గడ్డుకాలం!
ABN , First Publish Date - 2023-03-01T00:27:04+05:30 IST
మార్చినెల ప్రవేశానికి బాగా ముందుగానే భానుడి భగభగ మొదలైంది కనుక, రాబోయే మూడునెలలు ఎలా ఉండబోతాయన్న భయం మరింత ఎక్కువైంది...
మార్చినెల ప్రవేశానికి బాగా ముందుగానే భానుడి భగభగ మొదలైంది కనుక, రాబోయే మూడునెలలు ఎలా ఉండబోతాయన్న భయం మరింత ఎక్కువైంది. సహజంగా చల్లగా ఉండాల్సిన ఫిబ్రవరిలోనే చివరిపదిరోజుల్లో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపించింది. గడగడలాడించిన చలి ఇంకా నిష్క్రమించకముందే పగటి వేడిమి పెరిగిపోయింది. చాలా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలవరకూ తాకి, హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. భారత వాతావరణశాఖ మంగళవారం చేసిన ప్రకటనలో రాబోయే వేసవి అసాధారణంగా ఉండబోతున్నదని తేల్చేసింది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్నింటిని మినహాయిస్తే మిగతాదేశమంతా మార్చి–మే మధ్యకాలంలో తీవ్రమైన వడగాలులు ఎదుర్కోవలసి ఉంటుందట.
ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండబోతున్నందున, హెచ్చరికలు, జాగ్రత్తల విషయంలో రాష్ట్రాలు శ్రద్ధపెట్టాలనీ, అమిత వేడిమితో వచ్చిపడే అనారోగ్య పరిస్థితులపై వైద్యసిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించి, రాబోయే రోజులకు అవసరపడే సామగ్రిని యుద్ధప్రాతిపదికన సమకూర్చుకోవాలంటూ కేంద్రం ఇప్పటికే లేఖలు రాసింది. ఇంతవరకూ దేశాన్ని చల్లగా ఉంచిన లా నినా ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలో అంతరించిపోయి, ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడే అవకాశాలున్నందున రాబోయే మూడు నెలలు అసాధారణ ఎండలు చవిచూడాల్సి వస్తుందని అంచనా. గత మూడేళ్లుగా సాధారణం కంటే తక్కువగా ఎండలు ఉండటానికి పసిఫిక్ జలాలు చల్లబడితే ఏర్పడే లా నినా ప్రభావం కారణం. ఆ అదృష్టం తీరిపోయినట్టే. పసిఫిక్ జలాలు వేడెక్కినప్పుడు సంభవించే ఎల్ నినో ఈ ఏడాది వంతు. మూడేళ్ళకు లేదా ఐదేళ్ళకు పునరావృతమయ్యే ఈ చక్రాన్ని విధిగా ఎదుర్కోక తప్పదు. 2018లో దేశం చివరి ఎల్ నినో ప్రభావాన్ని చవిచూసింది. 2009, 2012, 2015సంవత్సరాల్లో కూడా ఎల్‌నినో ప్రభావంవల్ల అసాధారణమైన ఎండలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఇప్పుడు మార్చి ఆరంభం నుంచే భరించలేని వేడి, వెను వెంటనే వడగాడ్పులు మనను చుట్టేయబోతున్నాయని అంటున్నారు.
వరుసగా మూడేళ్లు లా నినా ప్రభావంతో దేశంలో చక్కని వర్షాలు కురిసాయి. వ్యవసాయం పచ్చగా ఉండి కరోనా కాలంలో కూడా దేశానికి అన్నంపెట్టింది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో తీవ్ర వర్షాభావం, అనావృష్టి సంభవిస్తాయి. దేశ జీడీపీలో ఐదోవంతు వ్యవసాయరంగం నుంచే కనుక, ఈ ఉపద్రవం వల్ల పంటదిగుబడులు తగ్గి ఆహారధరలు పెరిగే అవకాశాలున్నాయి. వ్యవసాయం సన్నగిల్లితే దేశంలో సగం శ్రామికశక్తి ఉపాధి దెబ్బతింటుంది. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో ఇప్పటికే ఆహారధాన్యాలు, ముఖ్యంగా నూనెల ధరలు హెచ్చిన పరిస్థితుల్లో ఎల్ నినోతో దిగుబడులు తగ్గితే అది మన ఆర్థిక వ్యవస్థమీద తీవ్రప్రభావం చూపుతుంది. ద్రవ్బోల్బణం, జీడీపీ విషయంలో అంచనాలన్నీ తారుమారవుతాయి. అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలనే కాక, అనేక ఇతర రంగాలను కూడా దెబ్బతీస్తాయి. ఉష్ణోగ్రతలు ఎంత పెరిగితే విద్యుత్ వినియోగం అంత హెచ్చుతుంది. ఆ మేరకు విద్యుదుత్పత్తి పెరగకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. తీవ్ర అనారోగ్యాలు, తాగునీటి సమస్యలు, పశువుల మేతకు కొరత, వడదెబ్బలు, వృద్ధుల మరణాల వంటివి చుట్టుముట్టే కాలం ఇది. సగటు వడగాడ్పుల రోజుల సంఖ్యలోనూ ఈ ఏడాది అనూహ్యమైన మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
పెరిగే ఉష్ణోగ్రతలు పాలకులకు పెద్దపరీక్ష. పార్టీల భవితవ్యాన్ని మార్చేసే శక్తి మండేకాలానికి ఉంది. ఈ సారి వస్తున్న వేసవి పాలకులకు కచ్చితంగా అగ్నిపరీక్షే. పంటలు, నిల్వలు, నిత్యావసరాలు, తాగునీరు, పశుగ్రాసం ఇత్యాది విషయాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, చికిత్సలకు కానీ, మందులకు కానీ కొరత లేకుండా చూసుకోవడం, విపత్తును గరిష్ఠస్థాయిలో ఎదుర్కోవడానికి వీలుగా సమస్త వ్యవస్థలను సంసిద్ధం చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఉపాధి హామీ కూలీలు, అభాగ్యులపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎన్నికలు ఎన్నివున్నా, ప్రజల సమస్యలన్నీ రాజకీయమే అయిపోతున్నా, మనిషి మనుగడతో ముడిపడిన ఈ గడ్డుకాలాన్ని పరిమిత నష్టంతో దాటడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సయోధ్యతో వ్యవహరించడం ఎంతో ముఖ్యం.