ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-08-31T04:01:32+05:30 IST

ప్రయాణికులకు సేవలు అందిస్తున్న వారిలో ఆటో రిక్షా డ్రైవర్లది కీలక స్థానం. అయినా కూడా ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అనే చందంగా ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఉన్నాయి...

ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి

ప్రయాణికులకు సేవలు అందిస్తున్న వారిలో ఆటో రిక్షా డ్రైవర్లది కీలక స్థానం. అయినా కూడా ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అనే చందంగా ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఉన్నాయి. ఆటోలు కొనుగోలుకు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం అందించేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ రుణాలను పొందే అవకాశం లేకుండా చేసింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్ళించడంతో సబ్సిడీ ఋణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆటోడ్రైవర్లు ఫైనాన్స్‌ కంపెనీల వద్ద అప్పు చేస్తున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అనేక అవస్థలు పడుతున్నారు.

వీరికి ఈఎస్‌ఐ సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కాపాడుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితులలో ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తే వేలాది రూపాయలు అప్పులు చేయవలసి వస్తోంది. ఏటా పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌ చార్జీల భారంతో ఆటో డ్రైవర్లు మరింత కుంగిపోతున్నారు. కనీసం ఆటోలను నిలుపుకునేందుకు పార్కింగ్‌ స్థలాలను కేటాయించకపోవడంతో తమ రోజువారీ సంపాదనలో అధిక భాగం పోలీసులు విధించే చలానాలకు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రవాణా రంగ చట్ట సవరణ ఫలితంగా వాహనాలపై విధించే ఫైన్లు అనేక రెట్లు పెరిగిపోయాయి. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని భారాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అత్యంత వేగంగా అమలు చేస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతోంది.


ఆటో డ్రైవర్లు నిత్యం రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నారని, అటువంటి సమయంలో సరైన వైద్యం అందక, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు ఆర్థిక స్థోమత లేక పోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌ కుటుంబానికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదు. ప్రమాదాలలో అంగవైకల్యం సంభవించి ఉపాధి కోల్పోయిన వారికి పెన్షన్‌ అందించాలి. 46వ లేబర్‌ కాన్ఫరెన్స్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా రవాణా రంగంలో ఒక్కరు పనిచేసే చోట కూడా పిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తింపజేయాలి. రవాణా రంగ కార్మికులకు ఒక ప్రత్యేక సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో రిక్షా డ్రైవర్లకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఉద్యోగ కల్పన పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వేల ఎకరాలు కేటాయించే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు ఉండేందుకు గృహ వసతి కల్పించకపోవడం దారుణం. ఎటువంటి సామాజిక భద్రత లేని ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి.

జినగం గోపి

Updated Date - 2023-08-31T04:01:32+05:30 IST