ఎవరు పూచీ?
ABN , First Publish Date - 2023-10-17T01:21:03+05:30 IST
కలచివేసిన కల తొలచివేసిన కల అధికార హస్తాలు విసిరిన వల ఈ జ్ఞాన హృదయాల ముసిరిన విలవిల రోగమేలేదు దీటైనమందా...
కలచివేసిన కల తొలచివేసిన కల
అధికార హస్తాలు విసిరిన వల
ఈ జ్ఞాన హృదయాల ముసిరిన విలవిల
రోగమేలేదు దీటైనమందా
నేరమేలేదు ఘాటైన శిక్షా
పులిపంజన మేకపిల్ల
కత్తిఅంచున కన్నెపిల్ల
చితికిపోయిన ఆశలపల్లకి
చివికిపోయిన కోర్కెలపల్లవి
దుస్సహ నేపథ్యంలో పైశాచిక ఆనందం
దుర్మద సారథ్యంలో మృగయా వినోదం
ధూర్తదారుణకాండలో పీడిత సందోహం
దుర్నయమారణకాండలో తాడిత సందేహం
పిల్లలు చేయిదాటితేనే తల్లడిల్లే తల్లులుతండ్రులు
ఏకంగా దాటితే
ఎడతెగని శోకం ఎవరెరుగని శ్లోకం
రాబందుల రెక్కల చిక్కి
వాలిన పూబాల రాలిన పూమాల
నిర్నిబంధ నిలయంలో కనువిప్పిన జీవిక
నిర్హేతుక వాయిదాల పర్వంలో కనుమూసిన ప్రవల్లిక
నరలోక బాధలు వద్దని సురలోకయానం
ఇహలోక కలతలు వద్దని పరలోకపయనం
అరుదుగానో అలవాటుగానో
మారిన ఈ సంస్కృతికి
ఎవరు పూచీ?
కోటం చంద్రశేఖర్