బోయల రాజకీయ సింహగర్జన!
ABN , First Publish Date - 2023-09-08T00:50:23+05:30 IST
బోయల చరిత్ర అంతా రాజుల రాణుల పల్లకీ మోతలోను, నేటి ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల రథచక్రాల కిందనూ నలిగిపోయింది...
బోయల చరిత్ర అంతా రాజుల రాణుల పల్లకీ మోతలోను, నేటి ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల రథచక్రాల కిందనూ నలిగిపోయింది. నేటి బోయలు ఎస్టీ రిజర్వేషన్ కోసం, రాజ్యాధికారం కోసం పోరాడలేకపోతున్నారు. గద్వాల నియోజకవర్గంలో 45శాతంగా జనాభా ఉన్న బోయలు కీలకమైన రాజకీయ పదవులను అందుకోలేకపోతున్నారు. కానీ ఎమ్మెల్యే అధికారం మాత్రం అగ్రకులాల వారింట్లో ఉంటుంది. తరతరాలుగా ఒక సామాజిక వర్గానికి చెందినవారే గద్వాల నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు. గద్వాల నియోజకవర్గం బోయల కంచుకోటగా మారాలీ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక బోయవాడు కదిలి గడప గడపకు తిరిగి అగ్రకులాల గడిలో బందీ అయిన ‘బోయల గద్వాల’ను విముక్తి చేయాలి. బోయలకు అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇంకెక్కడిస్తారు? ఈ ఉద్దేశంతోనే సెప్టెంబరు 9వ తేదీన తోండుపల్లిలో (శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్) బోయల సమావేశం జరగనున్నది. బోయల రాజకీయ, ఆర్థిక, సామజిక కల్చర్ ప్రాధాన్యత, ఎస్టీ రిజర్వేషన్స్ ఈ సమావేశ ప్రధాన ఎజెండాగా ఉన్నది. బోయల విషయంలో వివిధ పార్టీల వైఖరులను వ్యతిరేకిస్తూ, బోయలకు ఒక సమగ్రమైన కార్యచరణ నిర్ణయించటంతో పాటు బోయల డిక్లరేషన్‌నూ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్నది. బోయ మేధావులు, పరిశోధక విద్యార్థులు, సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
మండ్ల రవి, ఉస్మానియా యూనివర్సిటీ