ఏడాది ముందే ‘సార్వత్రక’ వేసవి!

ABN , First Publish Date - 2023-03-01T00:39:41+05:30 IST

వచ్చేఏడాది సార్వత్రక ఎన్నికలు. ఆ లోగా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ తీవ్రతరం అయ్యేట్లు కనపడుతోంది. ఇరు పక్షాల వారూ ఒకరిపై మరొకరు తీవ్ర దాడులు చేసుకునేందుకు...

ఏడాది ముందే ‘సార్వత్రక’ వేసవి!

వచ్చేఏడాది సార్వత్రక ఎన్నికలు. ఆ లోగా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ తీవ్రతరం అయ్యేట్లు కనపడుతోంది. ఇరు పక్షాల వారూ ఒకరిపై మరొకరు తీవ్ర దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దాడులు కేవలం మాటల యుద్ధానికే పరిమితమయ్యే పరిస్థితులు లేవు. ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు అన్ని రకాల ఆయుధాలను వాడగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్నదనడంలో సందేహం లేదు. ‘మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉన్నది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలున్నాయి. అయితే బిజెపి వద్ద ఉన్నంత డబ్బు మరే పార్టీ వద్దా లేదు. పైగా బలమైన నేతలపై సిబిఐ, ఈడీ, ఆదాయపన్ను, ఎన్ఐఏతో సహా అన్ని ఏజెన్సీలను ఉసికొల్పి భయభ్రాంతులు చేయగల శక్తి బీజేపీకే ఉన్నది. మన హయాంలో కాంట్రాక్టర్లు, వ్యాపారులను ప్రోత్సహించిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాం. వారిని రకరకాల మార్గాల ద్వారా బీజేపీ ప్రలోభపెడుతోంది. అందువల్ల మేము ఆత్మరక్షణలో ఉన్నాం’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు రాయపూర్‌లో జరిగిన ఏఐసిసి ప్లీనరీలో వాపోయారు.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో ఏఐసిసి ప్లీనరీకి నాలుగు రోజుల ముందు ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌కు సన్నిహితులైన కాంగ్రెస్ కోశాధికారి, పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్, ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా పలువురు నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. ప్రతి టన్ను బొగ్గుపై రూ.25 లెవీ అక్రమంగా వసూలు చేసి రోజుకు రెండు, మూడు కోట్ల చొప్పున భారీ మొత్తాన్ని సేకరించారని, ఇందులో అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారన్నది ఈడీ ఆరోపణ. ఒక వ్యాపారిని ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు. టన్నుకు పాతిక రూపాయల లెవీ పైకి పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వివిధ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఏటా దాదాపు 50 మిలియన్ టన్నుల బొగ్గు తరలించుకుపోతాయి. అందుకు రూ. 5 వేల కోట్ల మేరకు రవాణా వ్యయం అవుతుంది. దీన్నిబట్టి ఎంత లెవీ అక్రమంగా వసూలు చేశారో ఈడీ ఇప్పటికే అంచనా వేసి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజస్థాన్‌కే కాక బీజేపీ పాలిత గుజరాత్, మహారాష్ట్ర విద్యుత్ కంపెనీలకు కూడా ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు బ్లాకులున్నాయి. ఏ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్లీనరీలో అదానీ–మోదీ సంబంధాల గురించి రాహుల్ గాంధీ నుంచి ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు చేశారో, అదే ఛత్తీస్‌గఢ్‌ లో అదానీ గ్రూప్ 2013 నుంచీ మైనింగ్ చేస్తోంది. ఆ రాష్ట్రంలో 2018కి ముందు పదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. ఇక గుజరాత్‌లోని ముంద్రాలో అదానీకే 4620 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఉన్న విషయం జగద్విదితమే. అక్కడికి కూడా రవాణా అయ్యే బొగ్గు ఛత్తీస్‌గఢ్‌దే.

ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే కాదు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌కు చెందిన విద్యుదుత్పాదన కంపెనీ కూడా అదానీ ఎంటర్ ప్రైజెస్‌కే మైనింగ్, డెవలప్‌మెంట్ కార్యకలాపాలను అప్పగించింది. అంతేకాదు రాజస్థాన్ ప్రభుత్వం తిరస్కరించిన తక్కువ నాణ్యత గల బొగ్గు పేరుతో అదానీ గ్రూపుకు నాలుగోవంతు మైనింగ్ ఉచితంగా ఇవ్వడమే కాక దానిపై రాయల్టీ కూడా ఇస్తుందని, పైగా అందులో 60 శాతం తమ స్వంత విద్యుత్ సంస్థలకు అదానీ ఉపయోగించుకుంటారని సిపిఐ(ఎం)కు చెందిన అధికార పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’ తన జనవరి సంచికలో పేర్కొంది. తద్వారా గత పదేళ్లలోనే అదానీ రూ. 28వేల కోట్లు రెండు రాష్ట్రాలనుంచి లూటీ చేసి ఉంటారని విమర్శించింది. ఇదే సిపిఐ(ఏం), కేరళలో తిరువనంతపురం సమీపంలో అదానీ నిర్మిస్తున్న విజింజం రేవుకు గట్టి మద్దతునిస్తోంది. రాజకీయాలు రాజకీయాలే, వ్యాపారం వ్యాపారమే సుమా!

ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు రవాణాపై అక్రమ లెవీకి సంబంధించి ఈడీ ఆరోపణల మాట ఎలా ఉన్నా ఆ మొత్తాన్ని రాయపూర్‌లో ఏఐసిసి ప్లీనరీ నిర్వహించేందుకు ఉపయోగించుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లేకపోవచ్చు. కాంగ్రెస్‌లో ఇలాంటి సభల నిర్వహణకు, ఎన్నికల వ్యయాలకు ఇదే విధంగా నిధులు సేకరించడం సాధారణమే. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మద్యం ధరను కొద్దిగా పెంచి ఆ అదనపు మొత్తంలో కొంతభాగాన్ని ఢిల్లీకి తరలించి పార్టీ నిధిగా సమర్పించేవారని చర్చ జరిగేది. అప్పట్లో ఈడీ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకునేది కాదు. పైగా కేంద్రంలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఉండేది కదా.

వ్యాపార సంస్థలు ఇచ్చే నిధుల విషయమే రహస్యంగా ఉంచే బీజేపీ కూడా తమ సభలను కార్పొరేట్ల, వ్యాపారుల అండ లేకుండా నిర్వహించే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. బీజేపీ, కార్పొరేట్ల సంబంధం ఒక సైద్ధాంతిక సంబంధమే అనేందుకు అదానీకి మోదీ ఇచ్చిన ప్రోద్బలమే ఒక ఉదాహరణ అని అభివర్ణించిన వారున్నారు. కాంగ్రెస్ హయాంలో బీజేపీకి సహాయం చేసిన వ్యాపారులపై ఈడీ దాడులు జరిగిన ఉదంతాలు ఏనాడూ పెద్దగా వెలుగులోకి రాలేదు. గతంలో రాజకీయాల్లో కొన్ని విషయాల్లో మర్యాదలు పాటించేవారు. యుద్ధంలో నాభి క్రింద కొట్టే సంప్రదాయం చాలా తక్కువ సందర్భాల్లో మనకు కనపడేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కొత్త ప్రహసనం ప్రారంభమైంది. సమీప భవిష్యత్‌లో తన అధికారానికి తిరుగులేదన్న ధీమాతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ విశృంఖలంగా ప్రయోగిస్తున్నదనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ తన ఏఐసిసి ప్లీనరీని రాయపూర్‌లో నిర్వహిస్తే దాన్ని భగ్నం చేయడానికి, అదానీపై తాము చేస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈడీ దాడులు జరిపించారని ముఖ్యమంత్రి భగేల్ సహా కాంగ్రెస్ నేతలు పలువురు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం కూడా తమను బలహీనపరిచే క్రమంలో భాగంగానే జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో బలం లేదని చెప్పలేము. తమ పార్టీలో చేరిన వారిపై, తమ ప్రయోజనాలు కాపాడుతున్న వారిపై ఉన్న కేసుల పట్ల చూపిస్తున్నంత ఉపేక్ష ప్రత్యర్థులపై మోదీ ప్రభుత్వం చూపించకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఉపోద్ఘాత చర్యగా నేతలపై ఈడీ, సిబిఐ కేసులను బనాయించిన ఉదాహరణలను కూడా గత ఎనిమిది సంవత్సరాల్లో పలుసార్లు ఎదురయ్యాయి. ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కోవాలి?

పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ప్రతిపక్షాలకు ఈ విషయంలో తగిన సంకేతాలు ఇచ్చారు. 2019కి ముందు ప్రత్యామ్నాయ కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రధాన కారణం రీత్యా ప్రతిపక్షాలు ఏకం కాలేకపోయాయి. 2024 సమీపిస్తున్న తరుణంలో నాయకత్వంతో ప్రమేయం లేకుండా ప్రతిపక్షాలు ఐకమత్యంగా పనిచేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు మోదీ నాయకత్వంలోని ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీల విజృంభణే కారణం. ‘ఇవాళ ఈడీ పుణ్యమా అని ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి’ అని మోదీ పార్లమెంట్‌లో ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలన్నిటినీ అవినీతి గాటన కడుతూ తానొక్కడే పాలతో కడిగిన పుణ్యమూర్తిగా చిత్రించుకోవాలన్నది ఆయన ప్రయత్నంగా కనపడుతోంది.

ఏఐసిసి ప్లీనరీలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీలను తమపై ప్రయోగిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. సోనియాగాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే సహా దాదాపు అందరూ ఈ విషయంలో మోదీని తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో మొట్టమొదటిసారి దేశంలో భావసారూప్యత గల ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని, మూడో శక్తి వల్ల బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సందేశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్లీనరీ ముగిసిన మరునాడే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంకానీ, ఈ అరెస్టును కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎస్‌పి, ఆర్‌జెడి, తృణమూల్, వామపక్షాలతో సహా దేశంలో దాదాపు అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించడం కానీ యాదృచ్ఛిక పరిణామం కాకపోవచ్చు. ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాలు ఐక్యమయినట్లే ఇప్పుడు ఐక్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మున్ముందు మోదీ ప్రభుత్వం ఒకవైపు, గాయపడ్డ ప్రతిపక్షాలు మరోవైపు తమ యుద్ధాన్ని తాడోపేడో అన్నట్లుగా సాగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే ఎమర్జెన్సీలో విపక్ష నేతలను నిర్బంధించడానికి ఇందిర చూపిన కారణాలు వేరు, ఇప్పుడు మోదీ చూపిస్తున్న కారణాలు వేరు అని ప్రతిపక్షాలు గ్రహించి, తమ ఐకమత్యం తమ అవినీతిని సమర్థించుకునేందుకు కాదని ప్రజల్లో నిరూపించాల్సిన అవసరం ఉన్నది. ‘ఈ కేసులన్నీ బూటకమే, మాకు అధికారమిస్తే మూడు గంటల్లో మోదీ, అమిత్ షాలను కూడా కేసుల్లో ఇరికిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు అన్నారు. క్రోనీ క్యాపిటలిజం ఒక ప్రధాన అంశమే కాని తాము వ్యాపారులను ప్రోత్సహించడానికీ, మొత్తం దేశాన్నే కొందరికి అప్పగించేలా మోదీ వ్యవహరిస్తున్న తీరుకు తేడా కూడా ప్రతిపక్షాలు సమర్థంగా వివరించవలసి ఉంటుంది. ప్లీనరీలో కాంగ్రెస్ ఆమోదించిన సామాజిక తీర్మానంలో దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీల సాధికారితకు విప్లవాత్మకమైన ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రజల్లో ఒక కదలిక వచ్చేలా ఈ ప్రతిపాదనలను ఉపయోగించుకోనంతవరకూ, ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌తో ఏకీభవించనంతవరకూ వాటి ప్రభావం పెద్దగా ఉండదేమో?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-03-01T00:39:41+05:30 IST