దుడ్డుకర్రస్వామ్యం జిందాబాద్‌!

ABN , First Publish Date - 2023-10-12T02:19:59+05:30 IST

‘స్వామీ...!’ ‘ఏమీ...?’ ‘భయమేస్తా ఉండాది స్వామీ’. ‘పూర్‌.. ఇన్నోసెంట్‌.. భక్తా.. నా సమక్షంలో నీకు యమేలనోయ్‌?’ ‘నా గురించి కాదు స్వామీ.. నీ గురించే భయం’....

దుడ్డుకర్రస్వామ్యం జిందాబాద్‌!

‘స్వామీ...!’

‘ఏమీ...?’

‘భయమేస్తా ఉండాది స్వామీ’.

‘పూర్‌.. ఇన్నోసెంట్‌.. భక్తా.. నా సమక్షంలో నీకు భయమేలనోయ్‌?’

‘నా గురించి కాదు స్వామీ.. నీ గురించే భయం’.

‘హ్హ..హ్హ..హ్హ.. నా గురించా.. ఎందుకు భక్తా?’

‘ఆ నడకదారుల వైపు ఒకసారి చూపు తిప్పు స్వామీ. తండోపతండాలుగా తోసుకోని వస్తావుండారు భక్తులు’.

‘భక్తి.. నాయనా.. వీకెండ్‌ రష్‌... మనకి కొత్తేం కాదు కదా’.

‘వాళ్లు పెడుతున్న గోవిందలు ఒకసారి ఆలకించు స్వామీ’.

‘కష్టం తెలీకుండా కొండ ఎక్కేందుకు అదో ఉపశమనం నాయనా’.

‘ఇంకొంచం చెవి ఒగ్గి విను స్వామీ’

‘గోవిందలే గానీ.. యేదో తేడా గోచరిస్తోంది నాయనా’

‘అదే స్వామీ నా బిత్తరకి కారణం’.

‘రోజూ గోవిందా అని శరణు కోరే భక్తుల గొంతులు ఈ దినం.. గోవిందా అని గద్దిస్తున్నట్టుగా ఉన్నాయేమి?’

‘వాళ్ల చేతుల్లో చూడు స్వామీ’.

‘భ..భ..భక్తా.. వాళ్ల చేతుల్లో ఆ దుడ్డుకర్రలేంది నాయనా?’

‘చేతుల్లో కర్రలు సరే.. వాళ్ల కాళ్లు కూడా జాగర్తగా చూడు స్వామీ..’

‘బిగిసిన పిక్కలు.. బిరబిరా నడక.. బిగించిపట్టుకున్న కర్రలు.. ఏందిది భక్తా? దర్శనానికి వస్తున్నారా.. దండెత్తి వస్తున్నారా?’

‘గుండె దడబుట్టి గదా స్వామీ.. భయంగా ఉండాది అనింది. ఆ మాటంటే.. నువ్వేమో యెటకారంగా నవ్వితివి’.

‘అయినా.. భయమెందుకు భక్తా? నేను దేవుణ్ణి .. భయం గియం జాన్తానై. వణికేది ఆపి.. ఇదిగో ఈ తీర్థం కాస్త తాగి నిమ్మళపడు. నా మనోనేత్రంతో అసలు సంగతి గ్రహిస్తాను’.

‘ఎందుకైనా మంచిది సంగతేందో తెలిసేదాకా అయినా ఎనక అడివిలో ఏ పొదలోనో, పుట్టలోనే తలదాచుకుంటే మేలేమో స్వామీ’.

‘నో వర్రీ.. మైడియర్‌ భక్తా.. మై.. హూనా!’

***

‘హ్హ..హ్హ..హ్హ..హ్హ.. ఆ కర్రలు పులుల కోసమేనోయ్‌! అనవసరంగా నువ్వు భయపడి, నన్ను కంగారు పెట్టావు’.

‘అవేమన్నా పిల్లులా కుక్కలా స్వామీ కర్రతో అదిలిస్తే తోక ముడుచుకోని కుయ్యో మియ్యాం అంటా బెదిరిపొయ్యేదానికి?’

‘యేమో నాయనా. నాకూ ఆ డౌటుందిగానీ.. కర్రని చూస్తే ఎంత పులి అయినా భయపడతాదని శాస్త్రంలో ఉండాదంటనే’.

‘అట్టా అని ఎవురు స్వామీ చెప్పింది?’

‘నా ప్రథమ సేవకుడు నాయనా’.

‘నా అమాయక చెక్రవర్తీ.. నీకు ఎప్పటికి అర్తమవతాదో యేమో.’

‘అదేంది నాయనా దేవుణ్ణి పట్టుకుని అట్లా అనేసినావు?’

‘అయినా రేత్రీ పొగులూ గుడిలోనే వుండే నీకు లోకం యాడ తెలిస్తిందిలే స్వామీ?’

‘అడివి మృగాల బెడద ఎక్కువైపోబట్టి గదా నాయనా ప్రాణాలు కాపాడుకోవడానికి భక్తులకి కర్రలిస్తా ఉండేది!’

‘పాపం... కడుపాత్రం స్వామీ.. భక్తులు తిని పారేసే వాటిల్లో మిగిలిందేమన్నా ఉండే ఏరుకుతిందామని, ఆ మెకాలు బాటల దెగ్గిర తిరుగులాడతా ఉండాయి!’

‘ఇంత అడవిలో మృగాలకి తిండి లేదంటావా ఏమి నాయనా. నువ్వు మరీ విచిత్రం కాకపోతే!’

‘యాడ స్వామీ... గొడ్డళ్లు, కత్తులు, టుపాకులు యేసుకోని ఎర్రసెందనం దొంగోళ్లు ఆగిత్తెం జేస్తావుంటే, అడివిలో అరువుగా బతకలేకనేగదా అవిటికి ఈ తిప్పలు’.

‘అయినా కర్రలు ఉత్తుత్తినే బెదిరించడానికే గదా భక్తా. ఇంతదానికి అంత ఆందోళన ఏల చెప్పు?’

‘కర్ర స్వామీ అది. అందునా దుడ్డుకర్ర.’

‘పట్టుకున్నది మనిషే గదా నాయనా. ఎంత లావు కర్ర అయినా పట్టుకున్న చెయ్యి మాటే గదా వినేది!’

‘అయ్యో.. యాడుండావు స్వామీ నువ్వు? ఇప్పుడు లోకం తీరు మారిపాయెనే. కర్ర మాటే గదా మనిషి యింటావుండాడు’.

‘ప్రజాస్వామ్యం అని రాజ్యాంగంలో రాసుకునింది మీరే గదా భక్తా?!’

‘అదంతా బుక్కుల్లోనే స్వామీ. ఇప్పుడు మా లోకంలో నడస్తా వుండేది ఈ దుడ్డుకర్రస్వామ్యమే!’

‘... ... ...’

‘దుడ్డుకర్ర పైకెత్తితే ఎంత మనిషైనా మాటినాల్సిందే స్వామీ. యింకన యీ పులులెంత జెప్పు. అదీ కర్రలిచ్చినోడి నమ్మకం’

‘ఇట్లయితే అంతా అల్లకల్లోలం, అశాంతి అయిపోదా బిడ్డా’

‘కర్ర ఎంత గెట్టిదైతే పరిపాలన అంత శాంతిగా సాగతాదని మా వోళ్ల సిద్దాంతరం స్వామీ’

‘ఏమో నాయనా అంతా గందరగోళంగా ఉండాది వింటూ ఉంటే. అయినా ఇదంతా మీ లోకంలో గొడవ. నాకు వచ్చే ముప్పేమి చెప్పు.’

‘నాకేమని జారిపోతే ఎట్టా స్వామీ? మా లోకంలో జరిగే మంచీ సెబ్బరా పట్టించుకుంటేనే గదా నువ్వు దేముడయ్యిండేది.’

‘మీది పెడద్రపు లోకం నాయనా. ఈ రచ్చా రావిడీ మనకెందుకు చెప్పు? నీ పని నువ్వు చేసుకోపో. నా మానాన నన్నూ గుళ్లో నిమ్మళంగా ఉండనీ’

‘అట్నే గానీ స్వామీ.. అయినా.. ఈ దినం పులులమిందకి ఎత్తిన కర్ర రేపు ఎవురి మిందకి ఎగబడతాదో యేమో.. అనేదే నా భయం బాధ.’

రామిశెట్టి సుబ్బయ్య

Updated Date - 2023-10-12T02:19:59+05:30 IST