భూతాపాన్ని పెంచుతున్న వ్యవసాయం

ABN , First Publish Date - 2023-09-15T00:51:34+05:30 IST

శిలాజ ఇంధనాలే కాదు, ఆహారోత్పత్తి పద్ధతులూ వాతావరణ మార్పును విషమింప చేస్తున్నాయి. వాతావరణంలో అత్యధికకాలం ఉండే కార్బన్ డై ఆక్సైడ్‌ను...

భూతాపాన్ని పెంచుతున్న వ్యవసాయం

శిలాజ ఇంధనాలే కాదు, ఆహారోత్పత్తి పద్ధతులూ వాతావరణ మార్పును విషమింప చేస్తున్నాయి. వాతావరణంలో అత్యధికకాలం ఉండే కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉద్గారిస్తున్న శిలాజ ఇంధనాల వినియోగం భూతాపాన్ని ఎలా పెంచుతున్నదో మనకు తెలుసు. అయితే శిలాజ ఇంధనాల వలే వాతావరణ వైపరీత్యాలకు కారణమవుతున్న మరొక అంశం గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. వ్యవసాయం, ఆహారం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. కొన్ని సమాజాలు మనుగడ కార్యకలాపాలలో భాగంగా కాలుష్య కారక వాయువులను ఉద్గారిస్తున్నాయి. మరికొన్ని సమాజాలు విలాస జీవనోత్సాహంలో భూతాపం పెచ్చరిల్లి పోవడానికి కారణమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని మరేరంగం కంటే వ్యవసాయమే సమాజాల మధ్య ఈ విభజనను సృష్టిస్తుందనడం స్పష్టం.

2018లో ప్రపంచవ్యాప్త హరిత గృహ వాయువుల ఉద్గారాలలో 11 శాతం ఆహారం నుంచి జరిగినవే కావడం గమనార్హం. వీటిలో 40 శాతం నెమరు వేసే పశువుల జీర్ణ వ్యవస్థల్లో కిణ్వ ప్రక్రియ నుంచి వెలువడినవి. ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులు శక్తిమంతమైన హరిత గృహ వాయువు మీథెన్‌ను ఉద్గారిస్తుంది. వ్యవసాయ సంబంధిత ఉద్గారాలలో మరో 26 శాతం నైట్రస్ ఆక్సైడ్‌వి. పంటల పోషణకు ఉపయోగించే కృత్రిమ ఎరువులు అంటే రసాయన ఎరువుల నుంచి మరో 13 శాతం మేరకు నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారమవుతుంది. వరి సాగు వల్ల సంభవిస్తున్న మీథెన్ ఉద్గారాలు మొత్తం వ్యవసాయ సంబంధిత ఉద్గారాలలో 10 శాతం మేరకు ఉంటాయి.

సమస్యేమిటంటే రెండు భిన్నమైన వ్యావసాయిక ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి పారిశ్రామిక వ్యవసాయం కాగా రెండోది జీవనాధార సేద్యం. పారిశ్రామిక వ్యవసాయ రంగంలో యంత్ర సహాయంతో పశువుల పెంపకం ద్వారా ఆహార ఉత్పత్తి జరుగుతుంది. మాంసాహారోత్పత్తికి ఉద్దేశించిన ఈ ఫ్యాక్టరీలలో చాలా పెద్ద సంఖ్యలో జంతువులను పెంచుతారు. ఉత్పాదితాలు భారీగా ఉండేందుకు ఉపయోగించే రసాయనాలు సైతం భారీ పరిమాణంలో ఉంటాయి. ఈ సాంద్ర ఆహార సాగు వ్యవస్థల యాజమాన్య పద్ధతులు జీవనాధార వ్యవసాయ ప్రపంచంలోని యాజమాన్య పద్ధతులకు భిన్నంగా ఉంటాయి. జీవనాధార వ్యవసాయ ప్రపంచంలో సన్నకారు, చిన్నకారు రైతులు తమ కమతాలలో కుటుంబ పోషణకు మాత్రమే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. వారు అదే లక్ష్యంతో తమ వ్యవసాయ క్షేత్రాలలో పశువులనూ పెంచడం జరుగుతోంది. ప్రపంచంలో పశు జనాభా అత్యధికంగా ఉన్న దేశాలలో భారత్ అగ్రగామిగా ఉన్నది. ఈ పశుగణాలలో అత్యధిక భాగం చిన్న రైతుల ఆధీంలోనే ఉన్నాయి. ఒక రైతు ఆదాయంలో 25 నుంచి 50 శాతం మేరకు అతడు పోషించే పశువుల నుంచే లభిస్తుంది.

రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడంలో ఆ ఆదాయం కీలక పాత్ర వహిస్తోంది. చాలా పెద్ద సంఖ్యలో ఉన్న పాడి పశువులు, ఇతర నెమరువేసే జంతువుల మొత్తం ఉద్గారాలు భూతాపాన్ని పెంచడంలో గణనీయమైన పాత్ర వహిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ వారి ‘2021 మూడో ద్వి వార్షిక నివేదిక’ ప్రకారం పశువుల జీర్ణ వ్యవస్థలలోని కిణ్వ ప్రక్రియ నుంచి ఉద్గారమవుతున్న మీథెన్ భారతదేశ మొత్తం హరిత గృహ వాయువుల ఉద్గారాలలో 8 శాతం మేరకు ఉంటోంది. మరి ఈ ఉద్గరాలను నియంత్రించడమెలా? వరిసాగు విషయంలో కూడా ఇదే పరిస్థితి. వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాలలో చిన్న రైతులు ఆ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అది అసంఖ్యాక కుటుంబాల జీవనాధార పంట. వరి సాగు చేసే ప్రాంతాలు పర్యావరణ పరంగా ఆరోగ్యకరంగా ఉన్నాయని నేను చెప్పబోవడం లేదు. అయితే పోషకాహారం, కోట్లాది ప్రజల జీవనో పాధిలో వరి నిర్వహిస్తున్న పాత్ర చాలా చాలా ముఖ్యమైనది, ఎంతమత్రం ఉపేక్షించలేనిది.


అవును, విస్మరించలేము. ఎందుకంటే రైతులు కూడా వాతావరణ మార్పు పర్యవసానాల ప్రప్రథమ బాధితులే. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రైతుల సంక్షేమానికి వాతావరణ మార్పు ప్రభావాల నుంచి అనేక విధాలుగా ముప్పు వాటిల్లుతోంది. తొలుత అవి పంట పెట్టుబడుల వ్యయం ఇతోధికంగా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు చాలా ప్రాంతాలలో నీటి పారుదల సదుపాయాలు సరిగా లేకపోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కొరవడడమూ కూడా రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. రెండోది ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులలో అత్యధికులకు ఆహారం అందుబాటులో లేకుండా పోతోంది. మూడోది వాతావరణ వైపరీత్యాల వల్ల రైతులు పదేపదే నష్టపోతున్నారు. వరదలు, కరువు కాటకాలు, తెగుళ్లు, రుతువులకు అనుగుణంగా లేని శీతోష్ణ పరిస్థితుల వల్ల రైతులకు వాటిల్లుతున్న నష్టం అంతా ఇంతా కాదు.

కనుక వ్యవసాయంపై వాతావరణ మార్పు ప్రభావాలను సమగ్రంగా చర్చించాల్సిన అవసరమున్నది. ఆహారోత్పత్తి పద్ధతుల వల్ల పెరుగుతోన్న భూతాపం విషయంపై యుఎన్ఎఫ్‌సిసిఇ ప్రస్తుతం గోడమీది పిల్లి లాగా వ్యవహరిస్తోంది. కేంద్రీకృత ఆహారోత్పత్తి వ్యవస్థల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని అరికట్టే విషయంలో గట్టిగా వ్యవహరించేందుకు అది తిరస్కరిస్తోంది. ఎందుకని? మాంసాహార వినియోగం అత్యధికంగా ఉన్న పారిశ్రామిక సమాజాలతో ఆ ఆహారోత్పత్తి వ్యవస్థలు అనుసంధానమై ఉండడంవల్లే కాదూ?

మరి మార్గాంతర కార్యాచరణ సైతం అంత సులభమేమీ కాదు. నెదర్లాండ్స్‌నే చూడండి. నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలని ఆ యూరోపియన్ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రైతులు తమ పశుసంపదను గణనీయంగా తగ్గించుకోవల్సి ఉంది. పాలకులు అయితే నిర్దేశించారు. రైతులు అంగీకరిస్తారా? అంగీకరించలేదు. నిరసనలు ప్రజ్వరిల్లాయి. అంతిమంగా ఆదేశించిన ప్రభుత్వమే కూలిపోయింది. న్యూజీలాండ్ విషయాన్ని కూడా చూద్దాం. ఆ దేశంలో ఆవుల ఉత్పాదక సామర్థ్యం చాలా హెచ్చు స్థాయిలో ఉంటుంది. న్యూజీలాండ్ హరిత గృహ వాయువుల ఉద్గారాలలో ఇంచుమించు సగభాగం ఆవుల వల్ల జరుగుతున్నవే కావడం గమనార్హం. దీనితో రైతులు తాము పోషిస్తున్న పశువుల సంఖ్య, వాటికి వినియోగిస్తున్న దాణా పరిమాణం ప్రాతిపదికగా పన్ను చెల్లించాలని న్యూజీలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా ప్రతిపాదిత పన్ను వసూలును ప్రభుత్వం వాయిదా వేసింది.

మాంసం ఉత్పత్తి విషయం కూడా చాలా వివాదాస్పదమైనది. మాంసాహార ఉత్పత్తిదారులు సాదాసీదా వ్యాపారస్తులు ఏమీ కాదు. అన్ని విధాల బలమైనవారు. శిలాజ ఇంధనాల పరిశ్రమల యాజమాన్యాలకు ఎంత పలుకుబడి ఉన్నదో వీరికీ అంతే పలుకుబడి ఉన్నదనడం నిజం చెప్పడమే. మాంసాహార ఉత్పత్తి పద్ధతులు భూతాపం పెచ్చరిల్లిపోవడానికి కారణమవుతున్నాయన్న వాస్తవాన్ని మనం కనీసం అంగీకరించి తీరాలి.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - 2023-09-15T00:51:34+05:30 IST