జనగణనపై కుల కౌటిల్యాలు
ABN , First Publish Date - 2023-10-10T01:26:44+05:30 IST
సార్వత్రక ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన జరిపి మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...
సార్వత్రక ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన జరిపి మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల జనగణన కూడా జరపాలంటూ కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. అసలు సార్వత్రక ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటో తెలియకుండానే ప్రతిపక్షాలు ఆ తర్వాత జరిగే జనగణన గురించి కుల రాజకీయాలు ప్రారంభించాయి!
1990వ దశకంలో అప్పటి ఉప ప్రధాని దేవీలాల్‌పై రాజకీయ ఆధిపత్యం కోసం ప్రధానమంత్రి విపి సింగ్ దేశంలో కులాల మధ్య చిచ్చును రేకెత్తించారు. 1990 ఆగస్టు 1న కేంద్రమంత్రివర్గం నుంచి దేవీలాల్‌ను తొలగించిన వారం రోజుల్లోనే విపి సింగ్ ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్‌ను విస్తరిస్తూ మండల్ కమిషన్ సిఫార్సులను ఆమోదించారు. నిజానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయాన్నీ నేషనల్ ఫ్రంట్ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాలన్న ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని విపి సింగ్ విస్మరించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీతో ఏ మాత్రం చర్చించలేదు. బీజేపీ నిజానికి రిజర్వేషన్లకు ఏనాడూ వ్యతిరేకం కాదు. 1990 అక్టోబర్ 1న న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించేందుకు పార్టీ సానుకూలత వ్యక్తం చేసింది. అయితే మద్దతునిచ్చిన పార్టీలతో చర్చించకుండా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే ఒక నిర్ణయం తీసుకుంటే జరిగే ప్రమాదాల గురించి నాడు బీజేపీ నేతలు వాజపేయి, ఆడ్వాణీ హెచ్చరించారు. వారు హెచ్చరించినట్లే దేశంలో శాంతియుత పరిస్థితులు భగ్నంకావడమే కాకుండా అనేకమంది ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇవాళ దేశవ్యాప్తంగా కులజనగణన జరగాలని ‘ఇండియా’ కూటమి నేతలతో పాటు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన బామ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిన విషయం తెలియకపోవచ్చు. 1979 డిసెంబర్‌లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ మాజీ ఎంపి, బిహార్‌కు చెందిన సోషలిస్టు నేత బిందేశ్వరీ ప్రసాద్ మండల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1980 డిసెంబర్‌లో మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. అన్ని ప్రభుత్వోద్యోగాల్లోనూ, ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లలోనూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ నివేదికలో సూచించారు. ఇందిరాగాంధీ కానీ, ఆమె తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ కానీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి చొరవా చూపలేదు. పదేళ్లకు పైగా అవి ఫైళ్లలోనే ఉండిపోయాయి. 1990 సెప్టెంబర్ 6న రాజీవ్ గాంధీ లోక్‌సభలో మండల్ కమిషన్ సిఫారుసులపై చర్చిస్తూ విపి సింగ్‌ను తీవ్రంగా విమర్శించారు. దేశ సమగ్రత, సమైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారని నిందించారు. విపి సింగ్ దేశమంతటా కులఘర్షణలను పురికొల్పారని ఆరోపించారు. ‘15సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా ఉన్న వెనుకబడిన వర్గాల వ్యక్తి విద్యాధికుడు ఒకరు తర్వాత రాజకీయాల్లో చేరి మంత్రి అయ్యారు. ఆయనకు, ఆయన పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలా? రిజర్వేషన్ల ప్రయోజనాలు మంత్రులు, వారి కుమారులు, వారి కుటుంబాలు మాత్రమే దక్కించుకోవాలా?’ అని రాజీవ్ ప్రశ్నించారు. మండల్ కమిషష్‌ను వ్యతిరేకించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఆ పార్టీ ఏనాడూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ పూర్తిగా కల్పించలేదు.
భారతీయ జనతా పార్టీ అప్పుడూ ఇప్పుడూ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న విషయంలో ఒకే వైఖరి అవలంబిస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా సామాజిక సంక్షేమ పథకాలు సమాజంలో నిరుపేదలకు చేరాలన్నదే మోదీ ధ్యేయం. కేవలం సామాజిక న్యాయమే కాదు, సామాజిక సమగ్ర న్యాయం కల్పించడమే బీజేపీ సిద్ధాంతం. ఈ దేశంలో మతపరంగా రిజర్వేషన్ లేదు. అయినప్పటికీ ముస్లింలలో అత్యంత వెనుకబడిన, నిరుపేదలైన పస్మందా వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేందుకు బీజేపీ అనేక చర్యల్ని చేపట్టింది. ఓబీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం ఓబీసీల వర్గీకరణపై రోహిణీ కమిషన్‌ను నియమించింది. కేవలం 12 ఆధిపత్య ఓబీసీ కులాలు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు చేజిక్కించుకుంటున్నాయని తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం ఈ వివక్షను అంతం చేసేందుకు నడుం కట్టింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విశ్వకర్మ పథకం ఓబీసీ వర్గాలకు చెందిన కంసాలి, వడ్రంగి తదితర 18 రకాల చేతి వృత్తులకు చెందిన వారికి ఇతోధిక లబ్ధి నివ్వనున్నదని గుర్తుంచుకోవాలి. వీరికి శిక్షణ నందించడమే కాక, రుణాలు, మార్కెట్ మద్దతును అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. దాదాపు 50 శాతం మంది ఓబీసీలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతోంది.
కాంగ్రెస్, ఇతర పార్టీల హయాంలో మండల్ కమిషన్ సిఫారసుల అమలు విఫలమైనందువల్లే సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో అసంతృప్తి పెరిగి బీజేపీ వైపు మొగ్గు చూపాయి. కులజనగణనకు బీజేపీ వ్యతిరేకంకాదు. కాని ఆ అంశాన్ని రాజకీయం చేసి కులాల మధ్య చిచ్చును రేకెత్తించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బిహార్ శాసనసభలో కులజనగణనపై రెండుసార్లు తీర్మానం ఆమోదించినప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు నిచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భారతీయ జనతా పార్టీ తనకు సామాజిక న్యాయం అందిస్తోందని విశ్వసించినందువల్లే ఆదివాసీలు, దళితులతో పాటు పెద్ద ఎత్తున ఓబీసీలు బీజేపీకి ఓటు వేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 37.6 ఓటు శాతం రావడానికి ఓబీసీలే కారణం. ఇవాళ 303 బీజేపీ లోక్‌సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. అంటే లోక్‌సభలో ఓబీసీలకు బీజేపీ 29 శాతం ప్రాతినిధ్యం కల్పించిందని అర్థమవుతోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా బీజేపీకి 1358 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 27 శాతం బీసీలే. బీజేపీ శాసనమండలి సభ్యుల్లో కూడా 40 శాతం ఓబీసీలే. మోదీ ప్రభుత్వ హయాంలోనే ఓబీసీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా కల్పించింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు తమ ఓబీసీ జాబితా తామే రూపొందించుకునేందుకు వీలు కల్పించింది. అన్ని స్థాయిల్లో ఓబీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన నేత అయినప్పుడు వివిధ వర్గాల్లో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్షాలు చేసే కుల రాజకీయాలను ప్రజలు తిరస్కరించక తప్పదు.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)