విచక్షణ లేని విమర్శ!
ABN , First Publish Date - 2023-02-24T02:13:09+05:30 IST
‘తొమ్మిదేళ్లయినా... తల్లడిల్లుతున్న తెలంగాణ’ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాసిన వ్యాసంలో (తేదీ: 18.02.2023) ఆయన తన పొట్టలో పేరుకుపోయిన విషాన్నంతా కక్కేశారు...
‘తొమ్మిదేళ్లయినా... తల్లడిల్లుతున్న తెలంగాణ’ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాసిన వ్యాసంలో (తేదీ: 18.02.2023) ఆయన తన పొట్టలో పేరుకుపోయిన విషాన్నంతా కక్కేశారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను విమర్శించటానికి చాలా ప్రయాస పడ్డారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించటానికి రాజకీయంగా ఆయనకు అన్ని హక్కులూ ఉండొచ్చు. కానీ కళ్ల ముందు కనిపిస్తున్న విషయాలను కూడా చూడకుండా విమర్శలకు దిగటం సబబు కాదు.
రాష్ట్ర అతవరణ తర్వాత.. గత ఎనిమిదిన్నర ఏండ్లలో తెలంగాణ ఏం సాధించిందో అంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాలలోనే ఉన్నది. అవన్నీ మీడియాలో, పత్రికల్లో అచ్చయి కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వాటన్నింటినీ ఇక్కడ ఎత్తి చూపే అవసరం లేదు. ఉదాహరణకు వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించి దేశానికే ధాన్యాగారంగా మారిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. గత ఏడాది అయితే వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేని స్థితి ఏర్పడిన విషయం జగద్వితమే. గతంలో కన్నా పదింతల ఉత్పత్తి ఎలా సాధ్యమైంది? సాగు విస్తీర్ణంలో ఎంతో పెరుగుదల ఉంటేనే కదా ఇది సాధ్యం? ఇలా స్థూలంగా కంటికి కనిపించే విషయాలనే చూస్తే కూడా తెలంగాణ ఏం సాధించిందో తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటి రంగంలో ఏ మార్పూ లేదని రేవంత్‌రెడ్డి చెప్పదల్చుకున్నారా? అయితే.. గ్రామాల్లోని చేదబావుల్లో పాతాళంలో ఉండే భూగర్భ జలమట్టం ఇవ్వాళ చేతికి అందేటట్లు ఎలా పెరిగిందో కనిపించటం లేదా? శతాబ్దాలుగా కరువుతో అల్లాడి వలసలకు మారుపేరుగా నిలిచిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవ్వాళ లక్షల ఎకరాల భూమి పైరు పచ్చలతో అలరారుతున్న తీరు దేనికి సంకేతం? సాగు నీటి రంగంలో విప్లవాత్మక మార్పుకు మూలబిందువైన కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెరువులు ఇవ్వాళ ఎండాకాలంలోనూ జలకళతో అలరారుతున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగా గొలుసుకట్టు చెరువులన్నీ అలుగులు దుంకుతున్నాయి. వీటి మూలంగా కదా... తెలంగాణలో భూగర్భజలాలు పుష్కలంగా పెరిగినయ్. వీటన్నింటి కారణంగానే కదా... ఊర్లన్నీ ధాన్య సిరులతో మురిసిపోతున్నయ్.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో 2014కు, 2023కు మధ్య ఏ మార్పూ లేదని కాస్తంత విచక్షణ ఉన్న ఎవ్వరూ అనలేరు. కొన్ని ఉదాహరణలతోనైనా చెప్పుకోవాలంటే– వరంగల్ రైల్వే గేట్ నిర్మాణం కాకముందు వరంగల్ జనజీవితం ఎన్ని ఇబ్బందులు పడిందీ, ఇప్పుడు అక్కడ బ్రిడ్జి నిర్మాణంతో ఎన్ని సమస్యలు తీరిందీ వరంగల్ ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుసు. అలాగే, హైదరాబాద్‌లోని ఎల్.బీ నగర్ జంక్షన్, మోజంజాహీ మార్కెట్, కేపీహెచ్‌బీ హైటెక్ సిటీ రూట్, దుర్గం చెరువు, ఖమ్మం బస్‌స్టాండ్, సిద్దిపేట రైతు బజార్, జెడ్‌పీహెచ్ఎస్ సిరిసిల్లా, మిడ్ మానేరు, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు, యాదాద్రి టెంపుల్, రంగనాయక సాగర్... ఇలా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి చిహ్నాలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ తెలంగాణ రాకముందు ఉండెనా? ఇవన్నీ అబద్ధాలని అంటే... వారిది దృష్టిలోపం అయి ఉండాలి.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ విపక్ష నేతగా అధికారపార్టీ విధాన లోపాలను ఎత్తి చూపాలి. మరింతగా ప్రజానుకూల పాలన అందేందుకు తన విమర్శల ద్వారా తోడ్పడాలి. అప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలంతా అభినందిస్తారు. అంతేకానీ రాజకీయ లబ్ధికోసం కువిమర్శలకు దిగితే ప్రజలు హర్షించరు, ఆమోదించరు.
గోసుల శ్రీనివాస్ యాదవ్