వంట–మంట
ABN , First Publish Date - 2023-03-02T01:01:52+05:30 IST
ఎన్నికలకు ముందు వరాలు కురిపించే పాలకులు, అవి ముగియగానే నిజస్వరూపాన్ని బయటపెడతారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు...
ఎన్నికలకు ముందు వరాలు కురిపించే పాలకులు, అవి ముగియగానే నిజస్వరూపాన్ని బయటపెడతారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పటివరకూ ఉగ్గబట్టుకొని ఉన్న కేంద్రప్రభుత్వం అవి పూర్తికాగానే ప్రజలనెత్తిన బండ పడేసింది. బుధవారం నాడు గ్యాస్ సిలిండర్ ధర యాభైరూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా మూడువందల యాభైరూపాయలు పెరిగింది. హవాయి చెప్పులేసుకొనే సామాన్యుడు కూడా హవాయీ అడ్డాల్లోకి అడుగుపెట్టి, గగనవిహారాలు చేయాలన్న లక్ష్యసాధనకోసం కాబోలు, ఏవియేషన్ చమురు మాత్రం ఏకంగా నాలుగుశాతం ధర తగ్గింది.
మూడువందల రూపాయలున్న సిలిండర్ ధరను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినప్పుడు ఇప్పటి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన ట్వీట్లు, విలేకరుల సమావేశంలో ఆమె చేసిన విమర్శలు, రోడ్డనపడి చేసిన ధర్నాల చిత్రాలు ఇప్పుడు తిరిగి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేముందు బీజేపీ పెద్దలంతా రాజకీయాలను గ్యాసు, చమురు చుట్టూ తిప్పి అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టినవారే. అప్పట్లో వారన్నమాటలు గుర్తుచేసి సామాన్యుడు ఇప్పుడు తన అక్కసుతీర్చుకుంటున్నాడు. కాంగ్రెస్ ఇకపై ఈ బండ బాదుడును కూడా మోదీపై యుద్ధంలో ఒక అస్త్రంగా వాడుకోదల్చుకున్నట్టుంది. తనకు ఓటువేసి అధికారంలోకి తీసుకువస్తే సిలిండరు ధర ఐదువందల రూపాయలలోపే ఉంచుతానని హామీ ఇస్తోంది. అన్ని నిత్యావసరాల ధరలూ పెరిగి సామాన్యుడు సతమతవుతున్న స్థితిలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన ‘హోలీ’ బహుమతి ఇది అని ఎద్దేవా చేస్తూ, రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం సిలిండరును ఐదువందలకే అందిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తోంది. గత ఎనిమిదినెలలుగా వంటగ్యాస్ ధర పెరగలేదన్న మాట నిజమే కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకూ సిలిండరు రేటు రమారమి మూడురెట్లు హెచ్చింది. కమర్షియల్ సిలిండరు ధర మొన్న జనవరిలో పాతికరూపాయలు మాత్రమే పెంచినందుకు కాబోలు, ఇప్పుడు వడ్డన భారీగానే జరిగింది. దాని ధర ఇప్పుడు రమారమి రెండున్నరవేల రూపాయలకు చేరుబోతున్నందున చదువుకున్న నిరుద్యోగయువకులు ఇకపై పకోడాలు అమ్ముకోవడం కూడా కష్టమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడాలు అమ్ముకోవడం ఉత్తమమనీ, అది కూడా ఉపాధేనంటూ 2018లో అమిత్ షా పార్లమెంటులో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద మహిళలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఈ పథకం కిందకు రానివారు సిలిండరు మొత్తం భారాన్ని ఎలాగూ మోయక తప్పదు. గతంలో సబ్సిడీ సిలిండర్లే నేరుగా వినియోగదారుడికి చేరితే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సబ్సిడీ విడిగా బ్యాంకు ఖాతాల్లో వేయడం ఆరంభమైంది. ఆదిలో వందల్లో ఉన్న ఆ మొత్తం క్రమంగా కృశించి మాయమైపోవడం మాట అటుంచితే, మరోపక్క స్వచ్ఛంద సబ్సిడీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టి, సినీనటులతో ప్రకటనలు గుప్పించి లక్షలాదిమంది దేశభక్తులు తమకు తాముగా దానిని వదులుకొనేట్టు చేసింది. తాము కాదనుకున్న మొత్తం నిరుపేదలకు ఉపకరిస్తుందన్న సంతోషం వారిది. ఉజ్వల్ యోజన కింద తొమ్మిదన్నరకోట్లమంది పేదలకు ప్రభుత్వం రెండువందల రూపాయల సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఇప్పుడు వారు బండ మీద 900 రూపాయలు ఖర్చుచేయాల్సిందే. పేరుకు ఈ కనెక్షన్ల సంఖ్య కోట్లలో ఉన్నా, సిలిండరు ధర వరుసగా హెచ్చుతున్న నేపథ్యంలో, ఇప్పటికే లక్షలాదిమంది ఉజ్వల్ పేదలు వాటిని వదిలేసి మళ్ళీ పొగచూరిపోతున్నారని ప్రభుత్వేతర సంస్థలు వాపోతున్నాయి.
పెట్రోల్, డీజిల్ మాదిరిగానే వంటగ్యాస్‌ను కూడా మార్కెట్ ధరతో ముడిపెట్టాలన్న లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం ఇప్పటికే చేరుకుంది. మార్కెట్ ధరతో ముడివున్నప్పుడు చమురు కంపెనీలు తమ పద్దుని బట్టి రేట్లను ఎప్పటికప్పుడు సవరించాలి. కానీ, విచిత్రంగా ఎన్నికలకాలం సమీపిస్తున్నప్పుడు మారని చమురు, గ్యాస్ ధరలు అవి ముగియగానే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఎన్నికల కాలచక్రానికి అనుగుణంగా కంపెనీలు కూడా నడుస్తుండటాన్ని బట్టి ఈ నియంత్రణ అసలు స్వరూపం అర్థమవుతోంది. చమురు, గ్యాస్ ధరల విషయంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న దాపరికం సరైనది కాదు.