ఆత్మరక్షణలో ఆంధ్ర పాలకుడు

ABN , First Publish Date - 2023-10-03T03:03:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో 24 రోజుల క్రితం ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి రాజమండ్రి జైలులో నిర్బంధించారు. ఆ నాటి నుంచీ రాష్ట్రంలోని మీడియాలో ఆ అరెస్టుకు సంబంధించిన వార్తలు మినహా...

ఆత్మరక్షణలో ఆంధ్ర పాలకుడు

ఆంధ్రప్రదేశ్‌లో 24 రోజుల క్రితం ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి రాజమండ్రి జైలులో నిర్బంధించారు. ఆ నాటి నుంచీ రాష్ట్రంలోని మీడియాలో ఆ అరెస్టుకు సంబంధించిన వార్తలు మినహా మరేవీ కనపడడం లేదు. అరెస్టు ఘట్టాలు, సిబిసిఐడి పోలీసుల వీరంగం, పాలక ప్రతిపక్షాల పరస్పర దూషణలు, కోర్టు విచారణలు, నిరసన ప్రదర్శనలు... ఇవే మీడియాకు ప్రధాన వార్తలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ సమయంలో ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతున్నప్పటికీ తెలుగు మీడియాలో వాటికి అంతగా ప్రాధాన్యం లభించలేదు. నిరుద్యోగులు, రైతులు, పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా, అవినీతి తారస్థాయికి చేరుకున్నా, శాంతిభద్రతలు దిగజారినా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా ఎవరూ పట్టించుకోని పరిస్థితిని సృష్టించేందుకే జగన్ లండన్‌లోనే వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల వరకూ ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు జవాబు దారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు మీరు నేరస్థులంటే మీరు నేరస్థులని పరస్పరం దూషించుకుంటూ ఉంటుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఎలా లభిస్తుంది?

జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరస్థుడని, ఆయన 16 నెలలు జైలులో ఉన్నారని, బెయిల్ మీద ఉంటూ ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న ఏకైక నేత ఆయనేనని ప్రజలు ఇప్పటివరకూ అనుకుంటున్నారు. అయితే తన ప్రత్యర్థి అయిన మాజీ ముఖ్యమంత్రి కూడా నేరస్థుడేనని, ఒక వేళ బెయిల్ మీద విడుదలయితే. ఆయన కూడా తన లాగే బెయిల్ మీద బయటకు వచ్చిన నేరస్థుడని ప్రచారం చేపే అవకాశం వైసీపీకి లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. తండ్రి అధికారం మాటున అవినీతిపనులకు పాల్పడి జైలు పాలై ప్రస్తుతం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్ష నాయకుడిపై అవినీతి ఆరోపణలు చేయడం, అందుకు వందిమాగధులు వంత పాడడం హాస్యాస్పదంగా కనపడుతోంది.

మరో అయిదారు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఘట్టం ప్రారంభమవనున్నది. ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడంలో ఆయన నేరం కన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పన్నాగం, కక్ష సాధింపు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగున్నరేళ్లు కావస్తోంది. గత ముఖ్యమంత్రి పాలనలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అవకతవకలు, అక్రమాల గురించి తెలుసుకోవాలంటే అందుకు ఎక్కువ సమయం పట్టదు. అయితే జగన్ సర్కార్ ఈ నాలుగున్నరేళ్లూ వృధా చేసి ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో ఒక కుంభకోణం జరిగిందని చెబుతోంది. కుంభకోణం కంటే అందులో ప్రత్యర్థిపై అవినీతి ముద్ర వేయాలనే హడావిడే ఎక్కువగా ఉన్నదని సిబిసిఐడి హంగామా చూసినా, రిమాండ్ రిపోర్టు చదివినా అర్థమవుతోంది. వైసీపీలో ఉన్న మంత్రులు, చిన్నా, పెద్దా నాయకులు చాలరన్నట్లు ఆఖరుకు సిఐడి అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కూడా అమరావతిలో, ఢిల్లీలో విలేఖరుల సమావేశాలు నిర్వహించేలా చేసిన తీరు స్పష్టం చేస్తున్నదేమిటి? అవినీతిని బయటపెట్టడం కన్నా ఆ ఆరోపణల ఆధారంగా ప్రత్యర్థిపై పైచేయి సంపాదించడం జగన్ ఉద్దేశం అని ఎవరికైనా అర్థమవుతుంది.


భారతీయ జనతా పార్టీ అవినీతిని ఏమాత్రం సహించదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి ప్రమేయం ఎక్కడా లేదు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోలేదు. అయినప్పటికీ ఇదేదో కేంద్రంలో బిజెపి అండతో జరిగినట్లుగా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారంలో వైసీపీ నేతల ప్రచారమే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిపించి, ఆయన తప్పు చేశాడని ధ్రువీకరించుకున్న తర్వాతే న్యాయస్థానం అనుమతితో చర్యలు తీసుకుంటే ఎవరూ పెద్దగా తప్పు పట్టేవారుకాదు. కేంద్రంలో ఈడీ అనేక ఆర్థిక నేరాలకు సంబంధించి నిందితులను పలుసార్లు పిలిపించిన తర్వాతే తప్పనిసరి పరిస్థితులలో అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి దారితీసిన అక్రమ మద్య విధానాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా రూపొందించారని తెలిసినప్పటికీ ఈడీ అనేకసార్లు పిలిపించి ప్రశ్నించి ఆ తర్వాతే అరెస్టు చేసింది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి పిలిపించినట్లు ఆయన తండ్రిని కూడా పిలిపించి ప్రశ్నించి ఉంటే ఏమయిఉండేది? ఈ లోపు ఆయన పారిపోయిఉండేవారు కాదు కదా. కాని జగన్ ప్రభుత్వ ఉద్దేశం తన రాజకీయ ప్రత్యర్థిని అరెస్టు చేసి, జైలులో వేసి తద్వారా అధిక ప్రచారానికి ఆస్కారం ఇచ్చి ఆ ప్రచారం మధ్య తన అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే. విచిత్రమేమంటే ఈ కుంభకోణానికి కారకులైన అజయ్ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డి వంటి ప్రధాన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం!

గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. సాగునీరు, తాగు నీరు, ఉద్యోగాలు, విద్యుత్ రంగం, సంక్షేమపథకాల అమలు, పరిశ్రమలను ఏర్పాటు చేయడం విషయంలో జగన్ సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆఖరుకు కరువు ప్రాంతమైన రాయలసీమలో కూడా సాగునీటి ప్రాజెక్టుల అమలుకు జగన్ ప్రభుత్వం సరైన మొత్తంలో నిధులు కేటాయించలేకపోయింది. దాదాపు 40 సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోయాయి. సకాలంలో నిర్మించకపోవడం వల్ల ప్రారంభ అంచనాలకు మించి ఆ ప్రాజెక్టుల వ్యయం బాగా పెరిగిపోతోంది. జగన్ ప్రభుత్వ నిర్వాకాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని దుస్థితిలో పడింది. 69 నదులు ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్నప్పటికీ వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే వివేకం కూడా వైసీపీ సర్కార్‌కి లేకపోయింది. ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన రాయలసీమలో సమాంతర కాలువల పేరిట జగన్ సర్కార్ వేలకోట్ల అవినీతికి పాల్పడుతోంది. సీమ ప్రజలు ఈ వాస్తవాన్ని గమనిస్తున్నారు.

వైసీపీ ప్రభుతపాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసినందువల్లే జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో ఉన్నట్లు కనపడుతోంది. లేకపోతే తనకు, తన కుటుంబ సభ్యులకు, ఆఖరుకు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న కుమార్తెలకు కూడా ఎస్‌పిజి తరహాలో కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లును ఆయన ఎందుకు ప్రవేశపెడతారు? ఎవరి నుంచి తనకు ప్రమాదం ఉన్నదని జగన్ అనుకుంటున్నారు? నేర మనస్తత్వం ఉన్న ఆయనకే ఈ విషయమై బాగా తెలుసు అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనక్కు వెళుతుంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అవినీతి, జైళ్లు, బెయిళ్ల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరిగేలా జగన్ వ్యూహం పన్నడం దురదృష్టకరం. అయితే ప్రజలు ఆయన భావిస్తున్నట్లుగా అంత అమాయకులు కారు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-10-03T03:03:31+05:30 IST