మోసపోని చైతన్యం కోసం
ABN , First Publish Date - 2023-09-05T02:45:49+05:30 IST
‘అక్షరాలకు అద్దాలమేడ కట్టేస్తున్నాం’ అంటున్నారు, నిజమే కాబోలని రిసిపోతున్నాం. అద్దాలమేడ కట్టడంలో అందరం మునిగిపోయాం! ‘చలువ గదుల్లో చదువుని చల్లగా చూస్తాం’...
‘అక్షరాలకు అద్దాలమేడ కట్టేస్తున్నాం’ అంటున్నారు,
నిజమే కాబోలని మురిసిపోతున్నాం.
అద్దాలమేడ కట్టడంలో అందరం మునిగిపోయాం!
‘చలువ గదుల్లో చదువుని చల్లగా చూస్తాం’
అంటున్నారు,
అవును గావాలని మన చెమట చలువనంతా
నిప్పుల కొలిమిలో ధారపోసేస్తున్నాం!
‘మన సర్వస్వం పిల్లల బాగు కోసమే కదా’ అని,
కంచి మేకలమై తెగ మురిసిపోతున్నాం!
అద్దాలమేడలో అక్షరం ‘లక్షల లిఫ్టు’ ఎక్కి చేరుకునేవాళ్లకే
అని తెలిసిపోయినప్పుడు,
చలువ గదుల పగటి కలల చదువు
పెట్టి పుట్టిన పెద్ద మనుషుల పిల్లలకే
అని ఎరుకైపోయినప్పుడు,
చదువులమ్మని మట్టి బతుకుల్లోంచి
నయవంచనతో, నంగి నంగి మాటలతో
వెలివేస్తున్నారని స్పష్టమైపోయినప్పుడు,
నా చేతుల్లో నా విద్యనే, నా చేతులతోనే
ప్రపంచం పెద్ద బజారు తంత్రానికి తారుస్తున్నారనే
పచ్చినిజం
బహిరంగ రహస్యం అయిపోయినప్పుడు –
అక్షర దీపాలన్నీ పాపాల పుట్టలనీ,
జ్ఞాన కిరణాలన్నీ
అవినీతి గుట్టలనీ,
అక్షరాలు దిద్దించే చేతులు
దారుణ నేరాల పంకిలాలనీ,
డబ్బు హజం – ఓటు మదం –
కచ్చి కచ్చిగా బూకరిస్తోంది!
పదవీ వ్యాపార దాగుడుమూతల
నెత్తురు చదరంగం సాక్షిగా –
ఎవరు వచ్చినా, ఎవరు నిష్క్రమించినా –
గ్లో‘బలి’ రహస్య ఒడంబడికల
ప్రపంచ ఏక కేంద్రక నిరంతర మృత్యుహేల ఇది!
అమ్మడం – కొనడమే సంస్కృతి అయిపోయిన చోట
నాగేటి చాలు పురుడు పోసుకున్న
వేలవేల యేళ్ళ జ్ఞాన సంపద సర్వస్వం
సగటు బానిస సంకెళ్లలో నగుబాటై
బందీ అయిపోయినప్పుడు –
నా కడుపులో మండే అక్షరాలతో
నేనొక అగ్నిగర్భను!
నేనిప్పుడు నేను కాను,
‘మనం’లో అణువును!
అణువులో సంలీన శక్తిని!
మొక్కవోని సంఘటిత చలన పురోగామి కాలాన్ని!
నేనెప్పుడూ –
అనంత క్రాంతి జలపాతాల పాలపుంతనే!
ప్రజాసాహితి నాగరాజు