ప్రజాస్వామ్యం మరో మెట్టు దిగజారింది!
ABN , First Publish Date - 2023-09-13T03:40:51+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రిని...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడంలో పద్ధతులను ఏ మాత్రం పాటించకపోవడానికి కారణం ఇది రాజకీయ కోణంలో జరిగిన అరెస్ట్ కావటమేనని చాలామంది అభిప్రాయం. ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం, ఎఫ్ఐఆర్‍లో ఆయన పేరు లేకపోవడం వంటి అంశాలను గమనిస్తే ఇది అర్థమవుతున్నది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు దేశంలో కొత్తేమీ కాదు. తమిళనాడు రాష్ట్రంలో 2001 సంవత్సరంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పటికే 78 ఏళ్ళ వయోభారంతో బాధపడుతున్న ఎం. కరుణానిధిని అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అత్యంత దారుణమైన పద్ధతుల్లో, ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిధంగా అరెస్టు చేశారు. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో కరుణానిధి నివాసంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిశంసించారు. ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టుల తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. ఇది నూటికి నూరుపాళ్ళు రాజకీయ కక్ష సాధింపు చర్యగా తేలిపోవడంతో, ఆ రాష్ట్ర ప్రజలు కరుణానిధికి బాసటగా నిలిచాలు. తదనంతరం 2006లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరుణానిధిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా సరిగ్గా ఇదే తరహాలో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని సరైన అభియోగాలేమీ లేకుండానే అరెస్టు చేయటం కక్ష సాధింపుగా కనిపిస్తున్నది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తొలినాళ్ళల్లో రాజకీయాలు ఎంతో హుందాతనంగా ఉండేవి. ప్రతిపక్షాలను గౌరవించే అధికార పక్షం, ప్రజల తరఫున అధికార పక్షానికి సూచనలు ఇచ్చే ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచాయి. కానీ రాజకీయ పరిస్థితులు రాను రాను దిగజారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షాల మనుగడను సహించలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. అణచివేత, కేసులు, ఎదురుదాడులు వంటి దుశ్చర్యలను ఆలంబనగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలనేది అనుచిత పరిణామం. చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఒక సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ అరెస్టును అక్రమ అరెస్టుగా పేర్కొంటూ, దానికి న్యాయపరమైన అంశాలను వివరించిన ఆయన, అవినీతి నిరోధక చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణల నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి గాని, కోర్టుల అనుమతి గాని తప్పనిసరి అని, ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో విధంగా అరెస్ట్ చేయాలన్న ప్రభుత్వ అత్యుత్సాహమే కనపడుతున్నది తప్ప ఆయనపై చేసిన ఆరోపణలలో నిజాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపులు దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు.
నేలపూడి స్టాలిన్ బాబు,
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ మాజీ సభ్యులు