‘సనాతనధర్మం’ మీద బ్రిటిష్‌వాడి దాడి!
ABN , First Publish Date - 2023-10-08T00:59:39+05:30 IST
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని స్వాములు, సన్యాసులు, పీఠాధిపతులు, కొందరు ప్రజానాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అంతేకాని అసలు సనాతనధర్మం అంటే ఇదీ అని చెప్పరు...
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని స్వాములు, సన్యాసులు, పీఠాధిపతులు, కొందరు ప్రజానాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అంతేకాని అసలు సనాతనధర్మం అంటే ఇదీ అని చెప్పరు. మరి సామాన్యులకు సనాతనధర్మం అంటే ఏమిటో ఏం తెలుస్తుంది? వేల సంవత్సరాల నుంచి మన మహారాజులు, చప్పనారు దేశాలను భరత ఖండంలో పరిపాలిస్తూ, సనాతనధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తర్వాత కాలంలో ముస్లిం సుల్తానులు రాజ్యాలను చేజిక్కించుకున్నా, వారికి సామంతులుగా మన మహారాజులు, తమ ఏలుబడిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ, నాలుగు పాదాల మీద నడిపించారు. ముస్లిం సుల్తానులు మన సనాతన ధర్మంలో జోక్యం చేసుకోలేదు. కాని వారి తర్వాత వచ్చిన బ్రిటిష్ దుర్మార్గులతోనే చిక్కొచ్చింది. మన సనాతన ధర్మంపై దాడి ప్రారంభించారు.
మహారాజులు సనాతన ధర్మం ప్రకారం పరిపాలిస్తున్న కాలంలో శూద్రులకు ఆస్తి హక్కు లేదు. భూమి అంతా రాజుదే. పృధ్వీపతి. వారి అభిమానం పొందిన బ్రాహ్మణులకు అగ్రహారం పేరుతో దానం చేసి హక్కు కల్పించేవారు. దేవాలయం నిర్వహణకు భూమిని రాసిచ్చేవారు. శూద్రులైన రైతులు కౌలుదారులు మాత్రమే. వారికి భూమిపై హక్కు లేదు. పండించిన పంటలో నాలుగోవంతు నుంచి సగం వరకూ కౌలు వసూలు చేసేవారు. కానీ, 1795లో బ్రిటిష్ ప్రభుత్వం శూద్రులకు ఆస్తిహక్కు కల్పిస్తూ చట్టం చేసింది. ‘దున్నేవాడిదే భూమి’ అని కమ్యూనిస్టులు ఇప్పుడు అంటున్నారు కాని, ఆ పని బ్రిటిష్‌వారు అప్పుడే చేశారనేది చారిత్రక సత్యం. ఎంత అన్యాయమో కదా!
పరమపవ్రితమైన మన సనాతన ధర్మంలో ఆడశిశువు పుట్టగానే తీసుకెళ్లి గంగలో పడేసే ఆచారం ఉండేది. గంగ అంటే నది, చెరువు, సముద్రం ఏదైనా కావచ్చు. ఎందుకు? సనాతన ధర్మపరిరక్షణకే. ఆడపిల్లకు ఎనిమిదేళ్లు రాగానే పెళ్లి చేసేయ్యాలి–అష్టవర్షాద్భవేత్కన్యా. రజస్వలానంతర వివాహం మహాపాపం. అలా చేస్తే రౌరవాది నరకాలకు పోతారు. అప్పటికే ఒకరో, ఇద్దరో ఆడపిల్లలున్న గృహస్థు ఏం చేస్తాడూ? మళ్లీ ఆడపిల్ల పుడితే, ఎనిమిదేళ్లు రాగానే పెళ్లి చేయలేనేమో అనే భయంతో ఆ శిశువును సనాతనధర్మం ప్రకారం గంగార్పణం చేసి పుణ్యం దక్కించుకునేవాడు. సనాతన ధర్మ పరిరక్షకులైన గృహస్థులు ఇలా పుణ్యం దక్కించుకోకుండా కుట్ర చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1904లో ఆడ శిశువులను గంగార్పణం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. మన సనాతన ధర్మంలో వేలు పెట్టిన బ్రిటిష్‌వాడు నాశనమైపోవాలి.
మన సనాతన ధర్మంలో శూద్రులు విద్య నేర్వకూడదు. వారికి విద్యాహక్కు లేదు. గురుకులాలలో మహారాజుల పిల్లలకు, అగ్రకుల బాలురకు మాత్రమే ప్రవేశం. గొడ్లు కాచుకొనే శూద్రుల పిల్లలు పొరపాటున గురుకులం వైపు వెళ్లినప్పుడు, గురుదేవులు చెప్పే పాఠం విన్నాడని అనుమానం వస్తే, తీవ్రమైన శిక్షలు ఉండేవి. శూద్రులు బ్రహ్మదేవుడి కాళ్లనుంచి పుట్టినవారు కనుక, అగ్రకులాల వారి కాళ్లకు మొక్కుతూ, బానిసలుగా పడివుండాలి. కాని బ్రిటిష్ వారికి ఈ ధర్మసూక్ష్మం తెలిసి చస్తే గదా? తెలివి తక్కువ దద్దమ్మలు. 1813లో శూద్రులు కూడా చదువుకోవచ్చు అని చట్టం చేశారు. ఇంకేం ఉందీ క్రైస్తవ మిషనరీ వాళ్లొచ్చి ఇక్కడ స్కూళ్లుపెట్టి ఇంగ్లీషు చదువులు మొదలుపెట్టారు. మన సనాతన ధర్మం ప్రకారం మహారాజులు శూద్రులకు ఎందుకు విద్య నేర్పలేదో బ్రిటిష్ పాలకులకు ఆ తర్వాత కానీ అర్థంకాలేదు. చదువు నేర్చిన జనం వారికి ఎదురుతిరిగి తన్ని తగలేశారు–గట్టిగా రెండొందల ఏళ్లు పరిపాలించలేకపోయారు. అదే మన మహారాజులు శూద్రులను చదువుకోనివ్వకుండా చేసి వేల సంవత్సరాలు చప్పన్నారు దేశాలను చక్కగా పరిపాలించారు. శూద్రులు, స్త్రీలు చదువులు నేర్వబట్టేగదా, పాలనలో తమ వాటా అడుగుతున్నారు!
సనాతన ధర్మం ప్రకారం నేరస్థులకు కులాలవారీగా శిక్షలు విధించే చట్టం ఉండేది. మహారాజులు ఒకే నేరానికి అగ్రకులాల వారికి ఒక రకం శిక్ష, శూద్రులకు వేరే కఠిన శిక్షలు విధించేవారు. ఒకే నేరం చేసిన వారికి కులం ప్రకారం ఇలా శిక్షలు విధించడం ఏమిటి ‘నాన్సెన్స్’ అని నేరస్థులకు శిక్షలు విధించేటప్పుడు వివక్ష చూపరాదంటూ 1817లో చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బ్రిటిష్‌వారు చేసిన కుట్ర అని వేరే చెప్పనవసరం లేదు.
సనాతన ధర్మం ప్రకారం, భార్య చనిపోతే భర్త ఏడాది తిరిగేలోగా మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కాని భర్త చనిపోయిన స్త్రీ మాత్రం మరొక పురుషుడిని వివాహం చేసుకోకూడదు. పైగా, ఈ వితంతువు వయసుతో కలిగిన కోరికలకు తట్టుకోలేక పర పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది. ఇది ఘోరమైన పాపం. స్త్రీలను ఇటువంటి పాపకూపంలో పడకుండా రక్షించడానికి ధర్మపరిరక్షకులు సతీసహగమనం అనే పవిత్రకార్యం కనిపెట్టారు. బతికున్న మనిషిని మంటల్లో పడవేసి హత్య చెయ్యడం ఏమిటి? అని బ్రిటిష్ ప్రభుత్వం 1829లో సతీసహగమన నిషేధ చట్టం చేసింది. అసలు మా సనాతన ధర్మంలో వేలు పెట్టడానికి మీకేమి హక్కు ఉందండీ? అంటూ ఆనాటి ధర్మదీక్షాపరులైన కొందరు లండన్ కోర్టుకు వెళ్లి, ఈ క్రూరమైన చట్టం రద్దు చేయమని వ్యాజ్యం వేశారు. కాని అక్కడి జడ్జీలకు మన సనాతన ధర్మంలోని విశిష్టత, గొప్పదనం వగైరాలు తెలిసి ఏడిస్తేగా? సతీసహగమనం శిక్షార్హమైన నేరం అని తీర్పు ఇచ్చారు.
ఆనాటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగించే ఉద్యోగులకు కులం ఆధారంగా దూరదూరంగా సీట్లు కేటాయించేవారేమో? మనకైతే స్కూళ్లల్లో దళితుల పిల్లలను వేరుగా కూర్చోబెట్టడం తెలుసు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుల మత వివక్ష ఉండరాదని 1831లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. వాళ్లు నియంతలు కాబట్టి కుల మత వివక్ష కూడదంటూ పరిపాలన సాగించారు. కాని ఇప్పుడు డెమోక్రసీలో ఓటర్లను కుల, మత ప్రాతిపదికన విడదీయకుండా ఎలా కుదురుతుంది? కులాలను, మతాలను కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వానికి ఉంటుంది కదా, అందుకేగా కులాలవారీ కార్పొరేషన్లు, కులాలకు బిల్డింగులు కట్టించి ఇస్తున్నది ప్రభుత్వం. సనాతన ధర్మం పునాదులు ఉన్నది కులాలలోనే కదా? కులాలు మాయమైపోతే సనాతన ధర్మ సౌధం కూలిపోదా?
మన సనాతన ధర్మంలో మహారాజులు, చక్రవర్తుల సుపరిపాలన కాలంలో శూద్రులు ఆసనాలపై కూర్చోరాదు. ఎక్కడైనా సరే నేలమీద కూర్చోవాల్సిందే. అగ్రకులాల వారికే ఆసనాలు. కానీ, శూద్రులు కూడా కుర్చీలలో కూర్చోవచ్చు అంటూ, 1835లో వారికి ఆ హక్కు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది.
సనాతన ధర్మంలో ముఖ్యమైనది ఆడపిల్లకు ఎనిమిదో ఏట పెళ్లి చెయ్యడం. ఆడపిల్లల పాలిట పీడగా తయారయిన ఈ సనాతన ధర్మం అన్యాయమని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం 1929లో బాల్యవివాహ నిషేధ చట్టం తెచ్చింది. దీని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా? ఆడపిల్లలు ముందు చదువు, తర్వాత ఉద్యోగం, కెరీర్ ఆ తర్వాతే పెళ్లి అంటూ పాతికేళ్ళు వచ్చినా పెళ్ళిళ్లు చేసుకోకుండా ధర్మహననానికి పాల్పడుతున్నారు. ఆకాశంలో సగం అంటున్నారు. అన్ని రకాల ఉద్యోగాలు చేస్తామంటూ, చట్టసభల్లో సగంసీట్లు ఇస్తారా, చస్తారా? అంటూ బరితెగిస్తున్నారు. ఇదంతా దేనివల్ల? బ్రిటిష్ దుర్మార్గులు మన సనాతన ధర్మం నాశనం చేయడానికి చట్టాలు చేయడం వల్లనే. ఇప్పుడు ఏలినవారి తక్షణకర్తవ్యం ఏమంటే, గతంలో బ్రిటీష్‌వారు తెచ్చిన చట్టాలన్నీ రద్దుచేసి, ధర్మవ్యతిరేకులమీద రాజద్రోహం కేసులు పెట్టి, సనాతనధర్మపరిరక్షకుల కోరికను నెరవేర్చడం.
సి.ఎస్.ఆర్ ప్రసాద్