ఎంత నిర్దయ
ABN , First Publish Date - 2023-10-17T01:27:30+05:30 IST
నిన్ను నీవు క్షమించుకోవటం చాలా కష్టం అంతరాత్మ ఒకటి ఏడ్చింది కదా! క్షణికావేశంలో తాగుబోతు భర్త మీది కోపంతో..
నిన్ను నీవు క్షమించుకోవటం చాలా కష్టం
అంతరాత్మ ఒకటి ఏడ్చింది కదా!
క్షణికావేశంలో తాగుబోతు భర్త మీది కోపంతో
చేసిన తప్పు
ఈ లోకం పరిధిని దాటి పాపమవుతుంది
నీ పిల్లలు పోయారు నీవు మాత్రం ఒడ్డు చేరావు
నీవు కడతేరలేదు కడ చూపుకు నోచుకోలేదు
వాళ్లను నదిలోకి విసిరేసిన
చేతుల సంకెళ్ళ చప్పుడులో నుంచి
ఆ పసిపిల్లల ఏడ్పులు, ‘అమ్మా’ అన్న పిలుపులు
భ్రమలై భ్రాంతులై బతికి వచ్చి
కడుపుకోతకు గురిచేస్తాయి
వాయిదాకు వాయిదాకు మధ్యన పీడకలల్లో
చంటిది పాలకోసం తడుముకున్నట్టు
అనిపించి చేతులతో వెతుక్కుంటావు
పెద్దోడు స్కూల్ నుంచి ఇంకా రాలేదంటూ
దిగ్గున లేచి కూచుంటావు
వాళ్ల బర్త్‌డే ఫోటోలను తలచుకొని
కుమిలి కుమిలి ఏడుస్తావు
ఒక జీవిత అసత్యం
నాటకీయంగా నిన్నొక కీలుబొమ్మను చేస్తుంది
నీవు కోర్టువారిని ఉరిశిక్షను అర్థించీ అర్థించీ
జీవచ్ఛవమైపోతావు
చివరి వాయిదా తర్వాత
కఠినాతి కఠిన చట్టం కూడా
కన్నీళ్ళు తుడుచుకొని
‘పరిస్థితుల కుట్రకు బందీ అయిన
దయనీయురాలి’గా భావించి
నిన్ను విడుదల చేస్తుంది!
ఏ తల్లికైనా ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదు
అమ్మంగి వేణుగోపాల్