మోదీ సర్కార్‌కు అదానీ గండం!
ABN , First Publish Date - 2023-02-01T00:50:56+05:30 IST
ఢిల్లీ నుంచి గ్రేటర్ నోయిడాకు వెళుతుంటే ఎక్స్‌ప్రెస్ హైవే పొడవునా ఆకాశహర్మ్యాల నిర్మాణం కనపడుతుంది...
ఢిల్లీ నుంచి గ్రేటర్ నోయిడాకు వెళుతుంటే ఎక్స్‌ప్రెస్ హైవే పొడవునా ఆకాశహర్మ్యాల నిర్మాణం కనపడుతుంది. కొన్ని అపార్ట్‌మెంట్లు శరవేగంతో పూర్తయి అందంగా కనిపిస్తుంటాయి. మరి కొన్ని పూర్తయీ, పూర్తి కాక, శిథిలావస్థలో కనపడతాయి. నిర్మాణం పూర్తయిన అపార్ట్‌మెంట్లు కూడా గిరాకీ లేక అలానే పడి ఉంటాయి. నిజానికి వాటికి మంచి ధర పలుకుతుంది. అయితే భారీ అప్పులు, కేసుల్లో చిక్కుకుని ఆ అపార్ట్‌మెంట్లు అమ్ముడుబోవడం లేదు. నిర్మాణ రంగంలోని ఈ నిరుత్సాహకర పరిస్థితికి ఒక కారణం ఉన్నది. ఆ అపార్ట్‌మెంట్ల నిర్మాతలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న వారితో రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడమే! ఇలాంటి సంకట పరిస్థితుల నెదుర్కొంటున్న నిర్మాణ సంస్థలలో ప్రధానమైనది జెపి గ్రూపు.
ఈ సంస్థ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ గౌర్. ఒక ప్రభుత్వ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన స్థాపించిన జెపి గ్రూప్ తొలుత సిమెంట్‌ను ఉత్పత్తి చేసేది. గౌర్ ప్రతిభా సామర్థ్యాలతో ఆ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి తెహ్రీ, సర్దార్ సరోవర్ డ్యామ్ వంటి భారీ ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఎల్ఐసి కూడా ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టింది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెపి గ్రూప్‌కు యమునా ఎక్స్‌ప్రెస్ హైవే కాంట్రాక్టు లభించింది. అంతేకాదు, ఎక్స్‌ప్రెస్ హైవే పొడవునా ఆ కంపెనీకి ఉచితంగా వందల ఎకరాల భూమి కూడా లభించింది. అందులోనే ఈ గ్రూపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఫార్ములా వన్ రేస్‌లను నిర్వహించేందుకు మాయావతి ప్రభుత్వం ఈ గ్రూప్‌కు వినోదపు పన్ను మినహాయింపు కూడా కల్పించింది. మాయావతి ప్రభుత్వం పడిపోయిన తర్వాత జెపి గ్రూప్ ఆర్థికంగా దెబ్బతింది. దాల్మియాకు తన సిమెంట్, విద్యుత్ ప్లాంట్లను స్వాధీనం చేసింది. స్టేట్ బ్యాంక్ ఈ గ్రూపు ద్వారా దాదాపు రూ. 7వేల కోట్లు నష్టపోయింది. ఈ గ్రూప్ నిర్మించిన అపార్ట్‌మెంట్లు పూర్తి కాకపోవడంతో దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు అదానీ కంపెనీయో, మరో సంస్థో వాటిని స్వాధీనం చేసుకుని పూర్తి చేస్తారని ప్రచారం జరుగుతోంది. ‘వ్యాపార సంస్థలు అధికారంలో ఉన్న రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలి. అంతేకాని వారితో పూర్తిగా మమేకం కాగూడదు. వారి అడుగులకు మడుగులొత్తకూడదు. అలా జరిగితే రాజకీయ నేతలు ఎప్పుడో ఒకప్పుడు ఆత్మరక్షణలో పడడం ఖాయం. ఈ సంగతి అటుంచితే జెపి గ్రూప్ మాదిరి తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఇటీవల యూపీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అధినేత అన్నాడు. ఈ మాటతో విభేదించేవారు ఎవరూ ఉండరు.
మన దేశంలో పారిశ్రామికవేత్తల ఉత్థాన పతనాలు రాజకీయ పార్టీల, నాయకుల ప్రాభవంపై ఆధారపడి ఉండడం కొత్త పరిణామమేమీ కాదు. ముఖ్యమంత్రులు, వారి బంధువులు వ్యాపార సంస్థలతో చేతులు కలపడం, ప్రైవేట్ విమానాల్లో సంచరించడం ఇప్పుడే ప్రారంభమైంది కాదు. ముఖ్యమంత్రులను వ్యాపార సంస్థలే నిర్ణయించిన సందర్భాలు కూడా లేకపోలేదు. డిఎల్ఎఫ్, ఇండియా బుల్స్, సహారా తదితర సంస్థల వెనుక ఉన్న నేతల సంగతి చరిత్ర పుటల్లో నమోదయింది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటినుంచీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మరింతగా పుంజుకున్నది. కార్పొరేట్ కుబేరులు రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభకూ ఎన్నికయ్యారు! క్విడ్ ప్రో కో (ప్రతిఫల సిద్ధాంతం) సంస్కృతి విశ్వరూపం దాల్చింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ ఆస్తిగా మార్చేందుకు నేతలు ఏ మాత్రం వెనుకాడడంలేదు. ఈ సంస్కృతి లబ్ధిదారులలో అగ్రగామి గౌతమ్ అదానీ.
ఒక మధ్య తరగతి జౌళి వ్యాపారుల కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ తన సోదరుడికి ఉన్న ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు కాలం కలిసి వచ్చింది. మోదీ ఇచ్చిన ప్రోత్సాహంతో అదానీ అంచెలంచెలుగా పైకి ఎదిగారు. ఇది చాలా మందికి తెలుసు. ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ 2014లో అదానీ ప్రైవేట్ విమానంలోనే ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ ప్రభుత్వ అండదండలతోనే దేశంలోని ప్రధాన రేవులు, విమానాశ్రయాలను అదానీ కంపెనీ స్వాధీనం చేసుకున్నది. అంతేనా? మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, మైనింగ్, ఇంధనం, థర్మల్ విద్యుత్, సౌరశక్తి డేటా సెంటర్లు, వ్యవసాయోత్పత్తులు, వంటనూనెలు, ప్రజా రవాణా, రియల్ ఎస్టేట్, శీతలీకరణ కేంద్రాలు, గోదాములు, రైల్వే, రక్షణ రంగాలు, గ్రీన్ ఎనర్జీ మొదలైన రంగాలు ఆయన చేతుల్లోకి వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? కానే కాదు. గుజరాత్‌లో అత్యంత ఆస్తిపరుడుగా 2013 నాటికే ఎదిగిన వ్యాపార దిగ్గజం అదానీ. ఇప్పుడు ఆయన గ్రూప్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించి, వేలాది ప్రాజెక్టులు అమలు చేస్తోంది. కరోనా సమయంలో అనేక కంపెనీలు మూతపడిన సమయంలో కూడా అదానీ గ్రూపు వేల కోట్ల లాభాలు ఆర్జిస్తూనే ఉన్నది. అదానీ క్రమంగా ఒక రాజకీయ నిర్ణాయక శక్తి కూడా అయ్యారనడంలో సందేహం లేదు. అదానీకి మాత్రమే కాదు, అంబానీలతో పాటు దేశంలో డజన్‌కు పైగా బడా పారిశ్రామిక సంస్థల విజయ గాథ వెనుక మోదీ ప్రభుత్వ విధానాల తోడ్పాటు విశేషంగా ఉన్నది. ఈ వాస్తవాన్ని ఎవరూ నిరాకరించలేరు. 2014–22 సంవత్సరాల మధ్య ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాను అలవోకగా చూసినా ఈ విషయం అర్థమవుతుంది. శ్రీలంకలో కూడా అదానీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ప్రోత్సాహం ఇచ్చి దాన్ని భారతదేశ ప్రాజెక్టుగా పరిగణించాలని ఆ దేశాధ్యక్షుడు గొట్టాయా రాజపక్సేపై నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మోదీ హయాంలోనే భారత్‌లో ఒక శాతం అత్యంత సంపన్నులు 40 శాతం సంపదకు అధిపతులు అయ్యారని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. అదానీ సంపదపై ఒక్కసారి సంపద పన్ను వేసినా ప్రభుత్వానికి లభించే ఆదాయం 50 లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులను నియమించేందుకు తోడ్పడుతుందని కూడా ఆక్స్‌ఫామ్ తెలిపింది.
ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండేళ్ల క్రితం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. దరిమిలా కార్పొరేట్ కంపెనీలు రహస్యంగా వేల కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆ కార్పొరేట్లకు ప్యాకేజీ పేరుతో లక్షన్నర కోట్ల మేరకు పన్ను రాయితీలు కల్పించింది.
తాజాగా అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ కంపెనీ వాటాల కొనుగోలు, అమ్మకాల్లో చోటు చేసుకున్న అక్రమాల గురించి వెల్లడించింది. పన్ను ఎగవేతదార్లకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల్లో అదానీ కంపెనీల గురించి, గౌతమ్ అదానీ గ్రూప్ తీసుకున్న వేల కోట్ల రుణాల గురించి అనేక విషయాలను బహిర్గతం చేసింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకమయింది. కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసం జరిగిందని, ఇది వ్యవస్థీకృత దోపిడీ అని హిండెన్‌బర్గ్ నివేదిక అభివర్ణించింది. ఇది సృష్టిస్తున్న ప్రకంపనలతో అదానీ గ్రూప్ వాటాల ధర 20 శాతానికి పైగా పడిపోయింది. దాదాపు నాలుగు లక్షల కోట్ల మేరకు ఈ గ్రూపు నష్టపోయిందని, ప్రపంచంలో పదిమంది అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ స్థానం కోల్పోయారని కూడా వార్తలు వచ్చాయి. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి కూడా దాదాపు 19 వేల కోట్ల మేరకు కోల్పోయిందని, ఈ గ్రూపు కంపెనీలకు రూ. 80వేల కోట్లకు పైగా రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపుకు అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చిన మోదీ ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గుజరాత్ అల్లర్లపై బిబిసి వీడియో విడుదల చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు రావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. మోదీని బలహీనపరిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో కలిసికట్టుగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా అన్న చర్చ కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏమైనా హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సమాధానం చెప్పి తీరాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి అవినీతి అత్యంత ప్రమాదకారి అని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఉద్ఘాటించారు. అవినీతిని ఎంతమాత్రమూ సహించకూడదని, ఆత్మరక్షణలో పడకుండా నిర్భయంగా దాడులు చేయాలని ఇటీవల దర్యాప్తు సంస్థల అధికారుల సమావేశంలో మోదీ గట్టిగా చెప్పారు. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియోను బిజెపి మద్దతుదారులు వాట్సాప్ యూనివర్సిటీల్లో పంపిణీ చేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు కోరినట్లు హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? ఇతర రాజకీయ పార్టీల మద్దతుదారులైన పారిశ్రామికవేత్తలపై జరిపించినట్లు అదానీ గ్రూపు సంస్థలపై కూడా సిబిఐ, ఈడీ, సెబి, ఐటి సంస్థలు దాడులు చేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను మన్నిస్తుందా?
మోదీ ప్రభుత్వానికీ, అదానీ గ్రూపునకు ఉన్న సంబంధం జగద్విదితమే కనుక ఆ సంబంధంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. విచిత్రమేమంటే బిజెపి దేశ భక్తిలో కూడా అదానీ గ్రూపు వాటా అడుగుతోంది. హిండెన్‌బర్గ్ నివేదికకు జవాబిస్తూ ఈ నివేదిక భారత దేశంపైనే దాడిగా అదానీ గ్రూపు అభివర్ణించడం ఆశ్చర్యకరం, గతంలో బిజెపి నేత ప్రమోద్ మహాజన్ ధీరూభాయి అంబానీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు తనపై దాడిని దేశంపై దాడిగా భావిస్తున్న అదానీకి కూడా భారతరత్న ప్రదానం చేయడం సమంజసమేనని బిజెపి నేతలు భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశంలో వ్యాపార–రాజకీయ వర్గాల కుమ్మక్కు పోనంతవరకూ ప్రజాస్వామ్యం పచ్చగా పరిఢవిల్లే అవకాశాలు లేవు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)