ప్రమాద హెచ్చరిక
ABN , First Publish Date - 2023-01-06T00:29:50+05:30 IST
ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో నాలుగురోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి...
ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో నాలుగురోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జమ్ములో సనాతన ధర్మసభ సహా వివిధ హిందూ సంస్థలు సంకల్పించిన బంద్‌కు ముస్లిం సంస్థలు మద్దతు ప్రకటించాయి. మసీదుల్లో మైకులద్వారా బంద్‌కు సహకరించవలసిందిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుజిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది.
కొత్త సంవత్సరం నాడు రజౌరీ సమీప గ్రామం ధాంగ్రీలో రాత్రివేళ పోలీసు దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు మూడు ఇళ్లలోకి చొరబడి విచ్చలవిడి కాల్పులతో నలుగురిని బలితీసుకున్న ఘటన అత్యంత అమానుషమైనది. హిందూ కుటుంబాలు లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మరికొందరు గాయపడటంతో పాటు, వారు సమీపంలో అమర్చివెళ్ళిన బాంబులు మర్నాడు ఉదయం పేలి ఇద్దరు చిన్నారులు మరణించారు. హిందువులు లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఈ ఘాతుకం, జమ్మూలో సాగిన గతకాలపు సామూహిక మారణకాండలను జ్ఞప్తికి తెస్తున్నది. ప్రధానంగా, 1993లో తుపాకులు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు ఒక బస్సును హైజాక్ చేసి, ప్రయాణికులను మతాలవారిగా విడదీసి, పద్నాలుగుమంది హిందువులను కాల్చిచంపిన ఘటన చాలామందికి గుర్తుకువస్తున్నది. అనంతరకాలంలో, మరీముఖ్యంగా 1998తరువాత శుభకార్యాలను సైతం వదలకుండా జరిగిన అదే తరహా ఉగ్రదాడుల్లో అనేకమంది మరణించారు. ఈ ఘాతుకాల కారణంగా, సరిహద్దుజిల్లాల్లోని మారుమూల ప్రాం తాలనుంచి జనం పెద్ద ఎత్తున తరలిపోయిన విషయం తెలిసిందే.
జమ్మూలో తిరిగి అటువంటి వాతావరణం సృష్టించే ప్రయత్నం ఆరంభమైందన్న వాదనలను అటుంచితే, పాలకులు చెప్పే మాటలకూ క్షేత్రస్థాయి వాస్తవాలకు హస్తిమశకాంతరం ఉందని ఈ ఘటన తెలియచెబుతోంది. కశ్మీర్‌లోనే కాదు, జమ్మూలో కూడా హిందువులకు ఇకపై భద్రత ఉండబోదని అర్థం. కశ్మీర్‌లో పండిట్లు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగి వారు నిరసనలు చేపట్టినప్పుడు, తమను జమ్ములో ఉద్యోగాలు చేసుకోనివ్వాలని డిమాండ్ చేసినప్పుడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంత కఠినంగా వ్యవహరించారో తెలిసిందే. పండిట్ల చుట్టూ రాజకీయాన్నీ, సినిమాలనూ నడిపినవారు క్రమంగా వాతావరణం మారిపోతూండటంతో గత ఏడాది ఉగ్రదాడుల్లో పండిట్ల కంటే ముస్లింలే ఎక్కువమంది మరణించారని ఇప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. 370 అధికరణ రద్దు తరువాత జమ్మూకశ్మీర్ లో టెర్రరిజం తగ్గి టూరిజం పెరిగిందన్న వాదన అసత్యం కాకపోవచ్చు కానీ, అర్థసత్యం మాత్రమే. ఏడాదిపాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేసి, స్థానిక నాయకత్వాన్ని గృహనిర్బంధంలో ఉంచినా కూడా కేంద్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నది. తమకు అనుకూలంగా నియోజకవర్గాల రూపురేఖలను మార్చి, కొత్త అసెంబ్లీ స్థానాలను సృష్టించుకున్నప్పటికీ ఎంతోకాలంగా ఎన్నికలు లేనందున పాలకులకు, ప్రజలకూ మధ్య అగాధం పెరుగుతున్నది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తప్ప, సమస్యలు కష్టాలు చెప్పుకోవడానికి ప్రజలకు తమ అంటూ చెప్పుకొనే నాయకుడెవరూ మిగల్లేదు.
ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారని వాదనలో అసత్యమేమీ లేదు. దశాబ్దాలుగా పాకిస్థాన్ కోరుకుంటున్నదేమిటో, దానికి ఎఫ్16 వంటి యుద్ధవిమానాలను ఇస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే ఈ సాయం అని అమెరికా చెబుతున్న విషయమూ తెలిసిందే. ఆ రెండు దేశాల వైఖరులను, వాటిని మనం ఎప్పటికప్పుడు నిలదీస్తున్న విషయాన్నీ అటుంచితే, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో అద్భుతాలు చోటుచేసుకుంటాయన్న భ్రమలు మాత్రం క్రమంగా వీడిపోతున్నాయి. కశ్మీర్‌లోనే కాదు, ఇప్పుడు జమ్మూలో కూడా గతంతో పోల్చితే కేంద్రమీద విశ్వాసం సడలిపోతున్న మాట వాస్తవం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే జమ్మూకశ్మీర్ రూపురేఖలు మార్చేశామని అన్నవారు ఉగ్రవాదాన్ని అరికట్టలేకపోతున్నారు, ఎన్నికలూ జరపలేకపోతున్నారు. నాలుగేళ్ళుగా బకాయి పడ్డ ఎన్నికల విషయంలో వరుస హామీలు ఎలాగూ నీరుగారిపోయాయి. సార్వత్రక ఎన్నికల ముందు జమ్మూకశ్మీర్‌లో ఎదురుదెబ్బ తింటే పరువుపోతుందన్న భయంతో ఈ ఏడాది కూడా వాటిని వాయిదావేస్తే పరిస్థితులు మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా చురుకుగా కదిలి, జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ ఏడాది తొలిభాగంలోనే వాటిని నిర్వహించగలిగితే పరిస్థితిలో ఎంతోకొంత మార్పురావచ్చు.