RK Kothapaluku: మోదీకి అదానీ మచ్చ!
ABN , First Publish Date - 2023-02-12T01:55:26+05:30 IST
‘అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఏమి చేస్తారు? భవిష్యత్తులోనైనా ఇలాంటివి జరగకుండా చూడటానికి...
‘అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఏమి చేస్తారు? భవిష్యత్తులోనైనా ఇలాంటివి జరగకుండా చూడటానికి నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలించండి’.. అని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, సెబీకి సూచించింది. నిజానికి ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే అదానీ గ్రూపు వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు కొంత చొరవ తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చింది. విదేశాలలో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల ద్వారా నిధులను మళ్లించి గ్రూపు కంపెనీల షేర్ల ధరలను స్టాక్ మార్కెట్‌లో గౌతమ్ అదానీ అమాంతంగా పెంచుతూ వచ్చారని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అదానీ గ్రూపు కంపెనీ షేర్లు మార్కెట్‌లో కుప్పకూలాయి. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు మదుపర్లు నష్టపోయారు. ఈ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై లోక్‌సభ సజావుగా సాగకుండా అడ్డుపడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ అంశంపై లోక్‌సభలో ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ, రాజ్యసభలోనూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. తన వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఆయన కాంగ్రెస్ పార్టీని పాపాలభైరవుడిగా నిందించారు. ప్రధానమంత్రి ప్రసంగానికి మురిసిపోయిన బీజేపీ సభ్యులు బల్లలు చరిచి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. అయితే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అదానీ గ్రూపు వ్యవహారంపై ప్రధాని మోదీ ఈషణ్మాత్రంగా కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. 10 లక్షల కోట్ల రూపాయల మేర మదుపర్ల సంపద ఆవిరి అయినప్పటికీ తమకేమీ పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సహజంగానే ఆశ్చర్యం కలిగించింది. దీంతో ప్రధానమంత్రికి గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. గతంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం స్పందించి పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోబోతున్న చర్యలను వివరించేది. మోదీ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా 10 లక్షల కోట్ల రూపాయల మేర మదుపర్ల పెట్టుబడులు ఆవిరైనప్పటికీ అదొక సమస్య కాదన్నట్టుగా వ్యవహరించింది. జవాబుదారీతనం ప్రదర్శించలేదు. స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత సెబీదే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని చెప్పగలరా? ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేని మాట నిజం. ప్రభుత్వంలో ఉన్నవారిపై కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు రాలేదు. అయితే గౌతమ్ అదానీ గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త! కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతింతై వటుడింతై.. అన్నట్టుగా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంపై దేశ ప్రజలలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీ కూడా ఇదే అంశాన్ని తన ప్రసంగంలో ఎత్తిచూపారు. దీనికి బదులు చెప్పాల్సిన ప్రధాని మోదీ.. రాహుల్‌గాంధీని ఎగతాళి చేశారు. దేశ ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి గానీ, మదుపర్లకు భరోసా ఇవ్వడానికి గానీ ప్రధానమంత్రి ప్రయత్నించకపోవడం ఆక్షేపణీయంగా ఉంది. దేశం కోసమే తాను జీవిస్తున్నానని చెప్పిన నరేంద్ర మోదీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అదానీ వ్యవహారం తనకు మాయనిమచ్చగా మిగలబోతున్న విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదో తెలియదు. గతంలో స్టాక్ మార్కెట్‌లో అవకతవకలు జరిగినప్పుడు కూడా పార్లమెంట్ స్తంభించింది. అప్పటి ప్రభుత్వాలు స్పందించాయి. అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విచారణకు ఆదేశించేవారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ప్రజలలో తనకున్న క్లీన్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయడంలేదు. రాజకీయంగా తనను ఎదుర్కొనే చాణక్యుడు ప్రతిపక్షంలో లేరన్న ధీమా ఆయనకు ఉండవచ్చు. బోఫోర్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న బలంకంటే అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీకి ఎక్కువ బలముండేది. అప్పుడు లోక్‌సభలో తెలుగుదేశం పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా బోఫోర్స్ వ్యవహారంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఎన్టీరామారావు చైర్మన్‌గా నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించింది. ప్రతిపక్ష ఎంపీలు రాజీనామాలు చేశారు. దీంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇది జరిగి మూడున్నర దశాబ్దాలు అయింది. 70 కోట్ల రూపాయల విలువైన బోఫోర్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని గానీ, రాజీవ్‌గాంధీ తప్పుచేశారని గానీ రుజువు కాలేదు. అప్పట్లో ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశం పెట్టినప్పుడు, ఆ తర్వాత ప్రధానులుగా పనిచేసిన వాజ్‌పేయి, చంద్రశేఖర్‌లు వెనుక వరుసలో నిలబడేవారు. 1989లో రాజీవ్‌గాంధీ అధికారం కోల్పోయారు. ఆ తర్వాత 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2జీ కుంభకోణం అన్నింట్లోకి ప్రధానమైనది. 2జీ వేలంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గగ్గోలు పెట్టింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. అప్పటి టెలికమ్యూనికేషన్ మంత్రి రాజాను సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. 2జీ వేలంలో భారీ కుంభకోణం జరిగిందని అప్పట్లో కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఉన్న వినోద్ రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో అన్నా హజారే యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు. కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, బాబా రామ్‌దేవ్, సుబ్రమణ్యస్వామి జత కలిశారు. వీరందరి కృషి ఫలితంగా యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. 2జీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన ఏడేళ్ల తరువాత ఇందులో కుంభకోణం కానీ, లంబకోణం కానీ ఏమీ జరగలేదని నిందితులందరూ నిర్దోషులని న్యాయస్థానం తీర్పునిచ్చింది. సీన్ కట్ చేస్తే కుంభకోణం జరిగిందని తన నివేదికలో పేర్కొన్న వినోద్ రాయ్ బీసీసీఐ అధినేత అయ్యారు. పద్మవిభూషణ్ బిరుదు కూడా పొందారు. అన్నా హజారే ప్రస్తుతం జడ్ కేటగిరీ రక్షణలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కిరణ్ బేడీ పుదుచ్చేరి గవర్నర్‌గా నియమితులయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. బాబా రామ్‌దేవ్ వ్యాపారవేత్తగా మారిపోయారు. సుబ్రమణ్యస్వామి ఎంపీ అయ్యారు. ఈ వ్యవహారం వల్ల గరిష్ఠంగా ప్రయోజనం పొందింది నరేంద్ర మోదీ. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. బోఫోర్స్, 2జీ వ్యవహారంలో విచారణకు ఆదేశించుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడింది. అధికారానికి దూరమైంది. బహుశా ఇందుకే కాబోలు అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక వాస్తవమా కాదా? అదానీ గ్రూప్ తప్పు చేసిందా? లేదా? అని తేల్చి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటంలేదు. అయితే తన మిత్రుడిగా ప్రచారంలోకి వచ్చిన అదానీ వ్యవహారంలో తప్పు జరగలేదని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రధానికి ఉంటుందా? ఉండదా? అన్నదే ప్రశ్న. ముంబై ఎయిర్‌పోర్టును నిర్మించిన జీవీకే గ్రూపుపై సీబీఐ, ఈడీ సంస్థలు కేసులు పెట్టడం, ఫలితంగా ఆ ఎయిర్‌పోర్ట్ అదానీపరం కావడం తెలిసిందే. యాజమాన్యం మారిపోగానే సీబీఐ విచారణ ఆగిపోయింది. జీవీకే గ్రూప్ ప్రశాంతంగా ఉంది. వాళ్లు తప్పు చేసినట్టు రుజువు కాలేదు. గంగవరం పోర్టు విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సీబీఐ, ఈడీ పేర్లు చెప్పి గంగవరం పోర్టును అదానీ సొంతం చేసుకున్నారు. ఒక వ్యాపారవేత్త తన కన్ను పడిన పోర్టులు, ఎయిర్‌పోర్టులను హస్తగతం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారన్నదే ఇక్కడ కీలకం. కనీసం ఈ ప్రశ్నకైనా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి కదా! పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన సందేహాలు నివృత్తి కావు కదా! తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని జీవీకే గ్రూప్ ప్రకటించి ఉండవచ్చు గానీ, వాస్తవానికి ఏం జరిగిందో వారి అంతరాత్మకు తెలుసు కదా!
యోగి అలా.. జగన్ ఇలా!
ముంబై ఎయిర్‌పోర్టును అదానీకి వదులుకోకపోతే తిప్పలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు హెచ్చరించడంపై అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల ప్రయోజనాల రక్షణ విషయం కాసేపు పక్కన పెడదాం. గంగవరం పోర్ట్, ముంబై ఎయిర్‌పోర్టును సొంతం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను అదానీ ఉపయోగించుకున్నారా? లేదా? అన్నది తేలాలి కదా? ఈ ఒక్క విషయం తేలిపోతే అదానీ ఏ తప్పూ చేయలేదని, కేంద్ర ప్రభుత్వం ఆయన ఎదుగుదలకు సహకరించలేదని నమ్మవచ్చు. తమాషా ఏమిటంటే, అదానీ వ్యవహారంపై పార్లమెంటులో స్పందించకుండా ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోయిన సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో అదానీ గ్రూపు దక్కించుకున్న నాలుగు వేల కోట్ల రూపాయల కరెంటు మీటర్ల సరఫరా కాంట్రాక్ట్‌ను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రద్దు చేసింది. అదే సమయంలో ప్రధాని మోదీకి వీర విధేయుడిగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అదానీ గ్రూపునకు అదనపు భూమి కేటాయించారు. యోగి అలా, జగన్ ఇలా ఎందుకు? అంటే ఎవరు చెప్పాలి! ప్రధాని మోదీపై అవినీతి ఆరోపణలు లేని మాట ఎంత నిజమో, యూపీఏ హయాంలో పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌పై కూడా ఒక్క అవినీతి ఆరోపణా లేకపోవడం అంతే నిజం. ఇంకా చెప్పాలంటే అంతకుముందు ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిపై కూడా వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవు. అంతెందుకు బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయిపై కూడా ఏ అవినీతి ఆరోపణలు లేవే! కేవలం నరేంద్ర మోదీ విషయంలోనే నీతిమంతుడు అన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? అంటే, దటీజ్ మ్యాజిక్ ఆఫ్ ద మోదీ! ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను ఎదిరించిన ప్రతిపక్ష నాయకులు ఆమెపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయకపోవడం గమనార్హం. రాజకీయంగా నరేంద్ర మోదీకి ఇప్పుడు తిరుగులేకపోవచ్చు గానీ, అదానీ విషయంలో ఆయన ఆత్మరక్షణలో పడలేదని బీజేపీ నాయకులు గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా? కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత నుంచి తప్పుకొన్నప్పటికీ సుప్రీంకోర్టు చొరవ కారణంగా గౌతం అదానీ గ్రూప్‌లో ఏం జరిగిందో ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. ఒక వ్యవస్థ బాధ్యత నుంచి తప్పుకొన్నప్పటికీ మరో వ్యవస్థ బాధ్యత తీసుకోగలగడం మన రాజ్యాంగంలోని గొప్పతనం. ఇందుకు రాజ్యాంగ నిర్మాతలను అభినందించాలి.
జగన్ తప్పులు కనిపించవా?
అదానీ వ్యవహారంపై నోరు విప్పని నరేంద్ర మోదీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పుణ్యమా అని ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ఎగతాళి చేశారు. ఇందులో నిజం కూడా ఉంది. ఈడీని దుర్వినియోగం చేయడం వల్ల ప్రతిపక్షాలు ఉక్కపోతకు గురవుతున్నాయి. రాజకీయంగా నిలదొక్కుకోలేక సతమతమవుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా ప్రతిపక్షాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఆనాడు కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ అన్న తేడా లేకుండా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య విరుద్ధంగా 50 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశారని ప్రధాని మోదీ తాజాగా నిందించారు. నిజమే, అప్పట్లో ఆర్టికల్ 356ను ఇందిర ప్రభుత్వం విపరీతంగా దుర్వినియోగం చేసింది. ఇలాంటి పరిణామాల వల్లే జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్ పుట్టుకొచ్చాయి. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కూడా నాటి కాంగ్రెస్ పార్టీ పడగొట్టిందని ప్రధాని ఎత్తి చూపారు. ఇది కూడా నిజమే. అయితే ప్రస్తుత ప్రధాని మరో రూపంలో ప్రతిపక్షాలను వేధిస్తున్నారు కదా! ఆర్టికల్ 356 ఉపయోగించి ప్రతిపక్ష ప్రభుత్వాలను రద్దు చేయకపోవచ్చు గానీ, ప్రతిపక్ష ప్రభుత్వాలే ఏర్పడకుండా అడ్డుకుంటున్నారు కదా! అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్షాల తరఫున పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు, ఫలితాల తర్వాత బీజేపీలోకి మాత్రమే జంప్ చేయడం వెనుక మతలబు ఏమిటి? ఏ పార్టీకైనా సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగితే కొన్ని అవలక్షణాలు అంటుతాయి. ఈ క్రమంలో నియంతృత్వ పోకడలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీని నియంత అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీని నియంత అంటున్నారు. ఇందిరకు వ్యతిరేకంగా సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనపెట్టి ప్రతిపక్షాలు చేతులు కలిపినట్టుగానే ఇప్పుడు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూడా ప్రతిపక్షాలన్నీ ఏకం కావొచ్చు. ఇందిరాగాంధీ అనుసరించిన మోడల్‌కు, మోదీ అనుసరిస్తున్న మోడల్‌కూ పొంతన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇందిరాగాంధీ కూలదోస్తే, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించి ప్రతిపక్ష నాయకులకు రాజకీయ మనుగడే లేకుండా మోదీ చేస్తున్నారు. ఆ విషయం తెలుసు కనుకే ప్రతిపక్షాలను ఈడీ ఏకం చేస్తున్నదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అస్మదీయుల విషయంలో మాత్రం కేంద్ర ఏజెన్సీలను జోకొడుతున్న మోదీ, తన దారిలోకి రానివారిపైకి అవే ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ రాజకీయాలను తట్టుకోలేక ప్రతిపక్షాలు అల్లాడిపోగా ఇపుడు మోదీ రాజకీయాన్ని తట్టుకోలేక లొంగిపోతున్నాయి. ప్రధాని మోదీని నీతిమంతుడిగా కీర్తిస్తున్న వారు కూడా ఆయన నైతికతను సమర్థించలేకపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవడానికి ఒకప్పుడు పరోక్షంగా సహకరించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు ఏకు మేకుగా మారడంతో లిక్కర్ స్కాంలో ఆయనకు ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అస్మదీయుడైన జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎక్కడ లేని ఉదారత్వం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయంలో కేంద్ర ఏజెన్సీలు నిద్ర నటిస్తున్నాయంటే కాదనగలరా? మితిమీరిన అప్పులతో అనర్థమే అని తాజాగా హెచ్చరించిన ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా అదనపు అప్పులకు ఎలా అనుమతిస్తున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం భావితరాల భవిష్యత్తును బలి చేయవద్దంటున్న ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆ పని చేస్తున్నప్పటికీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈ కారణంగానే మోదీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 600 పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టిందని ఆక్షేపిస్తున్న నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్న విషయం విస్మరించడం ఏమిటో? నియంతృత్వ పోకడలు పెచ్చరిల్లినప్పుడు కరెక్షన్ అనివార్యం అవుతుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో జయప్రకాశ్ నారాయణ్ రూపంలో అదే జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రూపంలో జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలను ఏకం చేయగల స్థాయి ఉన్న నాయకుడు కనిపించకపోవచ్చు గానీ ప్రకృతి ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. ప్రధాని మోదీ అధికార బలం ముందు అనేక మంది ప్రతిపక్ష నాయకులు లొంగిపోతుండవచ్చు గానీ ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు. ప్రధాని అన్నట్టుగానే ఈడీ కారణంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పేరు చెబితేనే ప్రజాస్వామ్య ప్రేమికులు చిరాకుపడేవారు. ఇప్పుడు అదే ప్రజాస్వామ్య ప్రేమికులు కాంగ్రెస్ పార్టీని గంగిగోవుగా చూస్తున్నారు. ఇందుకు తన పోకడలే కారణమని నరేంద్ర మోదీకి మాత్రం తెలియదా? అయినా అధికారం అనే మత్తు వాస్తవంలోకి రానివ్వదు. ఈ కారణంగానే అదానీ వ్యవహారంలో కోట్లాది మంది మదుపరులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయి విలవిల్లాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. నిజానికి ప్రధాని మోదీకి దీటైన నాయకుడు ప్రస్తుతం మన దేశంలోనే లేడు. అయితే ఆయనే తనకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవడం మొదలెట్టారు. అది సొంత పార్టీలో యోగి ఆదిత్యనాథ్ రూపంలో కూడా ఉండవచ్చు. లేదా ప్రతిపక్షాలకు చెందిన ఎవరో ఒకరు నాయకత్వం వహించే స్థితికి ఎదగవచ్చు. ఢిల్లీలో ప్రధాని మోదీని, తెలుగునాట కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను ఎవరూ కదిలించలేని పరిస్థితి ఉండేది. స్వయంకృతాపరాధం వల్లే ఈ ముగ్గురు కూడా ప్రత్యామ్నాయాలు బలపడటానికి బాటలు వేస్తున్నారు. నరేంద్ర మోదీ రాజకీయాలు చూస్తున్నవారికి రాహుల్‌గాంధీ వ్యవహార శైలి కంటికి ఆనకపోచ్చు. ఒకప్పుడు ఇందిరాగాంధీ విషయంలో కూడా ఇలాగే అనిపించేది. నియంతృత్వ పోకడలు జీర్ణించుకోలేని స్థాయికి చేరుకున్నప్పుడు సాత్వికుల కోసం ప్రజలు ఎదురుచూడవచ్చు. నియంతృత్వ పోకడలను ప్రతిఘటిస్తారు. ఆ రోజు ఎంత దూరంలో ఉందన్నదే ఇప్పుడు ప్రశ్న!
ఆర్కే