మురికి చొక్కాల్ని మార్చి మార్చి వేసుకుంటే ఏం లాభం?
ABN , First Publish Date - 2023-09-06T02:18:52+05:30 IST
‘మళ్లీమళ్లీ వాళ్లేనా? మార్చిచూద్దాం!!’ అంటూ కె. శ్రీనివాస్ రాసిన ఆగస్టు 31 నాటి ‘సందర్భం’ చదివాక కొన్ని సందేహాలు కలిగాయి. ఎన్నికలకి సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి...
‘మళ్లీమళ్లీ వాళ్లేనా? మార్చిచూద్దాం!!’ అంటూ కె. శ్రీనివాస్ రాసిన ఆగస్టు 31 నాటి ‘సందర్భం’ చదివాక కొన్ని సందేహాలు కలిగాయి. ఎన్నికలకి సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి, చాలా విషయాలు విమర్శనాత్మకంగా, చక్కగా వివరించారు శ్రీనివాస్. కానీ, ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడూ ఒకరికే ఓటు వెయ్యవద్దనీ, వంతుల వారీగా పార్టీలకు అవకాశం ఇవ్వాలనీ, అలా చేస్తే ప్రజలకు మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, అది జరిగే పని కాదని గత 70 ఏళ్ళ ఎన్నికల చరిత్ర చెపుతుంది. 1952 నుంచి ఇప్పటి వరకూ ఎన్నో పార్టీలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నికల్లో పాల్గొన్నాయి. పార్టీలు విడిగానూ, కూటములు గానూ, కొన్ని విడతలుగా గానీ, చాలా కాలంగానీ అధికారంలో వుండినాయి. కాంగ్రెసు, సోషలిస్టు, జనసంఘ్, జనతాదళ్, లోక్‌దళ్, బీజేపీ, కమ్యూనిస్టు, బీయస్పీ, ఎస్పీ – ఇలా పేర్లు తేడాయే గానీ, వీటి పాలనలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా సక్రమంగా సాగలేదు. అందరూ రచయితే చెప్పినట్టు ‘నల్ల చట్టాలను, ఉక్కుపాదాలను ప్రయోగించారు.’
శ్రీనివాస్ సూచించినట్టు ప్రజాస్వామ్యం ‘సకల రంగాల నిర్వహణ’ లోనూ వుండాలి. అది ఎన్నడూ ఏ రంగంలోనూ లేదు. ఆఖరికి, ఎన్నికల్లో కూడా లేదు. అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు వుంది గానీ, ధనబలం, కుల బలం, మత మద్దతు వంటివి లేకుండా ఎవరైనా పోటీ చెయ్యగలిగే పరిస్థితి ఆనాడూ లేదు ఈనాడూ లేదు. ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు ఇచ్చే వివరాలను చూస్తే అంతా అర్థం అయిపోతుంది. రచయితే చెప్పినట్టు ‘ఓటు వేయడం ద్వారా తామేమి చేస్తున్నారో, ఏమి పొందుతున్నారో, ఏమి కోల్పోతున్నారో... తెలియకుండానే అత్యధికులు ఓటు వేస్తున్నారు’. అలాగే, ఆయనే గుర్తించినట్టు, ‘భావోద్వేగాలు’, ‘నిర్లిప్తత’, ‘అజ్ఞానం’, ‘డబ్బు’, ‘కులమత కుటుంబపెత్తనాలు’... అనేవే ఎంపికకు కారణాలుగా వున్నాయి. ‘ప్రతీ పాలకుడూ, పాలకురాలూ జనం మీద సవారీ చేశారు’ అని కూడా ఆయనే అన్నారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో, ‘మళ్ళీ మళ్ళీ ఒకే పార్టీనే గెలిపించకుండా, మార్చి చూద్దాం’ అనే మార్గం ప్రజలకి మంచి ఎలా చేస్తుంది? ఉన్న పార్టీలు, తరతమ భేదాలతో అన్నీ కూడా మురికి చొక్కాల్లాంటివే! ఉన్న రెండో మూడో మురికి చొక్కాల్ని మార్చి మార్చి వేసుకోవటం వల్ల, ఓటర్లకి కూడా మురికి అంటుతుందే గానీ, పరిశుభ్రమైన ప్రజాస్వామ్యం రాదు.
రాజకీయ చైతన్యం పెరగాల్సిన ఆవశ్యకత గురించి శ్రీనివాస్ చేసింది మంచి సూచన. కానీ, ఆ రాజకీయ చైతన్యం ‘సకల రంగాల నిర్వహణలోనూ’ తమ భాగస్వామ్యం వుండేలా ప్రజలు డిమాండు చేసేదిగా వుండాలి. ఓటు హక్కు రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యానికి గుర్తు. అదే సరిపోదు. అందుకే సరైన రాజకీయ చైతన్యం అవసరం. ఆ చైతన్యం, ప్రకృతి వనరులైన భూమి, గనులు, పరిశ్రమలు, ఇంకా అనేక ఆర్థిక వనరులపై పౌరులందరికీ ఉమ్మడి హక్కు వుండాలనే స్పృహని కలిగించేదిగా వుండాలి. వేరే మాటల్లో చెప్పాలంటే, ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం కావాలి. అలాగే, సంఘ జీవితంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి. అంటే, సంఘంలో కుటుంబాలు కులాలుగా విడిపోయి వుండడం, స్త్రీ పురుషులు అసమానులుగా వుండడం అనే పరిస్థితి పోవాలి. ఈ లక్ష్యాల్ని సాధించడానికి ఇప్పుడున్న రాజ్యాంగం ఏ మాత్రం అనుకూలం కాదు. అది మాటల్లో మాత్రమే ప్రజాస్వామ్యానికి హామీ ఇస్తుంది. చేతల్లో అది ‘కొద్ది మందికే ప్రజాస్వామ్యం.’
ఉన్నదొక్కటే మార్గం. ఆ మార్గాన్ని యాబై ఏళ్ళనాడు కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రసంగంలో విపులంగా వుంది. మచ్చుకి కొన్ని మాటలు: ‘16 సంవత్సరాల కాలం పాటు నేను అసెంబ్లీలో కూర్చుని ప్రజలకు ఏమైనా ఉపశమనం కలగజేయగలిగానా? అది సాధ్యమవుతుందా? – అని ఆలోచించినప్పుడు, ఈ ప్రయత్నంలో నిరాశా నిస్పృహ తప్ప వేరే ప్రయోజనం కనపడలేదు. జనాన్ని కదిలిస్తే తప్ప, ప్రజలు తమంతట తాముగా ఈ దౌర్జన్యాలను వ్యతిరేకించి నిలబడడం నేర్చుకుంటేనే తప్ప విధి లేదు. అది తప్ప, మరొక మార్గం లేదనే అభిప్రాయానికి నేను వచ్చిన కారణంగా, బాగా ఆలోచించిన తర్వాతనే, ఈ అసెంబ్ల్లీ నుండి బైటకి పోవాలని నేను నిర్ణయించుకున్నాను... నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాఖానీ షాపు మాత్రమేననీ, ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఒక రకమైన పరిహాసమేననీ తేలినప్పుడు, జనాన్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలి వేసి, అసెంబ్లీ లోపల ఏమి జరుగుతుందో చూడడానికి వేచి వుండమని అడగగలమా? ఈ సభలో జరిగే చర్చల ద్వారా, ఆలోచనల ద్వారా, తీర్మానాల ద్వారా, ఈ దేశం పరిస్థితి బాగుపడుతుందని మీరు భావిస్తే, నాకు లాగే మీ భ్రమలూ తొలగుతాయి. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అప్పుడు మన కర్తవ్యం ఏమిటి? దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా విప్లవ కార్యాచరణకు ప్రజల్ని కదిలించడం మాత్రమే. ఆ పని చేయడానికే నేనీ సభను వీడిపోతున్నాను.’
అసెంబ్లీకి రాజీనామా చేసిన తర్వాత, ప్రజల్ని కదిలించే పని చేయడానికి నాగిరెడ్డి గారికి ఎక్కువ సమయం దొరకలేదు. ఆ తర్వాత ఐదేళ్ళకే ఆయన ఎమర్జెన్సీలో, అజ్ఞాతంలో, అనారోగ్యంతో మరణించారు. ఐతే, ప్రజల్ని కదిలించే పని అదే భావజాలం వున్న ఇతరుల ద్వారా ఎంత జరిగిందీ, ఎంత జరగలేదూ, ఎందుకు జరగలేదూ అనే విషయాల గురించిన చర్చ వేరే. పరిష్కారం మాత్రం అదే. మురికి చొక్కాల్ని మార్చి మార్చి తొడగడం కాదు. ప్రజల్ని నిరంతరం కదిలించే పనే జరగాలి.
యు.హెచ్. ప్రీతం