అరెస్ట్ తర్వాత వైసీపీకి అంతా రివర్సే!

ABN , First Publish Date - 2023-10-06T02:18:34+05:30 IST

రాజకీయాల్లో నేతలు ఒకటి తలిస్తే పరిణామాలు మరోరకంగా ఉంటాయన్నదానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనంగా ఉన్నాయి...

అరెస్ట్ తర్వాత వైసీపీకి అంతా రివర్సే!

రాజకీయాల్లో నేతలు ఒకటి తలిస్తే పరిణామాలు మరోరకంగా ఉంటాయన్నదానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మిత్ర పార్టీ బీజేపీకి హఠాత్తుగా ఏపీలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని కల్పించారు. చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ప్రతిఘటనలు నిరసనలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అనూహ్యంగా సంభవించాయి. ఏపీలో తుపాకి నీడలో కూడా మహిళలు వీధుల్లోనికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడికి రాజకీయ అనుబంధం లేని బెంగళూరులో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఈ వయస్సులో జైలు జీవితం గడపవలసి వచ్చినదనే గాని, రాష్ట్రంలోనే గాక దేశ విదేశాల్లో ఆయనకున్న అభిమానం, పరపతి ఎలాంటివో శత్రువులను కూడా ఆశ్చర్యపరిచాయి.

చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ తన వికృత స్వభాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే జరగకుండా శత విధాలుగా ప్రయత్నాలు చేశారో ఆ టీడీపీ – జనసేన పార్టీల ఎన్నికల పొత్తు గురించి చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన రెండవ రోజే పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటు బీజేపీ జాతీయ పెద్దలకు ఊహించని విధంగా సంకేతాలు ఇచ్చారు. గత రెండేళ్లుగా బీజేపీ నుంచి రోడ్ మాప్ కోసం ఎదురు చూస్తుండిన పవన్ కళ్యాణ్ తనే బీజేపీ పెద్దలకు రోడ్ మాప్ ఇచ్చారు.

రాష్ట్ర బీజేపీ నాయకులు మొన్నటి వరకు జనసేనతో పొత్తు గురించి మాట్లాడేవారు. ఇప్పుడు వారి గొంతుకలు జీర పోయాయి. టీడీపీ – జనసేనలతో పొత్తు పెట్టుకోకపోతే చెల్లని ఓట్ల కన్నా తక్కువగా ఓట్లు దక్కి పరువు పోతుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం మథనపడుతున్నది. చంద్రబాబు నాయుడు – పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారో గానీ, బీజేపీతో పొత్తులేకపోయినా వచ్చే ఎన్నికల్లో ఇంత కన్నా గడ్డు పరిస్థితి ఎదురు కాదని ఎక్కువ మంది భావనగా ఉంది. ఇదే జరిగితే వైసీపీ, బీజేపీ తప్ప రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, వివిధ భావజాలాలు గల ప్రజా సంఘాల నేతలు ఒక తాటి పైకి వచ్చే అవకాశం ఉంది.

డెబ్భై నాలుగేళ్ళ వయస్సులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉండాల్సి రావటం టీడీపీ శ్రేణులతో పాటు అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించవచ్చు గాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్రూరమైన చర్య రాష్ట్ర రాజకీయ పరిణామాలను త్వరితపర్చింది.

ప్రతి రాజకీయ పార్టీకీ ఓటు బ్యాంకు వుంటుంది. ఇది రెండు రకాలు. ఒకటి ఆ పార్టీ ఇచ్చే పిలుపునకు వీధుల్లోనికి వచ్చేవారు. రెండవ వర్గం నిద్రాణమైన ఓటర్లు. వీరు ఓట్లు మాత్రమే వేస్తారు. నేడు క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనంచేస్తే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన తెలపడానికి నిద్రాణమైన ఓటర్లు కూడా వీధుల్లోనికి వస్తున్నారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద చర్చలు జరుగుతున్నాయి. తుపాకి నీడ లేకపోతే ఈ పరిస్థితి ఇంకా ప్రస్ఫుటమయ్యేది. తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి నిర్భంధ కాండ అనుభవించలేదు. వైసీపీ ప్రభుత్వ పాశవిక చర్యలతో ఉదాసీనంగా ఉండిన కేడరు కూడా నేడు రాటు దేలి వీధుల్లోనికి వస్తోంది.


ఇక తటస్థ ఓటర్లు, వీరిలో కూడా ప్రధానంగా మహిళలు ఎక్కువమంది, ఈ వయస్సులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంపై మథన పడుతున్నారు. మున్ముందు నేడు ప్రచారం జరుగుతున్నట్లు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిలను కూడా బోను ఎక్కిస్తే ముఖ్యమంత్రి తనకు తాను ఆత్మ హననం చేసుకొన్నట్లే. ఏ రాజకీయ పార్టీకి చెందని పలువురు డాక్టర్లు, రచయితలు, అధ్యాపకుల నుంచి ఒక ప్రశ్న వస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే నాలుగేళ్ల కాలంలో ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఎన్నికలు ఆరు నెలలు వుండగా ఇప్పుడు ఈ అరెస్టు చర్య రానున్న ఎన్నికల్లో గెలుపొందలేమనే భయం నుంచే పుట్టిందని అంతా భావిస్తున్నారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు తెలంగాణలో చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. అందరి కన్నా ముందు బీజేపీ బలి పశువు కానున్నది. గ్రేటర్ హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాల్లో బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీల తల రాతలను ఆంధ్రప్రదేశ్ మూలాలు గల ఓటర్లు ఎక్కువమంది తిరగ రాసే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ నేటికే దుకాణం కట్టేసే పరిస్థితిలో ఉంది. గుడ్డి కన్ను మూసినా తెరచినా ఒకటే అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి తయారైంది.

ఏతావాతా జరిగిందేమంటే– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రజాస్వామ్య వ్యతిరేక పాశవిక చర్యలతో చంద్రబాబు నాయుడును కొన్నాళ్లు జైలు పాలుచేసినా అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు మైత్రి త్వరితపడునట్లు చేశారు. అంతేగాక, వెంటనే ఎన్నికలు జరుగనున్న తెలంగాణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం కలిగేలా చేశారు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-10-06T02:18:34+05:30 IST