తెలుగు సాహిత్యానికి అమూల్యమైన చేర్పు

ABN , First Publish Date - 2023-09-23T00:30:03+05:30 IST

గతనాలుగు దశాబ్దాల విప్లవోద్యమంలో విప్లవకారులు చాలా సాహిత్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా కథలు అనేక దిన, పక్ష, మాస పత్రికల్లోనూ వెబ్ పోర్టళ్లలోనూ వచ్చాయి. నాలుగు దశాబ్దాల (1980–2023) విప్లవోద్యమంలోన...

తెలుగు సాహిత్యానికి అమూల్యమైన చేర్పు

గతనాలుగు దశాబ్దాల విప్లవోద్యమంలో విప్లవకారులు చాలా సాహిత్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా కథలు అనేక దిన, పక్ష, మాస పత్రికల్లోనూ వెబ్ పోర్టళ్లలోనూ వచ్చాయి. నాలుగు దశాబ్దాల (1980–2023) విప్లవోద్యమంలోని 52 మంది అజ్ఞాత మహిళలు రాసిన 282 కథలను సేకరించి వాటిని విషయవస్తువు ఆధారంగా విభజించి ఆరు సంకలనాలుగా ‘వియ్యుక్క– అజ్ఞాత రచయిత్రుల కథా సమయం’ పేరుతో విరసం ప్రచురిస్తోంది. గోండి భాషలో వియ్యుక్క అంటే వేగుచుక్క అని అర్థం. విప్లవోద్యమం విషయవస్తువుగా వచ్చినవి మొదటి మూడు సంకలనాల్లోనూ, ఈ రచయితలే ఇతర విషయాలపై రాసిన కథలు తక్కిన మూడు సంకలనాల్లోనూ ఉన్నాయి. ఇందులోని మొదటి మూడు సంకలనాలు ప్రచురణ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అజ్ఞాత రచయిత్రులు అంటే విప్లవోద్యమంలో నేరుగా పాల్గొని అమరులైనవాళ్ళూ, కొనసాగుతున్న వాళ్ళూ, అరెస్టయిన వాళ్ళూ కొంతకాలం పనిచేసి ఏ ఇతర కారణాల వల్లనైనా బయట ఉన్నవాళ్లూ రాసిన కథలు. ఇవన్నీ ఇప్పటికే వివిధ పత్రికల్లో అచ్చయిన కథలు.

ఈ కథలను విషయ వస్తువు ఆధారంగా విభజించి, చైతన్య క్రమం పెరుగుతున్న దిశలో వాటిని పేర్చి చదవడం వల్ల మొత్తంగా విప్లవోద్యమంలో ఏం జరుగుతుందో ఒక డాక్యుమెంటరీ లాగా మన కళ్ల ముందు కదలాడుతుంది. సమాజంలోని అన్ని రకాల మానవ సంబంధాలు పెను మార్పులకి గురవుతున్నపుడు జరిగే ఘర్షణ, ఆ ఘర్షణ మార్పుకి దారితీసినప్పటి ఫలాలు అద్భుతంగా చిత్రీకరించిన కథలివి. విప్లవోద్యమం నడుస్తుండగా నేరుగా అక్కడనుండి ఒక చేత్తో పెన్నూ, ఒక చేత్తో గన్నూ పట్టి సాహిత్యం సృష్టించడం అనేది అంత తేలికైన పని కాదు. కఠినతరమైన గెరిల్లా జీవితంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సృష్టించిన సాహిత్యం ఇది. ఎన్‌కౌంటర్లలో, రెయిడ్లలో, అరెస్టుల్లో ఎన్నో కథలు పోగొట్టుకున్నాక అనేక నిర్బంధాలను తట్టుకొని, వెలుగు చూసిన కథలివి.

మహిళలు రాసినవి కనుక సహజంగానే 90 శాతంకంటే ఎక్కువ కథలు మహిళల కోణం నుండి, మహిళల సమస్యలను, మహిళల భాగస్వామ్యాన్ని చిత్రించినవి. అన్ని రకాలుగానూ పీడితుల పక్షాన నిలబడి రాసిన కథలు. మార్పుని సృష్టిస్తున్న వారి అనుభవాల్లో నుండి నేరుగా వచ్చినవి. విప్లవోద్యమంలో నేరుగా పాల్గొన్నవారు తప్ప వేరొకరు రాయలేని కథలు అనేకం మనకు ఇందులో కనిపిస్తాయి. సామాన్య ప్రజలకు అర్థం కావడం ముఖ్యం అనే వర్గ స్పృహతో పల్లె ప్రజలు ముచ్చట్లు పెట్టినట్టుగా సాగిపోయే కథలు. ప్రతీ కథా రక్త మాంసాలున్న మనుషులకి సంబంధించిన కథ అనే స్పృహ కలిగి తీవ్ర భావోద్వేగాలని కలిగిస్తాయి. ఎంతోమంది పోరాట ప్రాంత ప్రజలు ఈ కథల్లోని పాత్రల్లో తమ వారిని వెతుక్కోకుండానే పోల్చుకోగలుగుతారు.

మొదటి మూడు సంకలనాల్లో మొత్తం 148 కథలున్నాయి. అన్నిటికీ విప్లవోద్యమమే కథా వస్తువు. ఆదివాసీ మహిళల సమస్యలు, దళజీవితం, చదువు, సైద్ధాంతిక అధ్యయనం ఎలా జరుగుతాయి, స్త్రీపురుషుల మధ్య సాహచర్యం, వైవాహిక సంబంధాలు, అమ్మతనం, సైనిక జీవితం, సామాన్యుల సాహసాలు, పిల్లల పాత్ర, దిద్దుబాటు, అరెస్టులు–జైళ్ళు, నిర్బంధం–ధిక్కారం, సల్వాజుడుం, అమరత్వం, బంధుమిత్రుల భావోద్వేగాలు ఇవన్నీ కథా వస్తువులుగా ఉన్న కథలు వివిధ విభాగాలుగా ఉన్నాయి.

వీటిని ఇలా వరుసగా చదువుకుంటూ పోతే నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రను విహంగ వీక్షణంలో దర్శించవచ్చు. ఈ కథలు విప్లవోద్యమాన్ని నిజాయితీగా, కల్లాకపటంలేని ఒక స్వచ్ఛతతో నిస్సంకోచంగా పారదర్శకంగా చదువరుల ముందుంచుతాయి.


ఇంతమంది మహిళా రచయితలను విప్లవోద్యమం తయారు చేసిందని అర్థంకాదు. కొందరు ఒక్క కథ మాత్రమే రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శిల్ప చాతుర్యాన్ని, తమదైన శైలినీ సంతరించుకుని చెయ్యి తిరిగిన రచయితలుగా పరిణతి పొందిన రచయిత్రులూ ఉన్నారు. సామాన్య ప్రజానీకానికి అర్థం కావడం ముఖ్యం అనే స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. పాత్రల సంభాషణల్లోనే కాకుండా రచయిత్రులు కూడా తమకు కలిగిన వర్గ చైతన్యం వల్లా, పీడిత ప్రజలతో మమేకం చెందడం వల్లా అదే భాషను ఉపయోగించి కథ చెప్పడం కూడా చూస్తాము. ఆ రకంగా ఇవి నేలమీద మొలకెత్తిన కథలు.

నక్సల్బరీ ప్రభావంతో డెబ్భైల నుండీ తొంభైల వరకూ రష్యా, చైనా సాహిత్యాలు ముఖ్యంగా, కథలూ నవలలూ యువతరాన్ని కుదిపి వదిలిపెట్టాయి. వ్యక్తిగతంగా తమ జీవితాలను తీర్చిదిద్దుకొనే విలువలను అందించాయి. సమాజ మార్పుకోసం జరిగే పోరాటంలో పాల్గొనేందుకు ప్రేరణనిచ్చాయి. మన దేశంలోని విప్లవోద్యమం గురించి ఇలాంటి కథలు ఎప్పుడు రాసుకుంటామో అని అనుకున్న అప్పటివాళ్లలో అనేకమంది ఇప్పుడు ఆ కలను సాకారం చేశారు. అసలు ఆ సాహిత్యమే పెద్దగా తెలియనివారు సైతం వారికి తోడయ్యి ఈ కథలను మనకి అందించారు.

సాధారణంగా తమ కథలను, ఇతర రచనలను పుస్తకాలుగా వెలువరించే అవకాశం రచయితలకు ఉంటుంది. విప్లవోద్యమంలో నిమగ్నులైన వారికి ఆ వెసులుబాటు తక్కువ. సమష్టి ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. నేటి సమాజానికి చాలా అవసరమైన ఈ కథలను ఒక దగ్గర చేర్చి అందించాల్సిన బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిందే. అటువంటి బాధ్యత నెరవేర్చిన ‘విరసాన్ని’ అభినందిద్దాం.

బి. అనూరాధ

(రేపు సాయంకాలం హైదరాబాదులో ‘వియ్యుక్క’

సంకలనాల ఆవిష్కరణ సభ)

Updated Date - 2023-09-23T00:30:03+05:30 IST