బండ ధర తగ్గింపులో బకరాలు జనమే!
ABN , First Publish Date - 2023-09-06T02:16:40+05:30 IST
ఈమధ్యనే వంటగ్యాస్ సిలిండర్ రేటును రూ.200 మేరకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. మనం సాధారణంగా అనుకునేది ఈ తగ్గింపు తాలూకు ‘భారాన్ని’ చమురు మార్కెటింగ్ కంపెనీలు...
ఈమధ్యనే వంటగ్యాస్ సిలిండర్ రేటును రూ.200 మేరకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. మనం సాధారణంగా అనుకునేది ఈ తగ్గింపు తాలూకు ‘భారాన్ని’ చమురు మార్కెటింగ్ కంపెనీలు భరిస్తాయనే. ఎందుచేతనంటే, ప్రస్తుతం ఈ కంపెనీలు వంటగ్యాస్ సిలిండర్లపై కూడా భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఆగస్టు 31న ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ‘వంటగ్యాస్ ధర తగ్గింపు భారాన్ని మోయగలిగేటందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలకు తగినంత అవకాశం ఉంది’ అంటూ ఒక కథనాన్ని అందుచేతనే ప్రచురించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగానే వంటగ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయి కనుక, ప్రభుత్వం ప్రకటించిన ఈ కోతను భరించగలిగిన శక్తి చమురు కంపెనీలకు ఉంది. అందుచేత, వంటగ్యాస్ సిలిండర్‌పై తాను ప్రకటించిన ఈ రూ.200 కోతకు సంబంధించి ప్రభుత్వం చమురు కంపెనీలకు ఎటువంటి సబ్సిడీని ఇవ్వకపోవచ్చునని ఆ పత్రిక రాసింది.
అయితే ఆ తరువాత, అనతికాలంలోనే, కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు ‘భారాన్ని’ ప్రభుత్వమే భరిస్తుందంటూ సెలవిచ్చారు. దీని సారాంశం, ఈ భారాన్ని ‘టాక్స్‌పేయర్ మనీ’ (పన్ను చెల్లింపుదారుల డబ్బు) అంటూ పదేపదే వాపోయే మన మధ్య తరగతి వర్గమే భరించబోతోందని అనుకోవాలి. నిజానికి, కేవలం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రమే దేశంలో టాక్స్‌పేయర్లు కాదనీ, పరోక్ష పన్నులైన జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్ సుంకం తదితరాలు చెల్లించే యావన్మంది ప్రజానీకం అంతా పన్ను చెల్లింపుదారులేనన్న విషయాన్ని కాసేపు పక్కనపెట్టినా ఇది నిజం!
అంటే, పదేపదే తాము చెల్లించిన పన్నుల ఆదాయం ఇతరులెవరికో ప్రయోజనం చేకూర్చేందుకో, పథకాలను అందించేందుకో వాడేస్తున్నారంటూ వాపోయే మధ్య తరగతికి ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మరో చిన్న షాక్. ఎందుచేతనంటే, అంతర్జాతీయంగా గణనీయంగా ఎల్‌పిజి ధరలు తగ్గినా (మన దేశం తన ఎల్‌పిజి అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది) ఇప్పటివరకు దేశీయంగా ధరలను తగ్గించకుండా భారీ స్థాయిలో లాభాలను గడించిన చమురు కంపెనీలు ఈ కోతల ‘భారాన్ని’ భరించాల్సి ఉండగా, తానే ఈ భారాన్ని మోస్తానంటోంది ప్రభుత్వం. చమురు కంపెనీలు కనుక ఈ కోత ‘భారాన్ని’ స్వీకరించి ఉంటే – అది వాటి లాభాలలో కొంత మొత్తాన్ని తగ్గిస్తుంది. కానీ, ప్రభుత్వం ఈ భారాన్ని మోయడం అంటే – ప్రజలు చెల్లించిన పన్ను డబ్బు, ఇప్పటికే బాగా లాభాలు గడించిన చమురు మార్కెటింగ్ కంపెనీలకు బదిలీ కావడమే. అదీ కథ! ఈ కథలో బకరాలు ‘పన్ను చెల్లింపుదారులే’!
స్థూలంగా, అత్త సొమ్ము అల్లుడు దానంలా, ప్రజల సొమ్మును ప్రభుత్వం ఈ సిలిండరు రేటు తగ్గింపు రూపంలో తిరిగి ప్రజలకే ఇస్తోంది. కాగా, ఈ కథలో ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు, తమ వాటాదారులకు మాత్రం భారీ డివిడెండ్లు ఇచ్చుకుంటాయి. ఆయా కంపెనీల వాటాల విలువలు షేర్ మార్కెట్‌లలో పైపైకి పెరుగుతుంటాయి. నిజానికి, ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరలలో రూ.200 కోతను ప్రకటించిన రోజున – షేర్ మార్కెట్‌లలో ఈ చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్ల విలువలు పడిపోయాయి. ఆ రోజున మార్కెట్ సమయం ముగిసేటప్పటికి, హెచ్‌పిసిఎల్ కంపెనీ షేర్ల విలువ 2.44 శాతం తగ్గింది, బిపిసిఎల్ షేర్ల విలువ 1.39 శాతం తగ్గింది, కాగా ఐఓసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) షేర్ల విలువ 1.18 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు భారాన్ని తామే మోస్తామంటూ చమురు, సహజ వనరుల శాఖ మంత్రి ప్రకటన వెలువడటాన్ని గమనించవచ్చు.
తమ ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలకు మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థే సమర్థవంతమైనదంటూ అందమైన ముసుగులను వేసే పాలకుల అసలు తీరు ఇది. నిజానికి వారి నిబద్ధత మార్కెట్ లేదా దాని తాలూకు డిమాండ్ – సరఫరాల పట్ల లేదు. మార్కెట్‌లో వివిధ సరుకుల ధరలను డిమాండ్ – సరఫరాలే నిర్ణయిస్తుందంటూ వీరు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, రష్యా నుంచి కారు చౌకగా ఆ క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోగలిగినా, ప్రస్తుత సందర్భంలోలాగా అంతర్జాతీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలు గణనీయంగా తగ్గినా– అంటే, మే 2022 నాటి మెట్రిక్ టన్నుకు 940 డాలర్ల నుంచి జూలై 2023 నాటికి 455 డాలర్లకు తగ్గినా– అటు పెట్రోల్, డీజిల్ ధరలు గానీ, ఇటు మన వంటగ్యాస్ ధర గానీ నేడు ఎన్నికల వాతావరణం ముంచుకొచ్చే వరకూ తగ్గనే లేదు. నేడు మార్కెట్ పేరిట నడుస్తోంది షేర్ మార్కెట్ల జూదం. వాటిని సంతృప్తిపరచడానికే ప్రభుత్వాలు పనిచేయవలసిన అగత్యం నడుస్తోంది. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల బలం అది. వాటిని కాదని ముందడుగు వేయడం సులువేం కాదు!
ఈ క్రమంలోనే, రేపొద్దున ఈ ఎన్నికల నేపథ్యంలోనే – పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా, దాని ‘భారాన్ని’ కూడా భారీ లాభాలను గడించి ఉన్న చమురు మార్కెటింగ్ కంపెనీలు కాక ప్రభుత్వమే భరించినా ఆశ్చర్యం లేదు. అంటే, అంతిమంగా ఈ భారమంతా తిరిగి ప్రజలపైనే పడుతోంది. వారు చెల్లించిన పన్ను డబ్బే తిరిగి వారికి ఈ రాయితీల రూపంలో వస్తోంది. అంటే, దీనిలో ప్రజలకు నెట్ గెయిన్ – జీరో.
డి. పాపారావు