, లోకేందర్ రెడ్డి తదితరులు తెలంగాణ సభను నిర్వహించారు. ఈ క్రమంలో 1997లో అనేక తెలంగాణ ఉద్యమ సంస్థలు పుట్టుకొచ్చాయి. మార్చిలో జరిగిన భువనగిరి మహాసభ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చాటింది. భువనగిరి సభలో ఆడిపాడిన గద్దర్‌పై జరిగిన కాల్పులతో తెలంగాణ ఆకాంక్ష మరింత బలపడింది. ఆగస్టులో సూర్యాపేట తెలంగాణ మహాసభ, అక్టోబర్‌లో తెలంగాణ ఐక్యవేదికలు ఏర్పడి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయినవి. డిసెంబర్ 28, 29 తేదీల్లో అఖిల భారత ప్రజాప్రతిఘటన వేదిక వరంగల్ మహాసభ నిర్వహించి, వరంగల్ డిక్లరేషన్ పేరుమీద ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చింది. దానికి అనుబంధంగా 1998 జూలైలో తెలంగాణ జనసభ ఆవిర్భవించి ప్రజలను సమీకరిచడం మొదలు పెట్టింది. ఆ తర్వాతహైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలోని తెలంగాణ ఐక్యవేదిక అనేక సమావేశాలకు కేంద్రంగా మారింది.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఏడాదిన్నర కాలం పార్టీలో కీలకంగా వ్యవహరించారు సంగంరెడ్డి. కేసీఆర్‌లో నియంతృత్వ ధోరణిని కనిపెట్టేందుకు సంగంరెడ్డికి ఎంతో సమయం పట్టలేదు. సందర్భం వచ్చినప్పుడు, తనకు ప్రమాదం అని భావించినవారిని పార్టీకి దూరం పెట్టడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే మొదట కేసీఆర్‌ తో కలిసి పని చేసిన నాయకులు అటు తర్వాత పార్టీకి దూరమైనారు. కేసీఆర్ వివేచనపరుడే కానీ కపటి, ఒంటెత్తుపోకడల మనిషి కూడా అని సంగంరెడ్డి వ్యాఖ్యానించేవారు. తెలంగాణ ఏర్పడితే ఎలా ప్రజాస్వామికంగా ఉండాలో ముందుగానే స్పష్టమైన అవగాహనతో ఉండేవారు సంగంరెడ్డి సత్యనారాయణ. సహధ్యాయుడు ప్రొ. జయశంకర్‌తో వాదోపవాదాలు జరిగేవి. భౌగోళిక తెలంగాణ వస్తే తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ గురించి ఆలోచించవచ్చనే ప్రొ. జయశంకర్ వాదనతో ఏకీభవించడానికి సంగంరెడ్డి ససేమిరా అనేవారు. పార్టీల్లో నియంతృత్వ పోకడలు తొలిగిపోవాలి, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. సమిష్టి నిర్ణయాల ద్వారానే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్‌తో పేచికి దిగేవారు. చివరికి ‘ముచ్చర్ల’ సత్యనారాయణ వాదనే నిజమని తేలిపోయింది. భౌగోళిక తెలంగాణ క్రమంగా సామాజిక తెలంగాణగా, ప్రజాస్వామిక తెలంగాణగా పరిణతి చెందడానికి తెలంగాణ ఓటరు క్రమంగా పౌరునిగా పరిణతి చెందడానికి మరో ఉద్యమం నిర్మించడమే సంగంరెడ్డి సత్యనారాయణకు అసలైన నివాళి.

పాశం యాదగిరి

(సీనియర్‌ జర్నలిస్ట్‌ )

నేడు హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో

ముచ్చర్ల సత్యనారాయణ 7వ వర్థంతి సభ.

ప్రొ. ఎ. వినాయక్‌ రెడ్డి స్మారకోపన్యాసం చేస్తారు. సంగంరెడ్డి పృథ్విరాజ్‌, జయధీర్‌ తిరుమలరావు,

ఆకునూరి మురళి, పాశం యాదగిరి, విమలక్క, బోయినపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొంటారు.

Updated Date - 2023-10-10T01:24:15+05:30 IST