బర్లు, గొర్లు కాదు; బీసీలకు సీట్లు కావాలి!
ABN , First Publish Date - 2023-10-13T01:22:44+05:30 IST
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లుతో పాటు, బీసీలకు కూడ 33శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ లేఖ రాశారు. అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా...
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లుతో పాటు, బీసీలకు కూడ 33శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ లేఖ రాశారు. అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇవన్నీ వింటుంటే, వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని పుణ్యక్షేత్రాల దర్శనానికి బయల్దేరిందన్న సామెత గుర్తుకు వస్తుంది. తమ పార్టీ రాజ్యాంగంలోనే బీసీలకు 50శాతం పదవులు ఇవ్వాలని రాసుకున్నామని, తమిళనాడు రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ హామీల మీద హామీలు గుప్పిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది బీసీల కోసమేనని నమ్మబలికారు. కాని పదేళ్ళ టీఆర్‌ఎస్ పరిపాలనలో, మూడు అసెంబ్లీ ఎన్నికలలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, బీసీలకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలు పరిశీలిస్తే, తెలంగాణ కంటే ఆంధ్రపాలనలోని బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం బాగుండేదనిపిస్తుంది.
మొన్న 2023 ఎన్నికలకు గాను బీఆర్‌ఎస్ పార్టీ తరపున 115 మంది శాసనసభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తే, ఐదుశాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 40సీట్లు, అరశాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి 12 సీట్లు, ఇతర అగ్ర కులాలకు మొత్తంగా అరవై సీట్లు కేటాయించారు. ఇక బీసీల విషయానికి వస్తే అరవై శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు కేటాయించారు. మొత్తం 10శాతం ఉన్న అగ్రకులాలకు యాభైరెండు శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే, అరవై శాతం జనాభా, 136 కులాలు కలిగిన బీసీలకు మాత్రం ఇరవై శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలలో కూడా మొత్తం 136 కులాల్లో, కేవలం ఆరు కులాలకే అరకొర శాతం టికెట్లు కేటాయించారు. అంటే రేపటి అసెంబ్లీలో 130 బీసీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యమే ఉండదు. ఇందులో ప్రధానంగా 35 లక్షల మందికి పైగా ఉన్న ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, కుర్మ, చాకలి, మంగలి, వడ్డెర, సగర, ఉప్పర, మేదరి, పెరిక, ఆరెకటిక, భట్రాజులు, యంబీసీలు, సంచార జాతుల వారికి ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ఇక బీసీ జనాభాలో సగభాగం ఉన్న కోటిమంది బీసీ మహిళలకు ఒక్క టికెట్ ఇవ్వలేదు. రేపటి తెలంగాణ అసెంబ్లీలో బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యమే ఉండదు. అదే విధంగా గతంలో ఉన్న బీసీ సిట్టింగ్ సీట్లకు కేసీఆర్ ఎసరు పెట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 28 టికెట్లు ఇచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ, 2018వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 26 టికెట్లు బీసీలకు ఇచ్చింది. గతం కంటే పెంచాల్సింది పోయి తగ్గించింది. ఇక ఇప్పుడూ బీసీలకు తీవ్ర భంగపాటు తప్పలేదు. గతంలో జరిగిన 2014, 2018 ఎన్నికలలో కంటే మూడు సిట్టింగ్ సీట్లను తగ్గించి 26 నుండి 23 సీట్లుకు తగ్గించారు.
తగ్గించిన వాటిలో హుజూరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి సీట్లను కూడా అగ్రకులాల వారికే కేటాయించారు. ముదిరాజులకు దక్కాల్సిన హుజూరాబాద్ సీటును రెడ్డిలకు, విశ్వబ్రాహ్మణులకు దక్కాల్సిన భూపాలపల్లి సీటును రెడ్డిలకు, పెరికలకు దక్కాల్సిన కామారెడ్డి సీటును వెలమలకు కేటాయించారు. ఇదే సమయంలో అదే రెడ్డిలకు, వెలమలకు సీట్లు ఇవ్వకుండా నిరాకరించిన సీట్లను, బీసీలకు ఏమైన ఇచ్చిండ అంటే అదీ లేదు. ఒకవేళ రెడ్డి, వెలమల సిట్టింగ్ సీట్లను మార్చాల్సి వస్తే, అదే కులానికో లేదా అదే కుటుంబానికో కేటాయించారు. ఉదాహరణకు ఉప్పల్ నియోజక వర్గానికి ఉన్న సుభాష్ రెడ్డిని మార్చి లక్ష్మారెడ్డికి, జనగాంలో ముత్తిరెడ్డిని మార్చి పల్లా రాజేశ్వర్ రెడ్డికి, వేములవాడలో రమేష్ రావును మార్చి లక్ష్మి నర్సింహ్మ రావుకు, కోరుట్లలో తండ్రి విద్యాసాగర్‌రావును మార్చి కొడుకు సంజయ్‌రావుకు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్ పార్టీ అంటే భారత రెడ్ల, రావుల సమితిగ మారిపోయిందనడానికి ఈ లెక్కలే సాక్ష్యం.
సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. తనకు సామంతులుగ ఉన్న ఎంఎల్‌ఏ, ఎంపి కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి, వారికే రాజకీయంగా ప్రాధాన్యమిస్తారన్నది నగ్న సత్యం. కేసీఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు భయపడి ఎంఎల్‌ఏ టికెట్లే కాదు, ఎంఎల్‌సిలు, పార్లమెంటు సభ్యులు, మంత్రి పదవులు అత్యధికంగా వారికే కట్టబెడుతున్నారు. గెలిచిన బీసీ ఎంఎల్‌ఏలకు మంత్రి పదవులు ఇవ్వకుండా నిరాకరించి, ఓడిపోయిన రెడ్లకు మాత్రం మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో సీఎంతో కలుపుకుని మొత్తం 18 మంది మంత్రులు ఉంటే, వారిలో ఆరుగురు రెడ్లు, నలుగురు వెలమలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నరు. ఇవేగాక శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌లు చూస్తే, ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇది చాలదన్నట్లు తాండూరు నుండి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి ఎంఎల్‌సి పదవి ఇచ్చి, మంత్రి పదవి కట్టబెట్టారు. మొత్తంగా చూస్తే ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం వారికి తొమ్మిది క్యాబినెట్ పదవులు కట్టబెట్టారు. బీసీ, ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మరో ముదిరాజ్‌కో, లేదు అమరుడు శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు ఇవ్వాల్సింది పోయి, తెలంగాణ ఉద్యమకారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన మహేందర్ రెడ్డికి ఓడిపోయిన కూడా మంత్రి పదవి కట్టబెట్టారు. అంటే తెలంగాణలో రెడ్లకు, వెలమలకు తప్ప ఏ వర్గానికి రాజకీయ అధికారం దక్కడం లేదు.
ఐదు శాతం ఉన్న రెడ్లు మంత్రులుగా 9 మంది, ఎమ్మెల్యేలుగా 39 మంది, ఎంఎల్‌సీలుగా 21 మంది, జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా 12 మంది ఉన్నరు. ఇక ప్రభుత్వ సలహాదారులుగా, రాష్ట్ర క్యాబినెట్ ఛైర్మన్‌లుగా ఇక లెక్కేలేదు. అదే విధంగా అర శాతం ఉన్న వెలమలు ఎంఎల్‌ఏలుగా 11 మంది, ఎంఎల్‌సీలుగా 6, పార్లమెంటు సభ్యులుగా నలుగురు, మంత్రులుగా (సీఎం సీటుతో కలిపి) నలుగురు, జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా నలుగురు, ప్రభుత్వ సలహాదారులు, కార్పోరేషన్ చైర్మన్‌లు, నామినేటెడ్ పోస్టులకు రెడ్డి సామాజిక వర్గం వారిగ వీరికి కూడ లెక్కేలేదు.
బీసీలకు రాజకీయంగా ఇంత అన్యాయం చేస్తున్న కేసీఆర్ బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కావాలని కేంద్రానికి ఈ రోజు లేఖలు రాస్తున్నడు. ఒక్క బీసీ మహిళలకు కూడా టికెట్ ఇప్పించని కవిత బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అంటున్నది. బీసీలకు రాజకీయంగా అన్యాయం చేస్తున్న విధానంపై బీసీలు తీవ్రంగా రగిలిపోతున్నారు. వారిలో రోజు రోజుకు పెరుగుతున్న రాజకీయ చైతన్యం, బీఆర్‌ఎస్‌పై వస్తున్న వ్యతిరేకతను చూసి ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో, బీసీ బిల్లులు అంటు కొత్త రాగం ఎత్తుకున్నరు. బీసీలంటే, వాళ్ల దృష్టిలో గొర్రె పిల్లలు, చేపపిల్లలు, ఇస్తే సంతోషపడి ఓటేస్తరు అనుకుంటున్నరు. కాని బీసీలు నేడు ‘‘పథకాలు మాకు... పదవులు మీకా!’’ అంటూ నిలదీస్తున్నరు. రాయితీలే కాదు మాకూ రాజ్యాధికారం కావాలే అని తిరగబడుతున్నరు. ‘‘మా ఓట్లు కావాలి కాని మాకు సీట్లు ఇవ్వని బీఆర్‌ఎస్‌కు మేమెందుకు ఓట్లు వేయాలి’’ అని ప్రశ్నిస్తున్నరు.
బీసీల నినాదం, విధానం ఒక్కటే. మాకు ఇప్పుడు కావాల్సింది బర్లు, గొర్లు కాదు. అసెంబ్లీ సీట్లు కావాలి, ముఖ్యమంత్రి పీఠం కావాలని పల్లె, పట్నం తేడా లేకుండా గొంతెత్తి నినదిస్తున్నరు. కాదు కూడదు అంటే బీసీ వ్యతిరేక పార్టీలను రాజకీయంగా బొంద పెట్టడానికి సన్నద్ధులవుతున్నరు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలను యావజ్జీవ పాలకులుగా మారుస్తూ, గంపెడు శాతం ఉన్న బడుగులను యావజ్జీవ పాలితులుగా మార్చాలనే కేసీఆర్ కుట్రను బీసీలు అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మార్చకపోతే, కేసీఆర్ జాతకం మార్చడానికి రాష్ట్రంలోని రెండున్నర కోట్లమంది బీసీలు సిద్ధమవుతున్నరు.
జాజుల శ్రీనివాస్ గౌడ్
జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం