ఎట్టకేలకు స్వేచ్ఛ!

ABN , First Publish Date - 2023-02-03T01:10:00+05:30 IST

కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్‌ గురువారం ఉదయం లక్నో జైలునుంచి బయటకు వచ్చాడు. బెయిల్‌ పొందడానికే ఏళ్ళు పట్టి,...

ఎట్టకేలకు స్వేచ్ఛ!

కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్‌ గురువారం ఉదయం లక్నో జైలునుంచి బయటకు వచ్చాడు. బెయిల్‌ పొందడానికే ఏళ్ళు పట్టి, అది దక్కిన తరువాత కూడా జైలునుంచి బయటకు రావడానికి నెలలు పడుతున్న దుస్థితి విచారణలో ఉన్న ఖైదీలు ఎందుకు ఎదుర్కొంటున్నారో సుప్రీంకోర్టు తెలుసుకోవడం ముఖ్యం. కప్పన్‌ వంటివారికి కనీస హక్కులు కూడా దక్కకుండా చేస్తున్న వ్యవస్థలమీదా, అధికారులమీదా సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్రచేస్తే కానీ పరిస్థితి మారదేమో. కప్పన్‌ స్థితి గమనంలోకి ఉన్నందువల్లనో, యాదృచ్ఛికమో తెలియదు కానీ, ఆయన జైలునుంచి బయటకు వచ్చిన రోజునే బెయిల్‌ పొందిన ఖైదీల విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం అదేరోజున ఈమెయిల్‌ ద్వారా ఒక కాపీని ఖైదీకి, జెయిల్‌ సూపరెండెంట్‌కు పంపాలని, ఈ వివరాలను జెయిల్‌ అధికారులు ఈప్రిజన్స్‌ సాఫ్టవేర్‌లో నమోదుచేయాలని, ఏడురోజుల్లోగా ఖైదీ జెయిల్‌నుంచి విడుదలకాని పక్షంలో సూపరెంటెండెంట్‌ స్వయంగా ఖైదీతో మాట్లాడాలని, బయటకువెడితే కానీ పూచీకత్తు ప్రక్రియను పూర్తిచేయలేనని సదరు ఖైదీ చెప్పిన పక్షంలో న్యాయస్థానం నియమితకాలానికి తాత్కాలిక బెయిల్‌ మంజూరుచేసి సహకరించాలని ఈ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అప్పటికీ ఖైదీ ఆ పనిపూర్తిచేయలేకపోతే, న్యాయస్థానం బెయిల్‌ నిబంధనలను సడలించాలి. సామాజికార్థిక కారణాలరీత్యా బెయిల్‌ నిబంధనలను పూర్తిచేయవలసిన వారి విషయంలో అధికారులు, న్యాయస్థానాలు ఏమిచేయవచ్చునో కూడా సర్వోన్నతన్యాయస్థానం చెప్పింది.

ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైనది న్యాయస్థానాలు కనీసం కష్టసాధ్యమనుకున్న కేసుల్లోనైనా స్థానిక పూచీకత్తుకు ఆదేశాలు ఇవ్వకూడదన్నది. అత్యధికశాతం నిందితులు జైలులోనే ఉండిపోవడానికి ప్రధానకారణం ఈ నిబంధనే కనుక, వారి వెతలను దృష్టిలో పెట్టుకోవాలన్నది సారాంశం. సిద్దిఖీ కప్పన్‌కు గత ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు ‘ఊపా’ కేసులో బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ పెట్టిన మనీలాండరింగ్‌ కేసు కూడా నెత్తిమీద ఉన్నందున ఆయన జైలులోనే ఉండాల్సివచ్చింది. ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన దాదాపు నెలన్నర తరువాత, బుధవారం లక్నోకోర్టు బెయిల్‌ పత్రాలపై సంతకం చేయడంతో ఆయన బయటకు వచ్చాడు. పూచీకత్తు, వ్యవస్థల అలసత్వం కలసికట్టుగా ఆయనను వెంటనే బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డాయి.

ఇరవైనాలుగునెలలు జైలులో ఉన్న కప్పన్‌ బయటకురాగానే, నిరంకుశచట్టాలకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించాడు. బెయిల్‌ వచ్చినా కూడా జైల్లోనే కొనసాగేట్టు చేస్తున్న విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నాడు. ఒక పాత్రికేయుడిగా వృత్తిధర్మాన్ని నిర్వర్తించేపనిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో అడుగుపెట్టడం ఆయన చేసిన పాపం. హథ్రాస్ లో ఒక దళిత బాలిక సామూహిక అత్యాచారం, హత్య ఘటన 2020లో దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు కేరళనుంచి వెళ్ళిన కప్పన్ ను యూపీ పోలీసులు అరెస్టుచేశారు. మొదట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆరోపణ చేసి, ఆ తరువాత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతోనూ, నక్సల్స్ తోనూ సంబంధాలున్నాయనీ, మతవిద్వేషాలు రేకెత్తిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం యూపీ ప్రభుత్వం ఊపా ప్రయోగించింది. హథ్రాస్‌ ఘటన నివేదించడానికి మరే పాత్రికేయుడూ దేశంలోని మిగతాప్రాంతాలనుంచి యూపీలో కాలూనకుండా నిరోధించేందుకు పన్నిన కుట్ర ఇది. అనేక రకాల కేసులతో కప్పన్‌ను పాలకులు చుట్టేసిన నేపథ్యంలో, చివరకు అలహాబాద్‌ హైకోర్టు కూడా యూపీ ప్రభుత్వం మాదిరిగానే హథ్రాస్‌లో నీకేమి పని ప్రశ్నించి, ‘ఊపా’ విషయంలో బెయిల్‌ ఊసెత్తలేదు. ఊపా చట్టంలోని కొన్ని నిబంధనలు, 2019లో సుప్రీంకోర్టే వెలువరించిన ఒక తీర్పు దిగువన్యాయస్థానాలు ఊపా కేసుల్లో బెయిల్‌ ఇవ్వకుండా అడ్డుపడుతున్న స్థితిలో, గత ఏడాది చివరకు సుప్రీంకోర్టే కప్పన్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసివచ్చింది. ఈ కేసులో కుట్రలూ కుతంత్రాలు లేవని, ఒక బాధితురాలి పక్షాన నిలిస్తే దేశద్రోహం కాబోదని ప్రకటించి, చక్కని చొరవతో ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసుతో కప్పన్‌ మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సివచ్చి, బెయిల్‌ తెచ్చుకున్నా కూడా బయటకు రావడానికి ఇంతసమయం పట్టడం విచిత్రం. సుప్రీంకోర్టు ఇప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా అమలయ్యేట్టు చేసినప్పుడే వేలాదిమందికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడం సాధ్యపడుతుంది.

Updated Date - 2023-02-03T01:10:02+05:30 IST